వర్షాలపై అలెర్ట్!
అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్
మత్స్యకారులు వేటకెళ్లొద్దని సూచన
చింతపల్లిలో 12 సెం.మీల వర్షపాతం
విశాఖపట్నం: జిల్లాలో కురుస్తున్న వర్షాలపై అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. భారీ వర్షాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. జిల్లాలోని చింతపల్లిలో 12 సెం.మీల వర్షపాతం నమోదు, రానున్న 24 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ స్పందించారు. ఇందులోభాగంగా రెవిన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు హెడ్‌క్వార్టర్లలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సంబంధిత అధికారులు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని వరద నీరు పోటెత్తే అవకాశం ఉందని, నదులు దాటేందుకు ప్రయత్నించ వద్దని, వీఆర్‌వోలు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ఒక భవనాన్ని అందుబాటులో ఉంచాలన్నారు.
శిథిలావస్థలో ఉన్న పాఠశాల, అంగన్వాడీ భవనాల్లో తరగతులు నిర్వహించ వద్దని, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి తక్షణమే రేషన్, అవసరమైన మందులు సమకూర్చాలని ఆదేశించారు. రేషన్ సరకుల నిల్వలను తనిఖీ చేసి, మండల స్థాయిలో స్టాకు సరిపడా ఉండేలా చూడాలన్నారు. అవసరమైతే మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే పోలీసులకు కూడా సమాచారం అందించి వారి సేవలు వినియోగించు కోవాలని అధికారులను కోరారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు.