యనమల రామకృష్ణుడు
హైదరాబాద్: రైతుల రుణ బకాయిలు చెల్లించడానికి పదేళ్లపాటు బ్యాంకులను గడువు కోరతామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. రైతుల రుణాలకు గ్యారంటీగా బ్యాంకులకు మూడు రకాల సెక్యూరిటీలు సమర్పిస్తామన్నారు. బేవరేజస్, ఇసుక, ఎర్రచందనంపై వచ్చే ఆదాయాలను ఎస్క్రో అకౌంట్‌ల ద్వారా చూపిస్తామని వివరించారు.
ఈ నెల 20న బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సుమారు లక్ష కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా పెట్టాలనుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించాక నిర్ణయిస్తామని మంత్రి యనమల తెలిపారు.