భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 40 ఏళ్లు. డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి మొదలై డిసెంబర్ 3 వరకూ కొనసాగిన విష వాయువులు ఆ ఒక్క రాత్రితో తమ ప్రభావాన్ని ఆపేయలేదు. అవి జన్యువుల్లో దూరి నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన వారికి నేటికీ అవకరాలతో పిల్లలు పుడుతున్నారు. ఏనాటి ఎవరి పాపమో ఇప్పటికీ వీళ్లు అనుభవిస్తున్నారు. అయితే వీరిలో కొందరు పిల్లలు పారా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపుతుండటం ఒక ఆశ. కాని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పడమే వీరు మనకు కలిగిస్తున్న చైతన్యం.
పదిహేడేళ్ల దీక్షా తివారి ‘ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ డిజార్డర్’ (ఐడిడి) రుగ్మతతో బాధ పడుతోంది. ఆ అమ్మాయిని బాల్యంలో గమనించిన తల్లిదండ్రులు మహేష్ తివారి, ఆర్తి తివారి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆయన ‘ఇది భోపాల్ గ్యాస్ విష ఫలితం’ అనంటే ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు.
‘అదెప్పటి సంగతో కదా’ అన్నారు. ‘అవును... ఇప్పటికీ వెంటాడుతోంది’ అన్నాడు డాక్టర్. దానికి కారణం భోపాల్ ఘటన జరిగినప్పుడు మహేష్ వయసు 5 ఏళ్లు, ఆర్తి వయసు 3 సంవత్సరాలు. వారు భోపాల్‌లో ఆ గ్యాస్‌ని పీల్చారు. కాని అది జన్యువుల్లో దూరి సంతానానికి సంక్రమిస్తుందని నాడు వాళ్లు ఊహించలేదు.
అదృష్టం ఏమిటంటే దీక్షా తివారి 2023 స్పెషల్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బాస్కెట్ బాల్‌లో రజత పతకం తేవడం. ఈ అమ్మాయే కాదు భోపాల్ విష వాయువు వెంటాడుతున్న చాలా మంది బాలలు భోపాల్‌లోని జేపీ నగర్‌ప్రాంతంలో అత్యధికం ఉన్నారు. వీరంతా తమ శారీరక, మానసిక లోపాలను, రుగ్మతలను జయించడానికి స్పోర్ట్స్‌ను ఎంచుకున్నారు. అథ్లెటిక్స్, సైక్లింగ్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. బతుకు జీవచ్ఛవం కాకుండా ఉండేందుకు క్రీడలు వారిని కాపాడుతున్నాయి. కాని ప్రభుత్వం వీరికి చేయవలసింది చేసిందా?
40 టన్నుల గ్యాస్
డిసెంబర్ 2, 1984 అర్ధరాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి అత్యంత ప్రాణాంతకమైన ‘మిథైల్ ఐసొసైనెట్’ విడుదలవడం మొదలయ్యి మరుసటి రోజు సాయంత్రం వరకూ వ్యాపించింది. దాదాపు 40 టన్నుల విషవాయువు విడుదలైంది. దీని వల్ల చనిపోయిన వారు అధికారికంగా 2,259 కాని 20 వేల నుంచి 40 వేల వరకు మరణించి ఉంటారని సామాజిక కార్యకర్తల అంచనా.
ఆ సమయంలో బతికున్నవారు జీవచ్ఛవాలుగా మారితే కొద్దిపాటి అస్వస్థతతో బయటపడిన వారూ ఉన్నారు. విషాదం ఏమంటే ఈ ఘటన జరిగినప్పుడు చంటిపాపలు, చిన్న పిల్లలుగా ఉన్నవారు ఆ ఘటన నుంచి బయట పడి అదృష్టవంతులం అనుకున్నారు కానీ వారికి యుక్తవయసు వచ్చి పిల్లలు పుట్టాక వారిలో అధిక శాతం దివ్యాంగులుగా, మానసిక దుర్బలురుగా మిగిలారు.
1300 మంది దివ్యాంగులు
‘‘భోపాల్ విషవాయువులు భోపాల్‌లోని 42 వార్డుల మీద ప్రభావాన్ని చూపాయి. ఆ 42 వార్డుల్లో దివ్యాంగ శిశువులు జన్మిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య అధికారికంగా 1300. వీరిలో అత్యధికులు అంధత్వం, సెరిబ్రల్ పాల్సీ, డౌన్ సిండ్రోమ్, మస్క్యులర్ డిస్ట్రఫీ, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.
వీరికి రెగ్యులర్‌గా థెరపీ అవసరం. కాని మా వద్ద వున్న వనరులతో కేవలం 300 మందికే సేవలు అందించగలుగుతున్నాం. మిగిలినవారికీ ఏ థెరపీ అందడం లేదు. వీరిలో చాలామంది పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు. ఈనాటికీ వీరికి నష్టపరిహారం అందలేదు’’ అని ‘చింగారి’ ట్రస్ట్ బాధ్యుడొకరు తెలిపారు. భోపాల్ విషవాయువు బాధిత దివ్యాంగ శిశువులకు ఈ సంస్థ వైద్య సహాయం అందిస్తుంది.
కల్లాకపటం లేని పిల్లలు
భోపాల్‌లోని జేపీనగర్‌లో కల్లాకపటం లేని అమాయక బాలలు చాలామంది కనిపిస్తారు. ముద్దొచ్చే మాటలు మాట్లాడుతూ అందరిలాగా ఆటలాడాలని, స్కూలుకు వెళ్లాలని, కబుర్లు చెప్పే వీరంతా చాలామటుకు బుద్ధిమాంద్యంతో బాధపడే పిల్లలే. కొందరు శరీరం చచ్చుబడ్డ వారే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన వీరంతా నిరసన కార్యక్రమం జరుపుతుంటారు. న్యాయం కోరుతుంటారు. కానీ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు అవుతున్నా వీరు రోడ్ల మీదకు వస్తూనే ఉండాల్సి రావడం బాధాకరం.
నీరు తాగి
భోపాల్ విషవాయులు భూమిలోకి ఇంకడం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికీ ఆ నీరు విషతుల్యం అయి ఉంది. వేరే దిక్కు లేక పేదలు ఆ నీరే చాలాకాలం తాగి ఇప్పుడు దివ్యాంగ శిశువులకు జన్మనిస్తున్నారు. ‘ఆటలాడే ఉత్సాహం ఉన్నా వీరికి ఆటవస్తువులు లేవు. హెల్త్ కార్డులు లేవు’ అని తల్లిదండ్రులు భోరున విలపిస్తుంటే ఏ పాపానికి ఈ శిక్ష అనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment