అమ్మో అక్టోబర్ !
- ప్రస్తుతం ‘హుదూద్’ ముప్పు
- జిల్లాకు భారీ వర్ష సూచన
- ఆందోళనలో తీరప్రాంత వాసులు
- వేటకు విరామం ప్రకటించిన మత్స్యకారులు
- ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ
చల్లపల్లి : 2011 అక్టోబర్ 6న ‘జల్’.. 2012 అక్టోబర్ 31న ‘ నీలం’.. 2013 అక్టోబర్ 10న పైలీన్.. ఇలా మూడేళ్లు వరుసగా అక్టోబర్‌లో తుపాన్లు సంభవించాయి. జిల్లాకు తీవ్ర నష్టం కలిగించాయి. హుదూద్ తుపాను కూడా ఇదే నెలలో రావడంతో తీర ప్రాంతవాసులు అక్టోబర్ అంటేనే వణికిపోతున్నారు.
అల్లకల్లోలంగా సముద్రం
హుదూద్ పెను తుపాను ప్రభావం వల్ల జిల్లాలోని తీర ప్రాంతాల్లో శనివారం సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాధారణం కన్నా మూడు నుంచి ఐదడుగుల మేర ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి. కోడూరు మండలంలోని సాగరసంగమం వద్ద ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలు రానున్న ఉపద్రవానికి సంకేతాలని మత్స్యకారులు చెబుతున్నారు.
విశాఖపట్నానికి సమీపంలో కేంద్రీకృతమైన హుదూద్ తీరం దాటే సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో గంటకు 150 నుంచి 170 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చేస్తున్న హెచ్చరికలు తీరప్రాంత వాసులను కలవర పెడుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు మూడు రోజుల క్రితమే వేటను నిలిపివేశారు. వేటకు ఉపయోగించే పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు.
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ
తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే కోడూరు, నాగాయలంక, మోపిదేవి, అవనిగడ్డ, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వారు ఇప్పటికే ఆయా మండలాల్లో పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు.
తుపాను తీవ్రతను బట్టి కోడూరు మండలంలోని తీరప్రాంత గ్రామాలైన పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, రామకృష్ణాపురం, బసవానిపాలెం, చింతకోళ్ల, నాగాయలంక మండలంలోని గుల్లలమోద, ఎదురుమొండి దీవులు, ఈలచెట్లదిబ్బ, సొర్లగొంది, సంగమేశ్వరం ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.
తుపాను వల్ల ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలని జిల్లా అధికారులు కోరుతున్నారు. ఈదురుగాలుల వల్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.