అవినీతికి ‘సోర్స్’ | Corruption Source | Sakshi
Sakshi News home page

అవినీతికి ‘సోర్స్’

Published Thu, Jun 19 2014 3:24 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

అవినీతికి ‘సోర్స్’ - Sakshi

అవినీతికి ‘సోర్స్’

గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులను పర్యవేక్షించేందుకు గాను జిల్లా వ్యాప్తంగా మండల రిసోర్స్ కోఆర్డినేటర్లను నియమించాలని ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీఅయ్యాయి. మండలానికి ఒక పోస్టు చొప్పున 59 పోస్టులు మంజూరు చేశారు. వీటిని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా భర్తీ చేయాలని పేర్కొన్నారు. దీనికి గాను అభ్యర్థులకు నెలకు రూ.5వేలు, టీఏ, డీఏ రూ.125లు చొప్పున చెల్లిస్తారు. అయితే ఈ పోస్టులకు మాస్ కమ్యూనికేషన్ లేదా సోషల్ సైన్స్, రూరల్ స్టడీస్‌లో విద్యార్హత కలిగి ఉండి, కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నఅభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. కానీ అధికారులు వీటిన్నింటిని పక్కనపెట్టి ఇష్టానుసారంగా నియామకాలు చేశారు. ఫలితంగా అనేక మంది నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది.
 
   కమిటీ లేకుండానే...
 ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 4271 ప్రకారం సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏజెన్సీ ఎంపిక చేయాలి. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గాను, సభ్యులుగా డెప్యూటీ డైరక్టర్(ట్రెజరీ డిపార్ట్‌మెంట్), జిల్లా కార్మిక శాఖ అధికారి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులు ఉంటారు. కానీ పైన తెలిపిన కమిటీ సభ్యుల్లో జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి తప్పా.. మరెవరు లేకుండానే ఏజెన్సీని ఫైనల్ చేశారు. దీని వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది.
 
 ఇష్టారాజ్యంగా పోస్టుల భర్తీ
 అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు ఉపాధి కల్పన శాఖలో నమోదు చేసుకున్న నిరుద్యోగ యువతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ జాబితాలో సీనియారిటీ ఉన్న అభ్యర్థులను అర్హతల ప్రకారం ఎంపిక చేసి ఉపాధి కల్పించాలి. గతంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నియామకాల్లో ఇదే పద్ధతిని అనుసరించారు. అదే విధంగా ఉద్యోగాల భర్తీలో తప్పని సరిగా రోస్టర్ పాయింట్స్, రిజర్వేషన్లు పాటించాలి. కానీ ఈ నిబంధనలు ఏవీ కూడా ఇక్కడ అమలు కాలేదు. పైగా ఒక్కో పోస్టుకు అభ్యర్థుల నుంచి వేల రూపాయాలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
 
 లాటరీ ద్వారా ఎంపిక చేశాం..
 ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టు పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధిత ఏజెన్సీని లాటరీ ద్వారా ఎంపిక చేశామని జిల్లా ఉపాధి కల్పన అధికారి అక్బర్ హబీబ్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకే చేపట్టామని, కమిటీ సభ్యులు ఈ లాటరీలో పాల్గొనలేదని పేర్కొన్నారు. నాలుగు ఏజెన్సీలను ఆహ్వానించి లాటరీద్వారా ఓ ఏజెన్సీని ఎంపిక చేశామని వివరించారు.
 
 నిబంధనలు బేఖాతరు..
 అవుట్ సోర్సింగ్ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు మంజూరు చేసిన పోస్టులను భర్తీ చేసేందుకు ముందుగా ఏజెన్సీ ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీనికి గాను ఉపాధి కల్పన శాఖ టెండరు నోటీసు ఇచ్చి ఏజెన్సీ ఎంపిక చేయాలి. కానీ ఆర్‌డబ్ల్యూఎస్, ఉపాధి శాఖలు కుమ్మకై తమకు నచ్చిన ఏజెన్సీకి కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ‘లాటరీ’ విధానాన్ని తెరమీదకు తెచ్చారనే ఆరోపణలున్నాయి. టెండర్ల ద్వారా కాకుండా లాటరీ ద్వారా ఏజెన్సీ ఎంపిక చేయాలనే కొత్త విధానాన్ని ఆ రెండు శాఖలు అమలు చేశాయి. దీంతో తమకు అనుకూలమైన నాలుగు ఏజెన్సీలను ఎంపిక చేసి దాంట్లోంచి తాము అనుకున్న ఏజెన్సీ పేరును లాటరీ తీశారు. ఇంకేముంది ఉద్యోగాల భర్తీ కాంట్రాక్టు ఆ ఏజెన్సీ చేతికి చిక్కింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement