మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటల సాగు సమయాన్ని ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. వానాకాలం ముందుగా చేపడితే యాసంగిలో సైతం మార్చి నాటికి పంట చేతికి వచ్చేలా సీజన్‌లను కుదించాలని నిర్ణయించింది. రైతులు వానాకాలంలో సాగునీటి వనరుల కింద సాధారణంగా జూన్ నుంచి నవంబర్ చివరి వరకు, వర్షాధారంతో జూన్ నుంచి డిసెంబర్ వరకు పంటల సాగు చేపడుతున్నారు. ఇలా చేయడం వల్ల తదుపరి పంటలకు వేసవిలో వడగళ్లు, అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లి రైతులు నష్టపోతున్నారు.
దీన్ని గుర్తించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భూముల స్థితిగతులపై సర్వే చేయించింది. జిల్లాలో పండుతున్న పంటలపై ప్రభుత్వం సమగ్ర వివరాలను పంపించాలని కోరడంతో వారం రోజులుగా క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణాధికారులు సర్వే చేస్తున్నారు. ఏటా అతివృష్టి, అనావృష్టితో పంటలకు నష్టం జరుగుతుండటంతో సాగుకాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా.. జిల్లాలో ఏయే పంటలు పండిస్తున్నారు, సాగునీటి సౌకర్యం ఎన్ని ఎకరాలకు ఉంది, వర్షాధారంగా ఎన్ని ఎకరాలలో పంటలు సాగు చేస్తారనే సమాచారాన్ని ప్రభుత్వం కోరింది. వ్యవసాయశాఖతో పాటు నీటిపారుదల, విద్యుత్ శాఖల భాగస్వామ్యంతో సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ కావడంతో వారం రోజుల పాటు సర్వే చేపట్టి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించనున్నారు.
● కరువు జిల్లాగా, వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన మహబూబ్‌నగర్‌లోని ఉన్న ఏకైక కోయిల్‌సాగర్ ప్రాజెక్టు తప్పితే ఈ జిల్లాలో నీటి వనరులపై ఆధారపడి చేస్తున్న సాగు తక్కువగానే ఉంది. మరోపక్క నిర్మాణంలో ఉన్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతుండటంతో సాగునీరు ఇప్పట్లో అందనే లేదు. దేవరకద్ర నియోజకవర్గంలో కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద వానాకాలంలో 35 వేల ఎకరాలు, యాసంగిలో 12 వేల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారు. నీటి పారుదల, వర్షాధారంపైనే ఈ ప్రాంత రైతులు పంటలు పండిస్తున్నారు. నీటి వనరుల కంటే వర్షాధారంపైన 1,49,741 ఎకరాలల్లో పంటల సాగవవుతోంది. వ్యవసాయ సమగ్ర సర్వేలో అధికారులు ఈ లెక్కలను పక్కాగా తేల్చారు.
ముందస్తు సాగు కోసం..
పంట చేతికి అందే సమయంలో ఏటా ప్రకృతి విపత్తుల కారణంగా నష్టం జరుగుతున్న నేపథ్యంలో పంట కాలాన్ని ముందుకు తీసుకెళ్లి.. రైతులు పంటలు సాగు చేసేలా వానాకాలం, యాసంగి ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాగు సమాచారాన్ని వ్యవసాయ విస్తరణాధికారులు ఏటా సేకరిస్తున్నారు. ఈ లెక్కలతో ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారనే కచ్చితమైన సమాచారం వస్తోంది. అయితే ఇప్పటివరకు సాగునీటి కింద, వర్షాధారం ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారనే వివరాలు నమోదు కావడం లేదు. పైగా శాఖల వారీగా సాగునీటి సమాచారం పొంతన లేకుండా ఉంది. సాగునీటి సౌకర్యం ఎన్ని ఎకరాలకు ఉంది.. విద్యుత్ వినియోగం ఎంత అవుతుందనే సమాచారంలో వ్యత్యాసం ఉంటుంది. క్లస్టర్ల వారీగా ఆయా శాఖల అధికారుల సమన్వయంతో సమగ్ర సమాచారం సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సమగ్ర సమాచారం సేకరించాం
ప్రభుత్వ ఆదేశాల మేర కు గ్రామాల వారీగా వర్షాధారంతో పాటు సాగునీటి సౌకర్యంతో పండించే విస్తీర్ణం ఎంత అనే వివరాలు సేకరించాం. సీజన్ ప్రారంభం కాగానే పంటల వారీగా సమగ్ర సర్వే ఉంటుంది. ప్రస్తుతం రైతులతో అనుబంధంగా ఉండే అన్ని శాఖల సమన్వయంతో సర్వే వివరాలు నమోదు చేశాం. కలెక్టర్ అనుమతితో ప్రభుత్వానికి నివేదించాం.
– బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment