సాగు సాగేదెట్టా ? | Farmers stranding | Sakshi
Sakshi News home page

సాగు సాగేదెట్టా ?

Published Thu, Jun 11 2015 3:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సాగు సాగేదెట్టా ? - Sakshi

సాగు సాగేదెట్టా ?

సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఖరీఫ్ సీజన్ ముంచుకువస్తోంది. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుకు ఆర్థిక వనరులను సమకూర్చలేదు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామన్న హామీని టీడీపీ ప్రభుత్వం  నెరవేర్చకపోవడంతో రైతులంతా బ్యాంకుల్లో డిఫాల్టర్లు అయ్యారు. పాత రుణాలు తీర్చనిదే కొత్త రుణాలు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తుండటంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించలేని దుస్థితిలో ఉన్నారు. సాధారణంగా జూన్‌లో మెట్టదుక్కులు, నారుమళ్లు సిద్ధం చేసుకోవడం, విత్తనాలు, ఎరువుల సేకరణ, పాత రుణాలు తీర్చి  కొత్త రుణాలు తీసుకునే పనుల్లో బిజీగా ఉంటారు.

ఇప్పుడాపరిస్థితి తారుమారు అయింది. పాత అప్పు తీర్చు...కొత్త అప్పు తీసుకో అనే ధోరణితో బ్యాంకర్లు వ్యవహరిస్తుండటంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వడ్డీ వ్యాపారాన్ని నిలిపివేసిన పెట్టుబడిదారులు మళ్లీ ఆ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆరు నెలల ఖరీఫ్ సీజన్‌కు మూడు రూపాయల వడ్డీతో రుణాలు ఇస్తున్నారు. దస్తావేజులు, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుంటున్నారు.

జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం 2.39 లక్షల హెక్టార్లు. వరి, పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటలు సాగవుతున్నాయి. సాధారణంగా ప్రతీ ఏటా జూన్ నాటికి బ్యాంకర్లు రైతులకు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ మొత్తంతో  రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడంతోపాటు వరి నాట్లకు అవసరమైన డబ్బును చేతిలో ఉంచుకుంటారు. 2014-15 లో రూ.3,797 కోట్లను పంట రుణాలుగా ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా తీసుకుంటే ఖరీఫ్ పూర్తయ్యేనాటికి రూ. 980 కోట్లను మాత్రమే రుణాలుగా ఇచ్చాయి. ఈ మొత్తంలో సహకార బ్యాంకులు ఇచ్చింది రూ.500 కోట్ల వరకు ఉంది.

ఈ బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వకపోయినప్పటికీ, పాత రుణాలు తీర్చినట్టు, కొత్త రుణాలు ఇచ్చినట్టు బుక్ ఎడ్జెస్ట్‌మెంట్లు చేశాయి. ఇక మిగిలిన రూ.480 కోట్లను రైతులు కొత్తగా రుణాలు తీసుకున్నారు. 2015-16లో ఖరీఫ్ సీజనుకు రూ.7,415 కోట్లు రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా తీసుకుంటే, ఇప్పటి వరకు రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఏడాది కాలంగా రుణమాఫీని అమలు చేస్తామని ప్రభుత్వం చేస్తున్న హామీలను దృష్టిలో ఉంచుకుని రైతులు పాత రుణాలను తీర్చలేకపోయారు.

డిఫాల్టర్లుగా మిగిలి పోయిన రైతులకు కొత్త రుణాలు మంజూరు కాకపోవడంతో ఆ రుణాల కేటాయింపు ఇప్పటికి నామమాత్రంగానే ఉంది.  ఈ ఖరీఫ్ సీజన్‌కు జిల్లా యంత్రాంగం 17 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలను సిద్ధం చేసింది. యూరియా 20,004 మెట్రిక్ టన్నులు, డీఏపీ 6,243 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు 10,083 మెట్రిక్ టన్నులు, పొటాష్ 1,149 మెట్రిక్ టన్నులను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

 గ్రామాల్లో పెరుగుతున్న వడ్డీ వ్యాపారులు ...
 బ్యాంకులు కొత్త రుణాల మంజూరు చేయకపోవడంతో రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో వడ్డీ వ్యాపారాన్ని మానేసిన పెద్ద రైతు లు, ధాన్యం వ్యాపారులు, మిల్లర్లు మళ్లీ ఆ బాట పట్టారు. ఆరు నెలల ఖరీఫ్ సీజ న్‌కు మూడు రూపాయల వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. ధాన్యం వ్యాపారులు ముం దుగా పెద్ద ఎత్తున విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సామాన్య రైతులకు అధిక రేటుపై అరువుకు విక్రయిస్తున్నారు.

ఈ విధానంలో రైతు ఆ మొత్తాలకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. రాజధాని నేపథ్యంలో వ్యవసాయ భూముల ధరలు కూడా పెరగడంతో దస్తావేజులు ఉంచుకుని, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకుని రుణాలు ఇస్తున్నారు. ఈ విధానంలో రైతులు మోసపోయే పరిస్థితులు దాపురించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement