వ్యవసాయ రుణ లక్ష్యం కాగితాల్లోనే
రీ షెడ్యూల్‌తో సరిపెడుతున్న బ్యాంకర్లు
టార్గెట్ కన్నా ఎక్కువ లక్ష్యం సాధించారట?
కొత్త రుణాల్లో అన్నదాతలకు మొండిచేయి
కౌలు రైతులపై కనికరం చూపని ప్రభుత్వం
సాక్షి, కొత్తగూడెం:
వ్యవసాయ రుణాల లక్ష్యసాధన కాగితాల్లోనే కనిపిస్తోంది. రైతులకు బ్యాంకర్లు మొండిచేయి చూపిస్తూ...పాతరుణాలనురీ షెడ్యూల్ చేస్తూ వాటిని సాధించిన లక్ష్యంలో కలుపుతున్నారు. కొత్తగా రుణం కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులకు రుణం ఇవ్వకుండా అనేక కొర్రీలు పెడుతున్నారు.
జిల్లాలో పంటలు సాగు చేస్తున్న రైతుల పరిస్థితి నాలుగేళ్లుగా దయనీయంగా ఉంది. పెట్టుబడి కూడా తిరిగి రాక ఆర్థికంగా చితికిపోయారు. గతంలో బ్యాంకులు, వ్యాపారుల వద్ద తీసుకున్న మొత్తాలకు చాలామంది రైతులు వడ్డీ చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ ఖరీఫ్, రబీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వడ్డీ వ్యాపారుల వద్ద మళ్లీ అప్పు చేసి పంటలు సాగు చేశారు. ఖరీఫ్‌లో దాదాపు పది లక్షల ఎకరాలకు పైగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగయ్యాయి.
అకాల వర్షాలతో చివరకు పెట్టుబడి కూడా చేతికి రాలేదు. రబీలోనూ లక్ష ఎకరాల్లో పలు పంటలు సాగవుతున్నాయి. అయితే ఖరీఫ్‌లో రూ. 1199 కోట్లు రుణ లక్ష్యం కాగా రూ. 1171 కోట్లు ఇచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రబీలో రూ.399 కోట్ల లక్ష్యానికి ఇప్పటి వరకు రూ. 104 కోట్లు ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాధించిన రుణ లక్ష్యంలో 80 శాతం వరకు రీషెడ్యూల్ చేసినవే కావడం గమనార్హం. బ్యాం కులో పంట రుణాల కోసం రైతు పడే ఇబ్బంది అంతాఇంతా కాదు. చెప్పులు అరిగేలా తిరిగి నిరాశతో వెనుదిరుగుతున్న రైతుల సంఖ్య వేలల్లో ఉంది. ఏటా ప్రభుత్వం రుణ ప్రణాళిక ప్రకటించి చేతులు దులుపుకుంటోంది. అర్హులైన రైతులకు కొత్తగా లోన్‌లు ఇవ్వకున్నా, రీషెడ్యూల్ చేస్తూ టార్గెట్ సాధించినట్లు బ్యాంకర్లు నివేదికలు ఇస్తున్నా ప్రభుత్వం అన్నదాతల గోడు పట్టించుకోవడం లేదు.
అన్ని బ్యాంకులదీ అదే బాట..
డీసీసీబీతో సహా అన్నిబ్యాంకులు రీషెడ్యూల్‌తోనే టార్గెట్ సాధించినట్లు రికార్డుల్లో మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాయి. గత ఐదేళ్లుగా ఏటా ఖరీఫ్, రబీలో ప్రకటిస్తున్న రుణ ప్రణాళికలో 80 శాతం వరకు రీషెడ్యూల్ చేస్తుండడం గమనార్హం. బ్యాంకర్లు తమ రుణ ప్రణాళికలో కూడా రీషెడ్యూల్ చేసే వాటినే టార్గెట్‌గా చూపిస్తున్నారు. జిల్లా రుణ ప్రణాళిక లక్ష్యం కన్నా .. ఎక్కువగా రుణం ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. దీంతో టార్గెట్ కొండంత చూపుతూ.. రుణాలు మాత్రం గోరంతగా ఇస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రీషెడ్యూల్ చేయడంతో పాటు పంట సాగుకు కొత్తగా కొద్దిమొత్తంలోనైనా రుణం ఇవ్వాలని రైతులు కోరుతున్నా బ్యాంకర్లు వారి ఆవేదనను పెడచెవిన పెడుతున్నారు. తీసుకున్న రుణాలను ఏటా తిరగరాస్తూ వ్యవసాయ రుణ లక్ష్య సాధనలో తాము ముందంజలో ఉన్నట్లు బ్యాంకర్లు ప్రకటించుకుంటున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
కౌలురైతులపై కనికరం ఏదీ..?
‘కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తాం.. వారికి ఇతర రైతుల మాదిరిగానే రుణాలు ఇస్తాం’ అంటూ ప్రభుత్వం ప్రతిఏటా ఆర్భాటపు ప్రచారం చేస్తోంది. తీరా సీజన్ ముందుకు రాగానే రుణం ఇవ్వకుండా చేతులెత్తేస్తోంది. కౌలు రైతులకు రుణ అర్హత గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రకటించింది. కానీ జిల్లాలో ఈ కార్డుల జారీ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇది తెలవకుండానే సంబంధిత అధికారులు కౌలు రైతులకు రుణాలు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. కౌలు రైతులు సంబంధిత పత్రాలతో బ్యాంకర్ల వద్దకు వెళ్తే.. ‘మీకు రుణం ఇచ్చే అర్హత లేదు’ అని చెప్పడంతో వారు వెనుదిరిగి పోతున్నారు.
తిరగరాశారు!
Published Sun, Feb 2 2014 2:39 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement