కొనసాగుతున్న కష్టాలు | The ongoing difficulties | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కష్టాలు

Published Sat, Jan 17 2015 6:10 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

కొనసాగుతున్న కష్టాలు - Sakshi

కొనసాగుతున్న కష్టాలు

  • వేలాది మంది గ్యాస్ వినియోగదారులకు అందని సబ్సిడీ సొమ్ము
  •  బ్యాంక్‌లు, ఏజెన్సీల చుట్టూ  తిరుగుతున్న జనం
  •  ఏమీ చేయలేమని చేతులెత్తేసిన బ్యాంకర్లు, డీలర్లు
  • నగరంలోని సూర్యారావుపేటకు చెందిన మహాలక్ష్మి డిసెంబర్‌లో గ్యాస్ కొనుగోలు చేశారు. సబ్సిడీ డబ్బు ఆమె బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ఆమె బ్యాంక్ ఖాతాలో మాత్రం పేమెంట్ హోల్డ్ అని ఉంది. సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో సంప్రదించగా తమకు సంబంధం లేదని బదులిచ్చారు. బ్యాంక్ అధికారుల వద్దకు వెళ్లగా ఆమె కొనుగోలు చేసిన గ్యాస్‌కు సంబంధించి ఎటువంటి నగదు రాలేదని చెప్పారు. దీంతో తాను ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా ఆర్థంకావడం లేదని మహాలక్ష్మి వాపోతున్నారు.
     
    కంకిపాడుకు చెందిన ఓ వినియోగదారునికి కూడా ఈ నెల మొదటి వారంలో కొనుగోలు చేసిన సిలిండర్‌కు సంబంధించిన సబ్సిడీ నగదు బ్యాంక్ ఖాతాలో జమకాలేదు. బ్యాంక్ అధికారులను సంప్రదించగా ‘ఫెయిల్డ్’ అని వస్తోందని, సబ్సిడీ డబ్బు వచ్చి వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారని ఆయన తెలిపారు. తన అకౌంట్‌లో జమ కాకుండా డబ్బు వచ్చి వెళ్లడం ఏమిటో అర్థం కావడం లేదని   ఆవేదన వ్యక్తంచేశారు. తిరిగి తనకు సబ్సిడీ మొత్తం రావాలంటే ఏంచేయాలో తెలియడం లేదని లబోదిబోమంటున్నాడు.
     
    విజయవాడ : గ్యాస్ వినియోగదారులను ఆధార్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆధార్ అనుసంధానం పూర్తయినప్పటికీ వేలాది మందికి సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమకావడం లేదు. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియక పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 74 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు 11లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.

    గత యూపీఏ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ కోసం ఆధార్ నంబరు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు గ్యాస్‌కు ఆధార్‌తో లింకును తొలగించింది. అయితే, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్ మళ్లీ మూడు నెలల క్రితం గ్యాస్ సబ్సిడీకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. ఆధార్ అనుసంధానం కాని వినియోగదారులకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు నేరుగా సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. ఆధార్ సీడింగ్ పూర్తయిన వారికి ప్రత్యేక సంస్థ ద్వారా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమచేస్తోంది. ఆధార్ అనుసంధానం కాని వారు ఫిబ్రవరి 14 నుంచి నుంచి గ్యాస్ సిలిండర్‌ను రూ.778లకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
     
    ఆధార్ సీడింగ్ పూర్తయినా తప్పని కష్టాలు
     
    బ్యాంక్ ఖాతాలు, గ్యాస్ ఏజెన్సీలో ఆధార్ నంబరు అనుసంధానం చేయించుకున్న వేలాది మందికి సబ్సిడీ సొమ్ము అందడం లేదు. గ్యాస్ సిలిండర్‌కు రూ.778 చెల్లిస్తున్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ ధర రూ.441.50 కాగా, సబ్సిడీ సొమ్ము రూ.336.50 వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.
     
    సబ్సిడీ సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో జమ కాకపోవడంతో ఒక్కో గ్యాస్ ఏజెన్సీ, బ్యాంక్ చుట్టూ వందలాది మంది వినియోగదారులు తిరుగుతున్నారు. కొందరి ఖాతాల్లో ఫెయిల్డ్ అని, మరికొందరి ఖాతాల్లో పేమెంట్ హోల్డ్ అని మెసేజ్ నమోదవుతోంది. కొందరికి సబ్సిడీ జమ అయి మళ్లీ వెనక్కి వెళ్లినట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. గతంలో ఆధార్ అనుసంధానం కోసం బ్యాంక్ ఖాతాలు తెరచి, ఆ తర్వాత మూడు నెలలు వాడకపోతే అవి రద్దయ్యాయని కొన్ని బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఆధార్ నంబరును తమ ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు.

    ప్రస్తుతం వినియోగదారులకు ఏమి చెప్పాలో కూడా అర్థంకావడం లేదని గ్యాస్ డీలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ బాబు.ఎ వెంటనే చమురు కంపెనీల అధికారులు, గ్యాస్ డీలర్లు, బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటుచేసి ఈ సమస్యను పరిష్కరించాలని వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement