ఏజెన్సీలోని ఈ పంటకు బంగారు భవిష్యత్
ప్రభుత్వ కాఫీ సలహాదారుడు కృష్ణారావు
పాడేరు : విశాఖ ఏజెన్సీలోని కాఫీ పంటకు బంగారు భవిష్యత్ ఉందని రాష్ట్ర ప్రభుత్వ కాఫీ సలహాదారులు కృష్ణారావు అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో కాఫీ సాగుకు సంబంధించి గిరిజన సంక్షేమ డెరైక్టర్ ఎం.పద్మ, జీసీసీ ఎండీ డి.రవిప్రకాష్,ఇతర అధికారులతో కలిసి ఆయన స్థానిక అధికారులు,కాఫీ రైతులతో గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సలహాదారులు కృష్ణారావు మాట్లాడుతు పాడేరు, అరకు ప్రాంతాల్లో గిరిజనులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీకి అంతర్జాతీయంగా పేరుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సమావేశంలోను ఈ ప్రాంత కాఫీ సాగు గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారని ఆయన తెలిపారు. కాఫీ రైతులకు మార్కెటింగ్ సౌకర్యంతోపాటు నాణ్యమైన కాఫీ గింజలను తయారు చేసేందుకు ప్రొసెసింగ్ యూనిట్లను నెలకొల్పుతామన్నారు. ఏజెన్సీలోని కాఫీ సాగు ద్వారా మరింత అధిక దిగుబడులకు అవసరమైన చర్యలను కూడా చేపడతామన్నారు.
కాఫీ పంటకు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లకు ప్రత్యామ్నాయంగా పనస, నారింజ, కమల, సంపెంగ తదితర చెట్లను పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా రైతులకు అదనపు ఆదాయం పుష్కలంగా ఉంటుందన్నారు. ఏజెన్సీలోని కాఫీ సాగును విస్తరించేందుకు అవసరమైన చర్యలపై ఐటీడీఏ ఉద్యానశాఖ అధికారులు, కాఫీ సబ్ అసిస్టెంట్లతో కూడా ఆయన సమీక్షించారు. ఐటీడీఏ పీవో హరినారాయణన్, గిరిజన సంక్షేమశాఖ ఏడీ పి.చినవీరభద్రుడు, ట్రైకార్ డీజీఎం ఆదినారాయణరావు, కేంద్ర కాఫీబోర్డు డిప్యుటి డెరైక్టరు రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పలువురు రైతుల అభిప్రాయాలు
కాఫీ సాగుకు సంబంధించి ఏజెన్సీలోని పలువురు కాఫీ రైతులు తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో తెలిపారు. పాడేరు మండలం లాడాపుట్టు గ్రామానికి చెందిన బోద నారాయణ మాట్లాడుతు కాఫీ పంటకు మార్కెటింగ్ సదుపాయం లేనందున దళారీ వ్యాపారులంతా మోసాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కిలో కాఫీ గింజలను రూ.180 నుంచి 200 ధరతో అమ్మకాలు జరపగా ఈ ఏడాది మాత్రం రూ.150 నుంచి 155 ధరతోనే కొనుగోలు చేస్తుండటంతో ఆర్థికంగా నష్టపోయామని వాపోయారు.
ధాన్యం మిల్లుల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లను పంపిణీ చేస్తే నాణ్యమైన కాఫీ గింజలను కూడా తయారు చేయగలమన్నారు. హుకుంపేటకు చెందిన రైతులు బొండా వెంకటరమణ, బోయిన సన్నిబాబు, చిట్టినాయుడులు మాట్లాడుతు నాంది సంస్థకు కాఫీ సాగుతో ఆర్థికంగా లాభాలు వస్తున్నా మార్కెటింగ్ సౌకర్యానికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. నాంది సంస్థకు పండ్లనే కిలో రూ.25 అమ్ముకుంటున్నామన్నారు. కాఫీ రైతులకు సొసైటీలను ఏర్పాటు చేసి పంట దిగుబడిని ఒకేసారి అమ్మకాలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నాంది ఫౌండేషన్ ప్రతినిధి వినోద్ హెగ్డే మాట్లాడుతు నాంది ఫౌండేషన్ ద్వారా కాఫీ రైతులకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తున్నామన్నారు.
నాణ్యమైన కాఫీకి ప్రణాళిక
Published Fri, Jan 30 2015 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement