కాఫీకి అవినీతి చీడ
రూ.కోట్ల ప్రాజెక్టు అమలుకు తాత్కాలిక ఉద్యోగులు
అందినకాడికి స్వాహా చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది
జవాబుదారీతనం లేకుండా పోతున్న వైనం
ఆదివాసీ రైతుల ఆర్థిక ఆసరా కోసం బృహత్తర ఆశయంతో ఉపాధిహామీలో చేపట్టిన కాఫీ ప్రాజెక్టుకు అవినీతి చీడపట్టింది. రూ. వందల కోట్లు వెచ్చిస్తున్న దీని అమలు బాధ్యతను క్షేత్రస్థాయిలో తాత్కాలిక ఉద్యోగులకు అప్పగించడంతో జవాబుదారీతనం లేకుండా పోతోంది. మండలస్థాయిలో ఒకరిద్దరు పర్యవేక్షణ అధికారులు మినహాయిస్తే అందరూ కాంట్రాక్టు ఉద్యోగులే. వీరంతా అందినకాడికి బుక్కేయడంతో కాఫీ ప్రోత్సాహకాలు రైతులకు సక్రమంగా చేరడం లేదు. ఇలా ప్రాజెక్టు అమలులో వైఫల్యాలు, అక్రమాల వల్ల రైతులు నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇదే తరహాలో మరో ప్రాజెక్టు అమలుకు ఐటీడీఏ సన్నాహాలు చేస్తోంది. దీని అమలుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పాడేరు: మన్యంలో పెద్ద ఎత్తున సాగవుతున్న కాఫీ తోటల్లో నిర్లక్ష్యపు నీడ అలముకుంటోంది. ఐటీడీఏ ద్వారా గిరిజన రైతు ల భాగస్వామ్యంతో ఏటా వేలాది ఎకరా ల్లో చేపడుతున్న కాఫీ సాగుకు కాఫీబోర్డు సాంకేతిక సహకారం, నిధులు సమకూరుస్తోంది. కాఫీ తోటల పెంపకం బాధ్యతను ఐటీడీఏ నిర్వర్తిస్తోంది.ఇందుకు లైజన్ వర్కర్లను నియమించింది. 2009-10లో రూ.349 కోట్లతో ఎన్‌ఆర్‌ఈజీఎస్, కాఫీబోర్డు సంయుక్తంగా లక్ష ఎకరాల్లో సాగు లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. క్షేత్రస్థాయిలో అమలుకు లైజన్ వర్కర్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లోని వీఆర్పీ, టెక్నికల్ అసిస్టెంట్ వంటి తాత్కాలిక ఉద్యోగులను నియమించారు. ఒక్క జి.మాడుగుల మండలంలోనే రూ.83 లక్షలు అవినీతి వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో తాత్కాలిక ఉద్యోగులైన లైజన్ వర్కర్లు, ఉపాధిహామీ సిబ్బందిని తొలిగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇంతవరకు 16 మందిని అరెస్టు చేశారు. బినామీ ఖాతాల్లో చేరిన సొమ్ము రికవరీ ఊసేలేదు. ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు తోటలు వేసిన కాఫీ రైతులకు వరుసగా రెండేళ్లు ప్రోత్సాహక సొమ్ము సక్రమంగా పంపిణీ కాలేదు. అప్పట్లో 2013 వరకు రూ.45.45 కోట్లు ప్రభుత్వం బ్యాంకుల నుంచి కాఫీ తోటల పెంపకం కోసం నిధులు విడుదల చేయగా ఇందులో రైతులకు సుమారు రూ.33 కోట్లు అందలేదు.
దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. గిరిజన కాఫీ రైతులు ప్రోత్సాహక సొమ్ము కోసం ఐటీడీఏ వద్ద ఆందోళనలు చేపట్టారు. పెదబయలు, డుంబ్రిగుడ మండలాల్లో సామాజిక తనిఖీల్లో అక్రమాలు వెలుగు చూశాయి. దోషులను గుర్తించారు. ఏపీ గిరిజన సంఘం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విఎన్‌కే శాస్త్రి, ప్రొఫెసర్ ఎం.ప్రసాదరావు, రిటైర్డ్ సీఐ బాబూరావు, హైకోర్టు న్యాయవాది పార్థ సారధిలతో వేసిన నిజ నిర్ధారణ కమిటీ సుమారు 400 గ్రామాలలో పర్యటించింది. 10 వేల మంది రైతులను కలిసింది. చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు నిర్ధారించింది. ఐతే బాధ్యులపై ఎటువంటి చర్యలు లేవు. కాఫీ రైతుల ఆందోళనలతో సుమారు రూ.20 కోట్లు కొందరికి చెల్లించారు. ఈ పథకం కింద తొలుత గ్రామైక్య సంఘాల ద్వారా కాఫీ రైతులకు చేపట్టిన చెల్లింపులు చివరికి బ్యాంకు ఖాతాల ద్వారా చేపట్టినా అక్రమాలు ఆగలేదు. తోట వేసే ప్రతి రైతుకు వరుసగా నాలుగేళ్లు ప్రోత్సాహక సొమ్ము చెల్లించవలసి ఉంది. ఉపాధిహామీలో తోటలు వేసిన రైతుల కోసం మరో మూడేళ్లు ఈ పథకాన్ని కొనసాగించాలి. అయినప్పటికీ ఈ ఏడాదితో ఈ ప్రాజెక్టు అర్ధంతరంగా నిలిచిపోతోంది. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం కొత్తగా రూ.526 కోట్లతో మరో ప్రాజెక్టు అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. దీని అమలుకూ కాంట్రాక్టు ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి ఐటీడీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులోనూ అక్రమాలకు తావుండకపోదన్న వాదన వ్యక్తమవుతోంది.