=కాఫీ ప్రాజెక్టులో అక్రమాలు వాస్తవమే
=గిరిజనుల వద్దకు అన్ని పథకాలు
=సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం
=న్యూస్‌లైన్‌తో ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్
పాడేరు, న్యూస్‌లైన్: మన్యంలో గిరిజనులకు మేలు చేకూర్చడానికి ఉద్దేశించిన కాఫీ ప్రాజెక్టులో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని, అన్యాయానికి గురైన అడవిబిడ్డలకు మేలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని ఐటీడీఏ పీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ చెప్పారు. ఏజెన్సీలో ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసి సమగ్రాభివృద్ధి సాధించాలన్నది తన లక్ష్యమని చెప్పారు. గిరిజనులకు అందుతున్న సేవల్లో లోపాలపై విస్తృత పరిశీలన జరిపానని, సమస్యల పరిష్కారంపై ఇక దృష్టి సారిస్తానని బుధవారం న్యూస్‌లైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రశ్న: ఏజెన్సీలోని కాఫీ ప్రాజెక్టు అక్రమాలపై మీ స్పందన ఏమిటి?
జవాబు: ఏజెన్సీలో 2009 నుంచి ఇంతవరకు నిర్వహించిన కాఫీ ప్రాజెక్టులో అక్రమాలు జరిగి నట్టు నిర్ధారణకు వచ్చా ను. అయితే పెండింగ్ చెల్లింపులు కూడా అధికంగా ఉన్నాయి. ఏ స్థాయిల్లో అక్రమాలు జరిగాయో విచారణ చేపడుతున్నాం.
ప్రశ్న: బాధిత రైతులకు ఏం చేస్తారు?
జవాబు: కాఫీ ప్రాజెక్టు ద్వారా కాఫీ సాగు చేపట్టిన రైతులందరికి న్యాయం చేస్తాం. వారికి చెల్లించాల్సిన ప్రోత్సాహక సొమ్మం తా అందిస్తాం.
ప్రశ్న: కాఫీ సాగు అభివృద్ధి మాటేమిటి?
జవాబు: అవినీతిని తుడిచిపెట్టి కాఫీ సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నది లక్ష్యం. ఏజెన్సీలో కాఫీ సాగును మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కాఫీ, సిల్వర్‌ఓక్ నర్సరీల ఏర్పాటు ద్వారా గిరిజన రైతులకు అన్ని విధాలా సహాయ పడతాం. ప్రోత్సాహక చెల్లింపులన్నీ సక్రమంగా జరుపుతాం.
ప్రశ్న : మౌలిక సౌకర్యాల కొరతను ఎలా అధిగమిస్తారు?
జవాబు : గిరిజన ప్రాంతాలను మౌలిక సదుపాయాల కొర త తీవ్రంగా వేధిస్తోంది. ఇందుకు నిధుల సమస్య కూడా ప్రతి బంధకంగా ఉంది. ఐఏపీ, టీఎస్పీ నిధులు పాడేరు ఐ టీడీఏకు భారీగా రానున్నాయి. అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అంచనాలు తయారు చేస్తున్నాం. అందుకు తగ్గట్టు అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం.
ప్రశ్న : రహదారుల సమస్యపై చర్యలేమిటి?
జవాబు : ఏజెన్సీలో రహదారుల అభివృద్ధికి దండిగా నిధులు మంజూరు అవుతున్నాయి. రహదారుల నాణ్యతపై దృష్టి పెడతాం. ప్రస్తుతం ఏజెన్సీలో 255 ముఖ్యమైన రోడ్డు పనులకు పీఎంజీఎస్‌వై ద్వారా భారీగా నిధులు మంజూరయ్యాయి. ఈ రోడ్డు పనులు సత్వరం పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షిస్తాం.
ప్రశ్న : మన్యంలో విద్యాభివృద్ధికి చర్యలేమిటి?
జవాబు : డ్రాపౌట్‌లు లేకుండా గ్రామాల్లో పిల్లలందరూ చదువుకోవాలనే లక్ష్యంతో ఉన్నాం. ప్రాథమిక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రస్తుతం సర్వే చేపడుతున్నాం.
ప్రశ్న : వైద్య సౌకర్యాల పరిస్థితి దయనీయంగా ఉంది.. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు?
జవాబు : ఏజెన్సీలోని 3,559 గ్రామాల్లో వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తాం. రెండేళ్లుగా మలేరియా తగ్గుముఖం పట్టడం సంతోషదాయకం. ఇదే స్ఫూర్తి తో ఏజెన్సీలో గిరిజనులకు మెరుగైన వైద్య సౌకర్యాలు లభించేలా శ్రమిస్తాం. వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృ తం చేస్తాం. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తాం. తొందరలోనే 22 అంబులెన్స్‌లు కూడా ఏజెన్సీకి రానున్నాయి.