అస్తవ్యస్తంగా గ్యాస్ రాయితీ
వ్యక్తిగత ఖాతాల్లో సక్రమంగా జమకాని సబ్సిడీ
బ్యాంకులు, ఏజెన్సీల చుట్టూ
తిరుగుతున్న వినియోగదారులు
ఎన్నిదఫాలు ఆధార్ ఇచ్చినా తప్పని తిప్పలు
ధర్మవరం : గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకం అస్తవ్యస్తంగా మారింది. వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు సక్రమంగా జమ కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా ఖాతాల్లోకి డబ్బులు జమకాని వినియోగదారులు చాలా మందే ఉన్నారు. సబ్సీడీకి సంబంధించి అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ (1800 2333 555) వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బాధితులు చెబుతున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో దాదాపు 30 వేల దాకా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ వినియోగదారులు ఇప్పటికే తమ ఆధార్, బ్యాంకుఖాతా, ఫోన్‌నంబర్, గ్యాస్‌నంబర్ లను గ్యాస్ ఏజెన్సీలలో ఒక దఫా, బ్యాంకులలో మరో దఫా అందజేశారు. దీంతో పాటు ప్రైవేటు ఇంటర్‌నెట్ సెంటర్లలోనూ కొందరు వినియోగదారులు తమ వివరాలను నమోదు చేయించారు.
తొలుత వినియోగదారులు ప్రభుత్వ సబ్సిడీతో కలిపి మొత్తం నగదును గ్యాస్ ఏజెన్సీలకు చెల్లిస్తే సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లోకి జమకావాలి. కానీ చాలా మంది వినియోగదారులకు ప్రభుత్వ మందించే సబ్సిడీ జమ కావడం లేదు. దీంతో బాధితులు బ్యాంకుల చుట్టూ తిరిగితే వారు తమకు సంబంధం లేదంటున్నారు. గ్యాస్ ఏజెన్సీలను అడిగితే ఇది తమ వ్యవహారం కాదంటున్నారు. మొత్తం మీద ఈ నగదు బదిలీ పథకం ద్వారా పూర్తి మొత్తం ప్రతి నెలా చెలిచి గ్యాస్ సిలెండర్లను కొనుగోలు చేయడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా మారింది. దీనిపై ప్రభుత్వం ఆలోచించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.