ముదిరిన నారుతో ముప్పే
సిద్దిపేట రూరల్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ వ్యవసాయానికి గడ్డు కాలాన్నే మిగిల్చింది. ఇప్పటి వరకూ జిల్లాలోని ఏ ప్రాంతంలోనూ కనీస వర్షపాతం కూడా నమోదు కాలేదు. వరి నాట్ల కోసం పోసిన తుకాలు ముదిరిపోయాయి. ఈ క్రమంలో రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో 70 రోజుల నారును సైతం నాటేస్తున్నారు. ఇదే వీరి పాలిట శాపంగా మారుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నారు పోసిన 25 నుంచి 35 రోజుల్లోపు నాట్లు వేయాల్సి ఉన్నా మండలంలోని కొన్ని గ్రామాల్లో అవగాహన లేని పలువురు రైతులు ముదిరిన నారు కొనలను కత్తిరించి నాటేస్తున్నారు. బంజేరుపల్లికి చెందిన ఓ రైతు ఏకంగా సుమారు 70 రోజుల వరి నారును నాటు వేయడం కనిపించింది. ఇలాగైతే సరైన దిగుబడులు రాక నష్టపోయే ప్రమాదం ఉంది.
నారు ముదిరితే తెగుళ్లు వస్తాయి
వరి నారు పోసిన 25 నుంచి 35 రోజుల మధ్యలో నాటేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే 35 నుంచి 45 మించి వాడకూడదు. దీన్ని కూడా చివర్లు కత్తిరించి దగ్గర దగ్గరగా ఎక్కువ పిలకలు నాటాలి. దుక్కి మందును అధికంగా వాడాలి. ముదురు నారును నాటితే తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది.
- అనిల్‌కుమార్, ఏఓ, సిద్దిపేట, సెల్: 8886612490