చుట్టూ చెరువులు.. చేలు కుదేలు
చుట్టూ చెరువులు.. చేలు కుదేలు
Published Thu, Sep 15 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
నిడమర్రు : నిడమర్రు బాడవ ఆయకట్టులోని 250 ఎకరాల్లో ఖరీఫ్ వరినాట్లు పడలేదు. ఆ పొలాల చుట్టూ చేపల చెరువులు విస్తరించడమే ఇందుకు కారణమైంది. పొలాల్ని కౌలుకు పొలం ఇద్దామన్నా సాగుకు ఎవరూ ముందుకు రాలేదు. చేపల చెరువుల తవ్వకానికి అనుమతుల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో సరిహద్దు రైతులు నష్టపోతున్నారు. పొలాన్ని చెరువు తవ్వుకునేందుకు అనుమతి మంజూరు చేసేప్పుడు జీవో నంబర్ 7 ప్రకారం సరిహద్దు రైతుల అభ్యంతరాలు పరిగణలో తీసుకోవాలి. చెరువు చుట్టూ బోదె నిర్మించాలి. ఈ బోదె గట్టుకు వరి పొలం గట్టుకు మధ్య దూరం 3 మీటర్లు ఉండాలి. రొయ్యల సాగుకు ఎటువంటి అనుమతి లేదు. ఈ విషయాలు పరిశీలించకుండానే దరఖాస్తుదారులకు అనుమతులు లభిస్తున్నాయని రైతులు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితులే బాడవ ఆయకట్టుకు ముప్పు తెచ్చాయి. ఈ ఆయకట్టులో సుమారు 400 ఎకరాల్లో వరి పొలాలు ఉన్నాయి. ఆయకట్టుకు పడమరవైపు చేపల చెరువులు తవ్వేశారు. తూర్పు వైపు ఏలూరు రోడ్డు వద్ద చెరువులు తవ్వేందుకు అనుమతుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. 32 మంది సరిహద్దు రైతులు ఈ ఏడాది ఫిబ్రవరి 22న కలెక్టర్‌ను కలిసి చుట్టూ చెరువులు విస్తరిస్తే భవిష్యత్‌లో పొలాలకు వెళ్లేం దుకు మార్గం ఉండదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిశీలించి న్యాయం చేస్తామన్న మత్స్యశాఖ అధికారులు స్పందించలేదు. మే నెలలో 2 ఎకరాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఐదు రోజుల్లో అక్కడ చెరువులు తవ్వి బోర్లు వేసి రొయ్యల సాగు ప్రారంభించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement