గుదిబండ
=పెరిగిన నాన్ సబ్సిడీ గ్యాస్ ధర
=ఆధార్ ఇవ్వకపోతే సిలిండర్ రూ. 1323
=రూ. 10 వ్యాట్ వడ్డన అదనం
=నేటినుంచే కొత్త ధరలు అమలు
=వినియోగదారుల బెంబేలు
కొత్త ఏడాది తొలిరోజునే యూపీఏ సర్కార్ గ్యాస్ వినియోగదారులపై నెత్తిన గుదిబండ పడేసింది. నాన్ సబ్సిడీ సిలిండర్ ధరను పెంచినట్లు ప్రకటించి గృహ వినియోగదారులను కూడా దొంగదెబ్బ తీసింది. గ్యాస్ ధర పెరగడంతో ఒక్కో సిలిండర్‌కు రూ. 10 చొప్పున వ్యాట్ భారం అదనంగా పడుతుంది. ఏడాదిలో సబ్సిడీపై తొమ్మిది సిలిండర్లు పొందినవారు ఆ తర్వాత నుంచి పెరిగిన ధర ప్రకారం రూ.1323 పెట్టి కొనుక్కోవాల్సిందే. ఆధార్ నంబర్ ఇవ్వనివారు గురువారం నుంచి కొత్త ధర పూర్తిగా చెల్లించడం మింగుడుపడని విషయం. ఇక కమర్షియల్ వినియోగదారులపై ఒక్కో బండకు రూ. 395 భారం పడింది.
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గ్యాస్ సిలిండర్ల గృహ వినియోగదారులను కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దొంగదెబ్బతీసింది. ప్రత్యక్షంగా చెప్పుకోదగిన భారం పడనట్లే కనిపించినా ఒక్కో వినియోగదారుడు ఈ నెలలో అదనంగా మరో రూ. 200 ముందుగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. నాన్ సబ్సిడీ సిలిండర్ ధర పెంచినట్లు చెబుతున్నా... పెరిగిన ధరను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చినా.. పేదలు, సామాన్య, మధ్యతరగతి వర్గాల వారు ప్రతి నెల అదనపు పెట్టుబడి పెట్టాల్సివస్తోందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పెరిగిన ధరల ప్రభావం జిల్లాలోని 74 గ్యాస్ ఏజెన్సీల్లో ఉన్న పది లక్షల డొమెస్టిక్, రెండు లక్షల కమర్షియల్ వినియోగదారులపై పడుతుంది. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసిన వినియోగదారులకే ఈనెల నుంచి గ్యాస్ సబ్సిడీ లభిస్తుందని డీలర్లు చెబుతున్నారు. అలా చేయని వారు నాన్ సబ్సిడీ ధర మొత్తం చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాల్సిందే.
పెరిగిన ధరలు ఇలా..
గత నెలలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ. 1868 ఉండగా, జనవరి నుంచి రూ. 2263కి పెంచారు. ఒక్కో బండపై రూ. 395 పెరిగింది. గృహ వినియోగదారులైతే ఏడాదికి తొమ్మిది సిలెండర్లు మించితే నాన్ సబ్సిడీ ధరపైనే కొనుగోలు చేయాలి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌కు గత నెలలో రూ. 1104 చెల్లించగా, రూ. 634 సబ్సిడీని ప్రభుత్వం వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అంటే 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 470లకు విక్రయించారు. పెరిగిన ధరల ప్రకారం ఈ నెలలో ప్రతి వినియోగదారుడు గ్యాస్ బుక్ చేసి ముందుగా రూ. 1323 చెల్లించాలి. ప్రభుత్వం రూ.843 సబ్సిడీని వినియోగదారుల ఖాతాల్లో జమచేస్తుంది. గ్యాస్ సిలిండర్ ధర రూ. 480 అవుతుంది. ఈ నెల నుంచి ప్రతి వినియోగదారుడు గ్యాస్ కొనుగోలుకు అదనంగా రూ. 200 పెట్టుబడి పెట్టాల్సిందే. ఇలా ప్రతి నెలా సిలిండర్‌కు రూ. 1323 పెట్టుబడిగా పెట్టడం పెనుభారమవుతుందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
డీలర్ల గగ్గోలు ..
పెరిగిన ధరలతో గ్యాస్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో లోడుకు రూ. 5 లక్షలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సివస్తుందని భయపడుతున్నారు. గురువారం నుంచే గ్యాస్ ధర పెరగడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడి సొమ్ము వెతుక్కోవలసి వస్తున్నదని వారు వాపోతున్నారు.