బీమాకు నామాలు! | Chandrababu Naidu government neglects to pay on loan waiver scheme for farmers | Sakshi
Sakshi News home page

బీమాకు నామాలు!

Published Sat, Aug 2 2014 3:35 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

బీమాకు నామాలు! - Sakshi

బీమాకు నామాలు!

* పంటల బీమాపై చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ
* రుణమాఫీ చేస్తున్నప్పుడు బీమా చెల్లించక్కర్లేదని అభిప్రాయం
* రూ. 600 కోట్లు ప్రభుత్వ ఖాతాలో వేసుకోవాలని నిర్ణయం
* కోటయ్య కమిటీ సిఫారసులకు ఆమోదముద్ర
* లక్షన్నర కన్నా ఎక్కువ బీమా వస్తే.. ఆ సొమ్ము మాత్రమే రైతులకు
* కానీ ఒక్కో రైతుకు రూ. 50 వేలకు మించి వచ్చే అవకాశమే లేదు

 
సాక్షి, హైదరాబాద్: రుణాలు చెల్లించలేదన్న కారణం చూపిస్తూ రైతుల సేవింగ్స్ ఖాతాలను స్తంభింపజేయడానికి ఒకవైపు బ్యాంకులు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు రైతులకు రావలసిన పంటల బీమాకు ప్రభుత్వం ఎగనామం పెట్టనుంది. రుణ మాఫీ పేరుతో రైతుల పంటల బీమా సొమ్మును సర్కారు ఖాతాలోకి జమ చేసుకోవాలన్న నిర్ణయానికొచ్చింది. గత ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి రైతులకు దాదాపు రూ.600 కోట్ల బీమా మొత్తం చెల్లించాల్సి ఉందని ప్రాథమికంగా లెక్కతేల్చారు. అయితే రుణ మాఫీ చేస్తున్నప్పుడు బీమా చెల్లించడమెందుకని భావిస్తున్న ప్రభుత్వం ఆ సొమ్మును తన ఖాతాలో వేసుకోనుంది. ఒక్కో కుటుంబానికి లక్షన్నర రూపాయల వరకు రుణం మాఫీ చేస్తున్నట్టు ప్రకటించినందున ఇక ఆయా కుటుంబాలకు వచ్చే బీమా సొమ్ములను రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదని కోటయ్య కమిటీ చేసిన సిఫార్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
 
 ఒక్కో కుటుంబానికి మాఫీ చేస్తున్న లక్షన్నర రూపాయలకు మించి బీమా సొమ్ము వస్తే ఆ ఎక్కువగా వచ్చే సొమ్మునే రైతులకు ఇవ్వాలని కోటయ్య కమిటీ సిఫారసు చేసింది. ఎలాగూ పంటల బీమా కింద రైతులకు లక్షల రూపాయల్లో సొమ్ము రాదు. ఒక్కో రైతుకు అత్యధికంగా వచ్చినా రూ.50 వేలకు మించి రాదు. అరుుతే ఆ రూ.50 వేలను కూడా మాఫీ కింద జమ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం చూస్తే ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయలను మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసినట్లవుతుందని, మిగతా రూ.50 వేలు రైతుల పంటల బీమా కింద వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి రైతు వ్యవసాయ రుణం తీసుకునే సమయంలో పంటల ఆధారంగా బీమా ప్రీమియంను కూడా చెల్లిస్తున్నారు. ఉదాహరణకు లక్ష రూపాయల వరకు పంటకు బీమా చేస్తే అందుకుగాను కొన్ని పంటలకు ఐదు శాతం, కొన్ని పంటలకు ఆరు శాతం చొప్పున రుణం మంజూరు సమయంలోనే ప్రీమియంను బ్యాంకులు మినహాయించుకుంటాయి. రాష్ట్రంలో మెజారిటీ రైతులు పంటల బీమా పథకం పరిధిలో ఉన్నారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

 గత ఖరీఫ్‌లో వేసిన పంటలు కోతలకు వచ్చిన సమయంలో అంటే గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇన్సూరెన్స్ కంపెనీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు కలిసి పంటల దిగుబడి ఆధారంగా ఇన్సూరెన్స్ సొమ్మును అంచనా వేస్తారు. ఆ మేరకు గత ఖరీఫ్‌లో పంటల బీమా కింద రైతులకు రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పంటల బీమా మొత్తంలో సగం కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద విడుదల చేస్తే.. మిగతా సగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సి ఉంటుందని ఆ అధికారి వివరించారు. రుణ మాఫీ హామీ సమయంలో చంద్రబాబు.. బీమా సొమ్మును మినహాయించి మాఫీ చేస్తానని ఎక్కుడా చెప్పకపోయినప్పటికీ కోటయ్య కమిటీ సిఫారసు ఆధారంగా ఈ కొత్త ఎత్తుగడ వేస్తున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement