హుదూద్ తుపాను ధాటికి దారుణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను అతి త్వరలో ...
ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్
సీతమ్మధార(విశాఖపట్నం)/విజయనగరం: హుదూద్ తుపాను ధాటికి దారుణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను అతి త్వరలో సాధారణ స్థితికి తెచ్చేందుకు విద్యుత్‌శాఖ యుద్ధప్రాతిపదికన కృషి చేస్తున్నట్టు ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ వెల్లడించారు. మరో మూడు రోజుల్లో విశాఖ నగర ప్రజలకు 80 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖపట్నం, విజయనగరంలలో విలేకరులతో మాట్లాడారు. మొత్తంమీద విద్యుత్ శాఖకు రూ.1,200 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు. 74 విద్యుత్ టవర్లు తుపాను ధాటికి కుప్పకూలిపోయాయన్నారు.
440 కేవీ టవర్స్ 34, 220 కేవీ టవర్స్ 20, 132 కేవీ టవర్స్ మరో 20 ధ్వంసమయ్యాయన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 25వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయన్నారు. వీటిలో విజయనగరం జిల్లాలో 8 వేలు, విశాఖ జిల్లాలో 15 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 2వేలు స్తంభాలు కూలిపోయాయన్నారు.
కాగా ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. విశాఖ నగరానికి సంబంధించి ఏడులక్షల మంది వినియోగదారులకుగానూ.. ఇప్పటి వరకు రెండులక్షల 70 వేల మందికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు చెప్పారు. సహాయక చర్యల్లో కష్టించి పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక ఇన్సెంటివ్‌లతోపాటు పదోన్నతుల్లో ప్రాధాన్యమిస్తామని తెలిపారు.