వర్ష బీభత్సం
మునగపాక : హుదూద్ తుపానుతో మండలంలో భారీ నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఒకవైపు భారీ ఈదురు గాలులు మరోవైపు వర్షాలు పడడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి వాతావరణం అల్లకల్లోలంగా ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విపరీతమైన గాలులతో చెట్లు పలుచోట్ల పడిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్త స్తంభించిపోయింది.
ఇళ్లల్లోనుంచి బయటకు రావడానికి ప్రజలు వణికిపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. చాలా చోట్ల పూరిళ్లు నేలకొరిగాయి. గాలలకు చెరకు తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు వరిపొలాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ఆయా ప్రాంతాల వారు ఇబ్బందులు పడ్డారు.
అరకు రూరల్ : హుదూద్ తుపాను బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి నుంచి వీచిన బలమైన గాలలుకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విశాఖ నుంచి అరకు వరకూ ఉన్న రహదారి మొత్తం నేల కూలిన చెట్లతో నిండిపోయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పద్మాపురం జంక్షన్ నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎల్లమ్మ తల్లి గుడి వద్ద, అరకు లోయ వరకూ రహదారంతా నేలకూలిన చెట్లతోనే నిండిపోయాయి. పుట్టగొల్లడ, అట్టగుడ, ఒసుబడల్లో గెడ్డలు పొంగిపొర్లాయి. దీని వల్ల సుంకరమెట్ట వారపు సంతకు వెళ్లిన వారివారి ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. చాలా మంది వారికి తెలిసిన వారి ఇళ్ల వద్దే ఉండిపోయారు.