సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్క ములుగు జిల్లాలోనే 30 మందికిపైగా వరదల్లో గల్లంతు అయినట్లు సమాచారం. అంతటా గల్లంతైన వాళ్ల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. జంపన్న వాగు ఉగ్రరూపంతో ఏడుగురు గల్లంతు అయ్యారు. వాగు పోటెత్తి కొండాయి, మల్యాల గ్రామాలను ముంచెత్తింది. ఏడుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతులను మజీద్, షరీఫ్, అజ్జు, గుర్తు తెలియని ఓ మహిళ ఉన్నారు.
ఇక.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొరంచ వాగు ఉధృతితో నిన్న మొరంచపల్లి గ్రామం నీట మునిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉదయం కల్లా వాగు ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు పునరావాస కేంద్రాల్లో మొరంచపల్లి గ్రామస్తులు ఉన్నారు. గల్లంతైన నలుగురు గ్రామస్తుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. భూపాలపల్లి-పరకాల-హన్మకొండ జాతీయ రహదారి మరమతు పనులు చేపట్టారు అధికారులు. మొరంచపల్లి లో వరదలకు 100కు పైగా పశువులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేటలో విషాదం చోటుచేసుకుంది. మారేడుగొండ చెరువుకు గండిపడి ముగ్గురు సభ్యులున్న కుటుంబం కొట్టకుపోయింది. అందులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యంకాగా.. మిగతా ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
వరద కారణంగా ములుగు-ఏటూరు నాగారం బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రాణ నష్టం లేకుండా చూడాలంటూ సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ సైతం తాజాగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే కురిసన వర్షాలు, వరదలతో.. భూపాలపల్లి, ములుగుతో పాటు ఉమ్మడి వరంగల్‌లోని మహబూబాబాద్, అలాగే సిద్ధిపేట, నిజామాబాద్, హన్మకొండ, రంగారెడ్డి జిల్లాల్లోనూ మరణాలు సంభవించాయి. వరదల్లో కొట్టుకుపోయి.. గోడలు కూలి.. కరెంట్‌షాక్ మరణాలు సంభవించాయి. తెలంగాణ వ్యాప్తంగా అధికారులు 14 మందే చనిపోయారని ప్రకటించినప్పటికీ.. ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment