the rains
-
అన్నదాతల కలవరం
తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ప్రకటనలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు రోజులుగా ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తుండడం అన్నదాతలో గుబులు రేపుతోంది. కొన్ని ప్రాంతాల్లో వరిపంట కోత, గింజ, చిరుపొట్ట దశలో ఉంది. పల్నాడు ప్రాంతంలో పత్తి పంట పూత, గూడ, పిందె దశలో ఉంది. ఈ సమయంలో వర్షాలు కురిస్తే పంట నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నదాతలు కలవరపాటుకు గురవుతున్నారు. మాచర్లటౌన్/నగరం: ఈశాన్య రుతుపవనాల కారణంగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి రైతులను కలవరానికి గురిచేస్తోంది. తుపాను కారణంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జిల్లావ్యాప్తంగా వరి, పత్తి, కంది, కూరగాయలు సాగు చేస్తున్న అన్నదాతలు తుపాను భయంతో అంతర్మథనం చెందుతున్నారు. జిల్లాలో వరి 2,52,645 హెక్టార్లలో సాగవుతోంది. ఇందులో వెద పద్ధతిలో 1,32,075 హెక్టార్లు, సాధారణ పద్ధతిలో 63,069 హెక్టార్లు సాగు చేస్తున్నారు. పత్తి 1,98,809 హెక్టార్లు, కంది 20,242 హెక్టార్లలో సాగు చేశారు. పత్తి పిందెలు రాలే ప్రమాదం..: పత్తి దిగుబడుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీపావళి నుంచి మైల పత్తి దిగుబడులు ప్రారంభమయ్యాయి. పత్తి పంట పూత, గూడ, పిందె దశలో ఉంది. ఈ సమయంలో వర్షం పడితే పత్తిలో పూత, గూడ, పిందెలు రాలిపోతాయి. కొద్దిగా పగిలి ఉన్న కాయలు, కోతకు సిద్ధంగా ఉన్న పత్తి రంగు మారి నాణ్యత లేకుండా పోయే అవకాశం ఉంది. ఖరీఫ్‌లో సరైన సమయంలో జిల్లా వ్యాప్తంగా ఒకేసారి వర్షాలు కురవకపోవటంతో కందిపంట వివిధ దశల్లో ఉంది. రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు ఉన్న పంటకు నష్టం లేకున్నా పూతదశలో ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. పూత దశలో పచ్చగా ఉన్న పూలపై వాన పడితే వర్షపు నీటి దాటికి పూత రాలుతుంది. ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు.. కూరగాయలు, పూలు సాగు చేసుకుంటున్న రైతులు తుపాను హెచ్చరికలతో అంతర్మథనం చెందుతున్నారు. టమాట, దోస, కాకర వంటి పైర్లపై నీరు చేరితే పంట నష్టం అధికంగా ఉంటుంది. కూరగాయల ధరలు ఆకాశానంటుతున్న తరుణంలో వర్షం కురిసి నష్టం జరిగితే ధరలు ఆకాశన్నంటుతాయి. కష్టాలను అధికమించి దిగుబడుల స్థాయికి వస్తే తుపాను గండంతో రైతుల పరిస్థితి క్షణం భయపడుతున్నారు. నెరవేరని లెవి లక్ష్యం.. వర్షాభావంతో జిల్లాలో కరవు పరిస్థితులు దాపురించాయి. కనీస స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవటంతో ప్రభుత్వం జిల్లాలో 26 కరవు మండలాలను ప్రకటించింది. కరువు ఉందని, లేదని చెబుతున్న మండలాల్లో అనేకచోట్ల రైతులు బోర్ల కింద పంటలను సాగు చేస్తున్నారు. ఆయా పంటలు చీడపీడల దాటిని తట్టుకొని దిగుబడుల దశకు వచ్చాయి. వరిపంట కోత, గింజ, చిరుపొట్ట దశలో ఉంది. భారీగా కాకపోయినా ఓ మోస్తరు వర్షం కురిసినా నోటికాడికి వచ్చిన పంట చేతికందకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వరి విస్తీర్ణం తక్కువ కావటంతో ధాన్యం లెవి లక్ష్యం నెరవేరే అవకాశం లేకుండా పోయింది. వర్షాలు కురిస్తే లెవి లక్ష్యం ఊహకందకుండా పోయే అవకాశం ఉంది. డెల్టాలో వరి పంట ప్రస్తుం ఓదెల రూపంలో ఉంది. అల్పపీడన ప్రభావంగా ఇటీవల కురిసిన వర్షాలకు చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది. తర్వాత వారం రోజులు వాతావరణం ఎండగా ఉండటంతో నేలకొరిగిన వరిపంటను రైతులు కోతలు కోయించారు. ఓదెలు రూపంలో ఉన్న సమయంలో వర్షాలు పడితే ధాన్యం మొలకలు రావడంతో పాటు రంగు మారే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. -
రైతు గుండెకు గండి
చెరువులను విస్మరించిన వైనం మరమ్మతుల జాడ లేదు ‘నీరు-చెట్టు’లో అత్యవసర పనులకు లభించని ప్రాధాన్యత మట్టి పనులకే పరిమితం ఫలితంగా భారీ వర్షం నీరంతా వృథా తిరుపతి: మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాలకు భారీగా చెరువులకు నీరు చేరింది. ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వచ్చిన వెంటనే వృథాగా పోయింది. చెరువులపై పర్యవేక్షణ కొరవడటం,అధికారుల నిర్లక్ష్యం వెరసి రైతుల పాలిట శాపంగా మారింది. తూములు,మరవలు,కట్టలతో పాటు పలు గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు చేయకపోవడంతో వచ్చిన నీరు అంతా వృధాగా పోయింది. పలుచోట్ల చెరువులు తెగి, గ్రామాల్లోకి నీరు చేరడంతో పాటు, పంట పొలాలు కోతకు గురై అన్నదాతలకు ఆవేదనను మిగిల్చాయి. కుప్పం, తంబళ్లపల్లె ప్రాంతంలో 50 శాతంకు పైగా చెరువులు నిండలేదు. వరుస కరువులతో తల్లడిల్లిన జిల్లా వాసులకు వర్షాలు ఉపశమనం ఇస్తాయనుకున్నా పాలకుల నిర్లక్ష్యంతో ఆశించిన స్థాయిలో మేలు జరగలేదు. దాదాపు 200 చెరువులకు గండ్లు పడినీరు నిరుపయోగంగా పోయింది. కాళంగి రిజర్వాయర్ గేట్లు విరిగి పోవడంతో భారీగా వరద నీరు వచ్చినా ఫలితం దక్కలేదు. జిల్లాలోని ప్రాజెక్టుల్లో 30టీఎంసీల నీటినినిల్వ చేసుకొనే సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం 25 టీఎంసీల నీరు మాత్రమే ఉండటం గమనార్హం. కాళంగి రిజర్వాయర్ సామర్థ్యం 241 ఎంసీఎఫ్‌టీ కాగా ప్రస్తుతం అక్కడ కేవలం 18 ఎంసీఎఫ్‌టీ అడుగుల నీరు మాత్రమే పరిమితమైంది. పెద్దెరు నీటి నిల్వసామర్థ్యం 590 ఎంసీఎఫ్టీలుకాగా డ్యాంలో 443 ఎంసీఎఫ్‌టీల నీరు చేరింది.పీలేరు నియోజక వర్గంలో మేడికుర్తి ప్రాజెక్టుకు గండి పడటంతో డ్యాంలో నీరు కొద్ది మేర మ్రామే ఉన్నాయి. నీరు-చెట్టు పనులు సక్రమంగా చేసి ఉంటే... జిల్లాలో రూ.136 కోట్ల మేర 3079 నీరు-చెట్టు పనులకు అధికారులు అనుమతులిచ్చారు. ఇందులో 2670 పనులు పూర్తి కాగా రూ. 88 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులను అత్యవసర పనులకు వినియోగించి ఉంటే పలు చెరువుల్లోకి భారీగా నీరు చేరేది. రైతులకు లబ్ధి చేకూరేది. పలుచోట్ల చెరువు తూములు,మరువలు, సిమెంట్ కాంక్రీట్ పనులు చేయక పోవడం వల్లే నీరు వృథాగా పోయిందనిరైతులు ఆవేదన చెందుతున్నారు. నీరు-చెట్టు నిధులను కేవలం మట్టి పనులకు ఉవయోగించి అధికార పార్టీ నేతలకు లబ్ధి కలిగించారని ఆరోపిస్తున్నారు. వాటిని సక్రమంగా ఉవయోగించి ఉంటే సత్ఫలితాలు వచ్చేవని పలువురు రైతులు భావిస్తున్నారు. కొన్ని చోట్ల చెరువులకు నీరు వచ్చే కాలువలు, పంటకాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిని పట్టించుకున్న దాఖలా లేదు. ఫలితంగా భారీ వర్షాలు వచ్చినా ఒక్క భూగర్భ జలాల విషయంలోనే మేలు జరిగిందనేది వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఎంత కష్టం.. ఎంత నష్టం!
నిండా మునిగిన రైతన్న మొలకెత్తుతున్న వరి పెట్టుబడి వర్షార్పణం జిల్లాలోని అన్నదాతలకు పెద్ద కష్టమే వచ్చిపడింది. నిన్నటివరకు అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురవగా, నేడు ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పడుతున్న వానలకు కుదేలవుతున్నారు. ప్రభుత్వం ఖరీఫ్‌లో కాలువలకు చుక్క నీరు విడుదల చేయకున్నా.. వరుణుడి కరుణతో సాగు ప్రారంభించారు. అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో వర్షార్పణం కావడంతో రైతన్న నష్టాల ఊబిలో కూరుకుపోనున్నాడు. మచిలీపట్నం : ఈ ఏడాది జిల్లాలోని 4.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకుని పైరును కాపాడడంతో సాగు ఖర్చు ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ. 22 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం వరి కోత దశలో ఉంది. ఈ తరుణంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. అల్పపీడన ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేసి 30 వేల ఎకరాల్లో వరి పైరు నీట మునిగిందని నిర్ధారించారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సముద్రమట్టం నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి వ్యాపించటంతో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో గురువారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నేల వాలిన వరి ఇప్పటికే నీటిలో తేలియాడుతుండగా వర్షం కారణంగా పైరు పైకి మరింత నీరు చేరుతోంది. రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే బీపీటీ 5204 వరి కంకులు మొలకెత్తుతాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే నేలవాలిన కంకులకు మొలకలు వచ్చాయి. కౌలు రైతుకు అప్పుల తిప్పలు జిల్లాలో 1.64 లక్షల మంది కౌలు రైతులున్నారు. ఎకరానికి 12 నుంచి 17 బస్తాల చొప్పున కౌలుగా చెల్లించి వరిసాగు చేపట్టారు. ప్రస్తుతం కోత దశలో ఉన్న వరి నేల వాలి నీట మునగడంతో అప్పులే మిగులుతున్నాయని వారు వాపోతున్నారు. రైతులకు ఇంత నష్టం జరిగినా వీఆర్వోలు దెబ్బతిన్న పొలాలను చూసి వెళుతున్నారు తప్ప నష్టం అంచనా వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు ఎకరాల సాగుకు రూ.45 వేలు ఖర్చు నాకు రెండెకరాల సొంత భూమి ఉంది. బీపీటీ 5204 రకం సాగు చేశాను. కాలువకు చుక్కనీరు రాకపోవడంతో ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని తోడి వరినాట్లు పూర్తి చేశా. అడపాదడపా కురిసిన వర్షాలకు తోడు ఇంజిన్ల ద్వారా నీటిని తోడు పైరును కాపాడుకున్నాను. ప్రస్తుతం వరికోతకు వచ్చింది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పైరు మొత్తం నేలవాలిపోయింది. కంకులు మొలకలు వస్తున్నాయి. ఇప్పటివరకు రెండు ఎకరాలకు కలిపి రూ. 45వేలు ఖర్చు చేశా. వాతావరణం అనుకూలిస్తే కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బంది ఉండదనుకున్నా. కానీ వర్షం నిండా ముంచేసింది. -పామర్తి శ్రీనివాసరావు, సీతారామపురం, బందరు మండలం 22 ఎకరాలు సాగుచేసి నష్టపోయా నాకు, నా తండ్రి సత్యనారాయణ కలిపి 15 ఎకరాల భూమి ఉండగా, మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాం. సాగునీరు సక్రమంగా రాకున్నా ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకుని పైరును కాపాడుతున్నాం. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చు అయింది. బీపీటీ 5204 రకం వంగడం సాగు చేశాం. పంట బాగా పండింది. ఎకరానికి 30 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశించాం. ఎకరానికి 17 బస్తాలు చొప్పున కౌలుగా చెల్లించాలి. కోత మరో రెండు, మూడు రోజుల్లో మొదలుపెడదామనుకుంటే.. ఈలోగానే మూడు రోజుల పాటు వర్షం కురిసింది. పైరు మొత్తం నేల వాలి నీటిలోనే ఉండిపోయింది. కంకులు మొలకెత్తుతున్నాయి. -బోలెం అర్జునరావు, ఎస్.ఎన్.గొల్లపాలెం, బందరు మండలం -
ముంచెత్తిన వాన
విశాఖలో భారీ వర్షం.. 14 సెం.మీ. నమోదు జిల్లాలోనూ ఆశాజనకంగా వర్షం ఖరీఫ్ పంటలకు మేలు విశాఖపట్నం: బంగాళాఖాతంలో ద్రోణులు, ఆవర్తనాలు, ఈశాన్య రుతుపవనాల కరుణతో వర్షాలు కుమ్మరిస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు ఆదివారం కూడా కొనసాగాయి. భారీ వర్షాలకు వరసగా రెండు రోజులూ రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలో వర్షపాతం నమోదయింది. శనివారం ఉదయం వరకు 7 సెం.మీ.ల వర్షం కురవగా ఆదివారం ఉదయం వరకు 14 సెం.మీ.ల వాన కురిసింది. ఆదివారం రాత్రికి విశాఖలో 6 సెం.మీ.ల వర్షపాతం రికార్డయింది. ఎడతెరిపిలేని వానకు జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. జిల్లాలోనూ రెండు రోజులుగా వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. ఆదివారం పాయకరావుపేట, నక్కపల్లి, యలమంచిలి, అనకాపల్లి, తగరపువలస, భీమిలి, పెందుర్తి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నర్సీపట్నం, చోడవరం, మాడుగులతో పాటు మన్యంలోనూ తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ వర్షాలు పంటలకు ఎంతో మేలు చేస్తాయని రైతులు సంబరపడుతున్నారు. ఇప్పటికే వరి పంట వెన్ను, పొట్ట దశలోను, చెరకు ఎదిగే దశలోనూ ఉన్నాయి. వీటితో పాటు ఇతర పంటలకు ఇవి ప్రాణం పోశాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వానలకు రిజర్వాయర్లలోనూ వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇది కూడా భవిష్యత్తులో సాగునీటి ఎద్దడి లేకుండా చేస్తుందని భావిస్తున్నారు. గత కొన్నాళ్లుగా వర్షాభావ పరిస్థితులేర్పడిన నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలు పంటలకు మళ్లీ జీవం పోసినట్టయిందని వీరు ఊరట చెందుతున్నారు. ఆవ ప్రాంతంలో వరిపైరు నీటమునిగింది. పలు చోట్ల ఈదురు గాలులకు చెరకుతోటలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలయిన మునగపాక బీసీ కాలనీ, నాగులాపల్లి జగ్గయ్యపేట అగ్రహారం, పల్లపు ఆనందపురం, యాదగిరిపాలెం తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు నానా అవ స్థలకు గురయ్యారు. ఈ వర్షాలు వరికి మేలు చేస్తాయని వ్యవసాయాధికారి పావని తెలిపారు. ఎక్కడైనా వరి ముంపునకు గురైతే సాధ్యమైనంత త్వరగా బయటకు పోయేలా చూడాలని రైతులకు సూచించారు. విశాఖలో... :విశాఖలోని పూర్ణామార్కెట్, వెలంపేట, స్టేడియం రోడ్డు, రామకృష్ణా జంక్షన్, పండావీధి ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. గాజువాక ప్రాంతం మసీదు రక్షణ గోడ, కొత్తగాజువాక, కాకతీయనగర్లలో గోడలు కూలిపోయాయి. పాతగాజువాకను జాతీయ రహదారి ముంచెత్తింది. పెదగంట్యాడ హెచ్‌బీ కాలనీ, కుంచమాంబ కాలనీ, కూర్మన్నపాలెం సాయిరాంనగర్ కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. తెరపినివ్వకుండా కురిసిన వానకు జనం బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు. వీటికి గాలులు కూడా తోడవడంతో జనం ఇబ్బంది పడ్డారు. ఆదివారం కావడంతో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. చిరువ్యాపారులు పూర్తిగా దుకాణాలు తెరవడం మానేశారు. సాయంత్రానికి వర్షాలు తెరపినిచ్చాయి. సోమవారం కూడా వర్షాలు కొనసాగుతాయని, తర్వాత తగ్గుముఖం పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. మేహాద్రిలో పెరిగిన నీటిమట్టం : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మేహాద్రి జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏఈ రవీంద్రనాధ్‌ఠాగూర్, ఇన్స్పెక్టర్ సుబ్బరాజు రిజర్వాయర్ పరిస్ధితిని అంచనా వేశారు. 58.50 అడుగుల నుంచి 60అడుగులకు నీటిమట్టం పెరిగినట్టు ఇన్స్పెక్టర్ సుబ్బరాజు తెలిపారు. ముందస్తుగా ఒక గేటు ఎత్తి 1045 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు వరి, మొక్కజొన్నకు అనుకూలం వర్షాలు వరి, మొక్కజొన్న పంటలకు మేలు చేశాయి. కొంత కాలంగా వర్షాభావ పరిస్థితులతో ఆలస్యంగా వేసిన వరినాట్లు ఎండిపోతున్నాయి. ఈ దశలో వర్షాలతో కళకళలాడుతున్నాయి. రబీ మొక్కజొన్న నాట్లు వేసినవారికి, ఇంకా విత్తనాలు జల్లాలనుకున్న రైతులకు ముసురుపట్టిన వాతావరణం మేలు చేకూర్చింది. ఖరీఫ్‌లో ముందస్తుగా నాట్లు వేసినచోట వరి పొట్టదశలో ఉంది. అది వాలిపోకుండా రైతులు తాటిఆకులతో కట్టలుగా కట్టి నిలబెడుతున్నారు. కూరగాయల పంటకు కూడా వర్షం అనుకూలం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సరుగుడు నాట్లు పనుల్లోనూ రైతులు నిమగ్నమయ్యారు. కాగా పూలతోటలు, ఇటీవల మిరపనారు వేసినచోట్ల మడులలో నీరు నిల్వ ఉండటంతో ఇవి కుళ్లిపోయే ప్రమాదం ఉందని మెట్టప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆనబ, దొండ, చిక్కుడు, ముల్లంగి పంటలు ఊట పట్టే ప్రమాదముందని రైతులు భయపడుతున్నారు. -
నిర్వేదం..
అడుగంటిన అన్నదాతల ఆశలు ముఖం చాటేసిన వరుణుడు 25 లక్షల హెక్టార్లలో మొలకెత్తని విత్తనాలు బెంగళూరు: రాష్ట్రం లో వర్షం జాడ లేకపోవడంతో వివిధ రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 25 లక్షల హెక్టార్లలో వేసిన విత్తనం భూమిలోనే ఎండిపోయిం ది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఆశించిన మేర కురవలేదు. ప్రధానంగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో సాధారణం కంటే 43 శాతం, కరావళి ప్రాంతంలో 27 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. దక్షిణ కర్ణాటకలో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే సగటున 32 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయ శాఖ ఈ ఏడాది ఖరీఫ్‌లో నిర్దేశించుకున్న 73 లక్షల హెక్టార్ల విత్తన ప్రక్రియలో ఇప్పటి వరకు 52 లక్షల హెక్టార్లను మాత్రమే చేరుకోగలిగింది. గత ఏడాది ఇదే సమయానికి 61.78 లక్షల హెక్టార్లలో విత్తన ప్రక్రియ జరిగింది. అగమ్యగోచరం అప్పు చేసి ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగు చేపట్టిన రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరో 20 రోజుల్లో ఖరీఫ్ ముగుస్తున్నా చాలా చోట్ల వర్షాభావం వల్ల భూమిలో వేసిన విత్తనం మొలకెత్తలేకపోయింది. వ్యవసాయ శాఖ గణాంకాలను అనుసరించే ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన విత్తులో 25 లక్షల హెక్టార్లలో విత్తనం ఎండిపోయిందంటే రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసుకోవచ్చు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని అయోమయంలో అన్నదాతలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పరువు కాపాడుకునేందుకు పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్లో 172 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ మంది పంట నష్టం కావడంతో పాటు రబీ పంట సాగుకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్లనే అన్నది బహిరంగ రహస్యమని కర్ణాటక హసిరుసేన వ్యవస్థాపక సభ్యుడు కోడిహళ్లి చంద్రశేఖర్ పేర్కొంటున్నారు. రబీ దిశగా అధికారులు ఖరీఫ్ పంటపై ఆశలు వదులకున్న రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా రబీ పంట సాగుపై దృష్టి సారిస్తున్నారు. పొలంలోనే ఎండిపోయిన పైరును, విత్తనాలను వదిలి రబీ పంట సాగు చేపడుతున్నారు. ఇందుకోసం పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో తీసుకున అప్పు తీర్చందే కొత్తగా రుణాలు మంజూరు చేయలేమంటూ బ్యాంకర్లు పేర్కొంటుండడంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వైపు చూస్తున్నారు. కాగా, రబీ పంట సాగు కింద గత ఏడాది 33 లక్షల హెక్టార్లను లక్ష్యంగా ఉంచుకున్న వ్యవసాయాధికారులు ఈ సారి దానిని 40 లక్షల హెక్టార్లకు పెంచారు. ఖరీప్ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ డెరైక్టర్ సుబ్బయ్య మాట్లాడుతూ... ‘ఖరీఫ్ పంట నష్టం వాస్తవమే. రబీలో ఈ పరిస్థితి రాదని ఆశిస్తున్నాం. లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుగుణంగా ఇప్పటికే అవసరమైన పరిమాణంలో విత్తనాలు, ఎరువులతో పాటు యంత్ర పరికరాలను కూడా సమకూర్చుకుంటున్నాం.’ అని పేర్కొన్నారు. -
పంట పచ్చన.. కాయ పలుచన!
కరువు ప్రభావం జూన్‌లో విత్తిన వేరుశనగకు ఎకరాకు దిగుబడి వచ్చేది 2 బస్తాలే జూలై పంటకు వర్షాలు కురిస్తేనే ప్రయోజనం జిల్లాలోని పడమటి మండలాల రైతులు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పంట పచ్చగా కనిపిస్తున్నా అందులో కాయల్లేవు.ఇలాంటి పచ్చ కరువును ఎప్పుడూ చూడలేదనిరైతులు వాపోతున్నారు. పంటలపై పెట్టిన పెట్టుబడి కొద్దిగానైనా చేతికందే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యవసాయాధికారులూ ఇదే విషయాన్ని ధ్రువీకరించారు.రైతులు ఎకరాకు రూ.10 వేలకుపైగా పెట్టుబడిని నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి వర్షాభావమే కారణమని స్పష్టమవుతోంది. బి.కొత్తకోట : ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలోని పడమటి ప్రాంతాల రైతులు వేరుశనగ సాగుమీదే ఆధారపడ్డారు. మే చివర్లో కురిసిన వర్షానికి పంట సాగుచేసుకోవచ్చని ఆనందపడ్డారు. ఈ నేపథ్యంలోనే జూన్‌లో వేరుశనగ పంటను విత్తారు. జిల్లా వ్యాప్తంగా 2,07,502 హెక్టార్ల సాధారణ సాగులో వేరుశనగ పంట 1,36,375 హెక్టార్లలో సాగు చేయాలి. కానీ 1,07,528 హెక్టార్లలో పంటను సాగుచేశారు. ఇందులో అధిక విస్తీర్ణం పడమటి మండలాలదే. జూన్‌లో తొలివిడత, జూలైలో రెండో విడత కలుపుకొని మూడు విడతల్లో పంటను సాగుచేశారు. ఇందులో జూన్‌లో విత్తిన పంటకు వర్షాభావం వెంటాడింది. నెల రోజులకుపైగా చినుకు రాలలేదు. జూలైలో పంట దిగుబడికి ప్రధానమైన పూతదశ వచ్చింది. ఈ సమయంలో వర్షం అవసరం. అయితే వర్షం కురవకపోవడంతో పూత దెబ్బతింది. ఊడలు పట్టలేదు. పంట దిగుబడి నాశనమైంది. ఈ పంటకు ఆగస్టులో కురిసిన వర్షమే దిక్కయింది. ఈ వర్షం పంటకు ప్రయోజనం చేకూర్చలేకపోయింది. ప్రస్తుతం పదిరోజుల్లో ఒకటికి నాలుగుసార్లు వర్షం కురిసింది. దీనికి పంట పచ్చదనంతో కళకళలాడుతోంది. చూసేవారికి ఈ సారి దిగుబడులు భారీగా వస్తాయని అంచనాలు వేస్తారు. అయితే మొక్కకు ఒక్కటంటే ఒక్క కాయా కనిపించని దుస్థితి. ఎకరాకు కనీసం 7 బస్తాలు, అధికమంటే 12 బస్తాల దిగుబడి దక్కాలి. ఇప్పుడున్న జూన్ నెలలో వేసిన పంట దిగుబడి 2 బస్తాలే. లేదంటే మూడు బస్తాలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెరిగే వీలులేదని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
పలుకరించిన వరుణుడు
శ్రీకాకుళం రూరల్/శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం ఒక మాదిరి వర్షాలు కురిశాయి. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురవడంతో ఇబ్బడిముబ్బడిగా వేసిన వరినారుమళ్లు అటు తరువాత తలెత్తిన వర్షాభావ పరిస్థితులతో ఎండిపోవడం మొదలెట్టాయి. రైతులు మోటార్లతోనూ... బిందెలతోనూ నీటిని తోడి నారుమళ్లను కాపాడుకుంటూ వచ్చారు. ఇక వర్షాలు రావేమోనన్న బెంగపడుతున్న తరుణంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిశాయి. దీంతో మళ్లీ నారుమళ్లకు ఊపిరి పోశాయి. అరకొరగానే ఖరీఫ్ ఖరీఫ్‌లో సాధారణ సాగు 2.45లక్షల హెక్టార్లు కాగా ఇంతవరకు 76,662 హెక్టార్లకే పరిమితమైంది. వరి సాధారణ విస్తీర్ణం 2 లక్షల హెక్టార్లు కాగా 66,572 హెక్టార్లలోనే సాగయింది. ఇటీవల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులకు వరి నారుమళ్ళు, నాట్లుతోపాటు మెట్టు పంటలు కూడా ఎండిపోయాయి. దీనికి కరెంటు కోతలు తోడవడంతో మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఇంతవరకు అక్కడక్కడా ఆయిల్ ఇంజన్ల సహాయంతో నీటి తడులిచ్చిన వరి నారుమడులు, మెట్టు పంటలు కాపాడుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో కురిసిన వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. అయితే ఈ వర్షాలు నారుమడుల్ని కొంతవరకు బతికించుకునేందుకే తప్ప దమ్ములకు సరిపోవని రైతులు చెబుతున్నారు. ఆరంభం నుంచీ అరకొరే... ఖరీఫ్ ఆరంభంలో ఒకమాదిరి వర్షాలు కురిసినా తరువాత అరకొరగానే కురుస్తున్నాయి. జూన్ నెలలో సాధారణం కంటే 65.9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు ఆదరాబాదరాగా వరినారు మడులు సిద్ధం చేశారు. జూలై, ఆగస్టులో ఇంతవరకు కనీసం చుక్క చినుకు కూడా పడలేదు. జూలై నెలల్లో వర్షపాతం సాధారణం కంటే 51.7 శాతం తక్కువ నమోదయింది. ఆగస్టులో 12 తేదీ వరకు సాధారణంగా అయితే 7033.3 మి.మీలు నమోదు కావాల్సి ఉండగా కేవలం 1484.2 మిమీలు మాత్రమే నమోదైంది. బుధవారం లావేరులో అత్యధికంగా 66.6 మి.మీలు వర్షపాతం నమోదవగా, టెక్కలిలో 52.4 మిమీ.లు, శ్రీకాకుళం మండలంలో అత్యల్పంగా 0.1 మి.మీ. మాత్రమే నమోదయింది. -
రాలని చినుకు
మండ్య జిల్లాలో మొలకెత్తని విత్తు తలకిందులైన అధికారుల అంచనాలు 63,450 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం 259 హెక్టార్లకే పరిమితం పంట సాగుపై రైతుల అనాసక్తి తొలకరి వర్షాలతో రైతులను ఊరించిన మేఘాలు తర్వాత ముఖం చాటేశాయి. చినుకు నేల రాలకపోవడంతో భూమిలో వేసిన విత్తనం మొలకదశలోనే వాడిపోతోంది. పంట సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండడంతో అన్నదాతల గుండెలు గుభేలుమంటున్నాయి. దీంతో పంట సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా అధికారుల అంచనాలు తారుమారై ఈ సారి మండ్య జిల్లాలో పంట సాగు గణనీయంగా తగ్గిపోయింది. - మండ్య మండ్య: తొలకరి జల్లులు విస్తారంగా కురవడంతో మండ్య జిల్లా వ్యాప్తంగా రైతులు దుక్కిదున్ని భూమిలో విత్తనాలు వేశారు. ఈ నేపథ్యంలోనే తదుపరి వరుణుడు ముఖం చాటేయడంతో వర్షం జాడ లేకుండా పోయింది. ఫలితంగా భూమిలో వేసిన విత్తనం మొలక దశలోనే పంట ఎండిపోవడం మొదలైంది. పంట సాగు చేసిన అప్పులు కంటి మెదలడంతో వాటిని ఎలా తీర్చాలంటూ అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఈ దశలోనే అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడం, వాటిని తీర్చలేకపోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన చిన్నెనహళ్లికి చెందిన రైతు రాజేంద్ర బలవన్మరణానికి పాల్పడడం జిల్లా రైతాంగాన్ని కుదేలు చేసింది. తర్వాత కూడా అప్పులు తీర్చే మార్గం కానరాక జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఈ ఏడాది వ్యవసాయానికి గడ్డుకాలంగా భావించిన పలువురు పంట సాగు చేయడానికి భయపడుతున్నారు. తగ్గిన సాగు విస్తీర్ణం మండ్య జిల్లాలో తొలకరి జల్లులు ప్రారంభం కాగానే కోతకు వచ్చిన చెరుకు పంటను వదిలి 63,450 హెక్టార్లలో వరి పండించేందుకు రైతులు సిద్ధపడ్డారు. ఇదే సందర్భంలో 68,680 హెక్టార్లలో రాగి, 6500 హెక్టార్లలో మొక్కజొన్న పంటను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వంృదష్టికి తీసుకెళ్లారు. పంట సాగు చేసే రైతుల వివరాలను సైతం సేకరించారు. అయితే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. 63,450 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కాగా కేవలం 0.04 శాతం అంటే 259 హెక్టార్లలో మాత్రమే వరి పైరును వేశారు. పంట సాగుకు అవసరమైన నీరు లభ్యం కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా రైతులు పేర్కొంటున్నారు. అదే విధంగా రాగి (350 హెక్టార్లు), మొక్కజొన్న (619 ఎకరాలు) పంట విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 25,700 హెక్టార్లలో ద్విదళ పంటలను సాగు చేయవచ్చన్న అధికారులు అంచనాలు సైతం తలకిందులయ్యాయి. కేవలం 6409 హెక్టార్లలో మాత్రమే ద్విదళ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం జులై నెల 29వ తేది నాటికి జొన్న, బెంగాల్ గ్రామి, హురళి, సూర్యకాంతి, మాతాబీన్, మస్టర్డ్, సోయాబీన్ సాగు ఒక హెక్టారును కూడా మించలేదు. చెరుకు పంటది అదే పరిస్థితి మండ్య జిల్లాలో గత ఏడాది ఇదే సమయానికి 30,550 హెక్టార్లలో చెరుకు సాగును రైతులు చేపట్టారు. చక్కెర కర్మాగారాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో చెరుకు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో చెరుకు సాగు చేసిన రైతులు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఫలితంగా జిల్లాలో చెరుకు సాగు చేయడానికి రైతులు ముందుకు రావడం లేదు. ఈ ఏడాది జులై చివరకు 6257 హెక్టార్లలో మాత్రమే రైతులు చెరుకు సాగు చేపట్టారు. -
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. విజయనగరం పట్టణంతో పాటు కురుపాం, నెల్లిమర్ల, గజపతినగరం తదితర ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. మిగతా ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. వర్షాలకు జిల్లా కేంద్రంలోని లెంక వీధిలో ఓ ఇంటి మట్టిగోడ నానిపోయి కూలిపోయింది. మధ్యాహ్నం భోజనం చేసి నిద్రిస్తున్న ఇంటి యజమాని తుంపల్లి గణపతిరావు(40) పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మృతుడి సోదరితో పాటు భార్య పద్మకు గాయలయ్యాయి. జిల్లా కేంద్రమైన విజయనగరంలో మధ్యాహ్నం రెండు సార్లు వర్షం పడింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక సారి భారీ వర్షం కురవగా గంట పోయాక మరో సారి పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయాయరు. చిరు వ్యాపారులు నష్టపోయారు. నెల్లిమర్ల, గజపతినగరంలో కూడా విడతల వారీగా భారీ వర్షం కురిసింది. బొబ్బిలి, పార్వతీపురాలలో చిరుజల్లులు కురిశాయి. విజయనగరం మున్సిపాలిటీ: పట్టణంలో కురిసిన మోస్తరు వర్షం ప్రయాణీకులకు తీవ్ర అటంకం కలిగించింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సుమారు 45 నిమిషాల పాటు కురిసి వర్షంతో అన్ని లోతట్టు ప్రాంతాలు ఎప్పటిలానే జలమయమయ్యాయి. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయం రోడ్ నుంచి గంటస్థంభం జంక్షన్ వరకు అలానే ప్రకాశం వరకు వరద నీరు రహదారులపై ప్రవహించటంతో అటుగా రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడ్డారు. సుమారు గంట సమయం వరకు వరద నీరు నిల్వ ఉండిపోవటంతో తప్పని సరి పరిస్థితుల్లో అదే నీటిలో వాహనచోదకులు రాకపోకలు సాగించారు. వర్షం కురిసి ఆగిపోయిన కొద్ది సమయంలోనే అటుగా వచ్చిన అగ్నిమాపక యంత్రం కూడా అదే నీటిలో వెల్లాల్సి వచ్చింది. నిత్యం ఇదే తరహాలో పరిస్థితి ఉన్నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగించాల్సి వస్తుందని ప్రయాణీకులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా వర్షం కారణంగా మున్సిపల్ కార్యాలయం జంక్షన్లో వ్యాపారాలు చేసుకునే చిల్లర వర్తకులు సరుకులు నీట పాలయ్యాయి. -
‘ఆందోళన వద్దు’
సాక్షి, ముంబై: నీటి నిల్వలపై ముంబైకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఎంసీ తెలిపింది. నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో జూలై 31 వరకు సరిపడే నిల్వలున్నాయని స్పష్టం చేసింది. వర్షాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయనే దాని గురించి వాతావరణశాఖ ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదని, సమాచారం అందగానే ప్రణాళిక ప్రకారం నీటి సరఫరా చేస్తామని బీఎంసీ నీటి సరాఫరా శాఖ చీఫ్ ఇంజినీరు రమేశ్ బాంబ్లే అన్నారు. ప్రస్తుతం నగరానికి నీటి సరఫరాచేసే బాత్సా, మోడక్‌సాగర్, మధ్య వైతర్ణ, విహార్, తులసీ, తాన్సా జలాశయాల్లో 4,06,973 మిలియన్ లీటర్ల నిల్వ ఉందని, దీన్ని పరిగణలోకి తీసుకుంటే జులై 31 వరకు నీటికి ఢోకా లేదని బాంబ్లే అన్నారు. ముంబైకర్లకు ప్రతి రోజు 3,750 మిలియన్ లీటర్ల నీరు అవసరముంటుందని ఆయన అన్నారు. కాగా, కొన్నేళ్లుగా సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో నీటి నిల్వలు కాపాడుకోడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రతి ఏటా నెల రోజుల ముందే వాతావరణ శాఖ నుంచి వర్షానికి సంబంధించిన వివరాలు వస్తాయని, దీన్ని బట్టి వర్షాలు ఆలస్యమైతే ఎంత శాతం నీటి కోత అమలు చేయాలో ముందుగానే ప్రణాళిక రూపొందిస్తారని ఆయన చె ప్పారు. -
ఖరీఫ్.. పాయే..
అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది కూడా వర్షాభావం ఁఅనంత* ఖరీఫ్‌ను కాటేసింది. లక్షలాది హెక్టార్లలో సాగు చేసిన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అందులో ప్రధానమైన వేరుశనగ పంట 5.06 లక్షల హెక్టార్లలో వేయగా వర్షాలు లేక బెట్ట పరిస్థితులు ఏర్పడటంతో ఎకరాకు సగటున రెండు బస్తాల దిగుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. అప్పులు చేసి పెట్టిన రూ.1,500 కోట్ల పంట పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదు. దీంతో సుమారు రూ.2,500 కోట్ల పంట దిగుబడులు కోల్పోయారు. వర్షపాతం, పంటల విస్తీర్ణం, పంట నష్టం, బెట్టపరిస్థితులను ప్రామాణికంగా తీసుకుని ఇటీవల జిల్లా యంత్రాంగం పంట నష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు. ఆరు మండలాలకు దక్కని చోటు ప్రాథమిక నివేదిక ప్రకారం కరువు మండలాల జాబితాలో 57 మండలాలు చోటు దక్కించుకోగా తక్కిన ఆరు మండలాలకు స్థానం లేకుండా పోయింది. జిల్లా అంతటా వర్షపాతం, పంట స్థితిగతులు దాదాపు ఒకే రకంగా ఉన్నా కూడేరు, పెద్దవడుగూరు, శెట్టూరు, పెనుకొండ, లేపాక్షి, రాయదుర్గం మండలాలు కరువు జాబితాలో లేకపోవడం విశేషం. ఈ ఆరు మండలాల విషయానికి వస్తే కేవలం పెద్దవడుగూరు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో వర్షం తక్కువగానే పడింది. పెనుకొండ మండలంలో 60 శాతం తక్కువ వర్షం పడింది. లేపాక్షిలో కూడా 50 శాతం తక్కువ వర్షం కురిసింది. అయినా కరువు జాబితాలో లేకపోవడం గమనార్హం. ఈ ఆరు మండలాలను జాబితాలో చేర్చాలని జిల్లా అధికారులు మరోసారి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. 96 డ్రైస్పెల్స్ నమోదు మునుపెన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో ఏకంగా 96 డ్రైస్పెల్స్ (వర్షపాత విరామాలు) నమోదయ్యాయి. జూన్ నెలలో 63.9 మిల్లీమీటర్లకు (మి.మీ) గాను 44.9 మి.మీ, జూలైలో 67.4 మి.మీ గాను 35.7 మి.మీ, ఆగస్టులో 88.7 మి.మీ గాను 56.8 మి.మీ, సెప్టెంబర్‌లో 118.4 మి.మీ గాను కేవలం 35 మి.మీ వర్షం కురిసింది. అంటే ఖరీఫ్‌లో 335.4 మి.మీ వర్షం పడాల్సివుండగా 50 శాతం తక్కువగా 172 మి.మీ వర్షం పడింది. వరుసగా 21 నుంచి 28 రోజుల పాటు వర్షం పడనివి 50, 29 నుంచి 42 రోజుల పాటు వర్షం పడనివి 43, వరుసగా 43 రోజులకు పైగా వర్షం రాని డ్రైస్పెల్స్ 3 ఉండటం విశేషం. ఇలా నెలల తరబడి వర్షం మొహం చాటేయడంతో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కరువు జాబితాలో లేని ఆరు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నా... మధ్య మధ్యలో ఒకట్రెండు సార్లు చిరుజల్లులు పడటంతో వర్షం కురిసినట్లు రికార్డు కావడంతో డ్రైస్పెల్స్ సంఖ్య తగ్గడం వల్ల జాబితాలో లేకుండా పోయాయి. కేవలం 2.5 మి.మీ వర్షం పడినా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. బత్తలపల్లి, బొమ్మనహాల్, బుక్కపట్టణం, చిలమత్తూరు, ధర్మవరం, గాండ్లపెంట, గార్లదిన్నె, గోరంట్ల, హిందూపురం, కనగానపల్లి, కొత్తచెరువు, లేపాక్షి, మడకశిర, ముదిగుబ్బ, ఓడీచెరువు, పామిడి, పరిగి, పెద్దపప్పూరు, పెనుకొండ, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు, రొద్దం, శింగనమల, సోమందేపల్లి, తాడిమర్రి, తాడిపత్రి, తనకల్లు, ఉరవకొండ, యల్లనూరు మండలాల్లో 50 నుంచి 86 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. ఎకరాకు రెండు బస్తాలు ఈ ఏడాది వేరుశనగ ఎకరాకు సగటున రెండు బస్తాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రణాళిక శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు కొనసాగిస్తున్న పంట కోత ప్రయోగాలు (క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్) పరిగణలోకి తీసుకుంటే దిగుబడులు దయనీయంగా ఉన్నాయి. 756 పంట కోత ప్రయోగాలు నిర్వహించాల్సివుండగా ఇప్పటివరకు 242 ప్రయోగాలు పూర్తి చేశారు. హెక్టారుకు 203 కిలోలు దిగుబడులు అంటే ఎకరాకు 80 కిలోలు వచ్చే పరిస్థితి ఉంది. ఎకరాకు ఒక క్వింటా కూడా దక్కని పరిస్థితి నెలకొంది. పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో చెట్టుకు ఒక కాయ కూడా లేక ఁజీరో* దిగుబడులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రయోగాల్లో 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాములు వచ్చాయి. కొన్ని చోట్ల మాత్రమే కాస్త అటుఇటుగా ఒక కిలో దిగుబడులు వచ్చాయి. రెండు మూడు మండలాలు మినహా తక్కిన అన్ని మండలాల్లోనూ పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రయోగాలు పూర్తయిన వాటిలో గోరంట్ల, బ్రహ్మసముద్రం, యాడికి, పామిడి, రాయదుర్గం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, కూడేరు, శింగనమల, యల్లనూరు, నార్పల, బుక్కరాయసముద్రం, అనంతపురం, రాప్తాడు, శెట్టూరు, బత్తలపల్లి తదితర మండలాల్లో పంట దిగుబడులు నిరాశాజనకంగా ఉన్నాయి. -
వర్ష బీభత్సం
మునగపాక : హుదూద్ తుపానుతో మండలంలో భారీ నష్టం వాటిల్లింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఒకవైపు భారీ ఈదురు గాలులు మరోవైపు వర్షాలు పడడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి వాతావరణం అల్లకల్లోలంగా ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విపరీతమైన గాలులతో చెట్లు పలుచోట్ల పడిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్త స్తంభించిపోయింది. ఇళ్లల్లోనుంచి బయటకు రావడానికి ప్రజలు వణికిపోతున్నారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో అంధకారం నెలకొంది. చాలా చోట్ల పూరిళ్లు నేలకొరిగాయి. గాలలకు చెరకు తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు వరిపొలాలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ఆయా ప్రాంతాల వారు ఇబ్బందులు పడ్డారు. అరకు రూరల్ : హుదూద్ తుపాను బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి నుంచి వీచిన బలమైన గాలలుకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విశాఖ నుంచి అరకు వరకూ ఉన్న రహదారి మొత్తం నేల కూలిన చెట్లతో నిండిపోయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పద్మాపురం జంక్షన్ నుంచి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎల్లమ్మ తల్లి గుడి వద్ద, అరకు లోయ వరకూ రహదారంతా నేలకూలిన చెట్లతోనే నిండిపోయాయి. పుట్టగొల్లడ, అట్టగుడ, ఒసుబడల్లో గెడ్డలు పొంగిపొర్లాయి. దీని వల్ల సుంకరమెట్ట వారపు సంతకు వెళ్లిన వారివారి ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. చాలా మంది వారికి తెలిసిన వారి ఇళ్ల వద్దే ఉండిపోయారు. -
చంద్రబాబు పర్యటన రద్దు
విశాఖ రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన రద్దయింది. భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం పర్యటనను వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి ముందు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30, 31 తేదీలో ఆయన జిల్లాలో అనకాపల్లి, చోడవరం, నక్కపల్లి ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. సీఎం పర్యటన కోసం వారం రోజులుగా అధికారులు హైరానా పడ్డారు. బహిరంగ సభల వేదిక ఏర్పాట్లను కూడా దాదాపుగా పూర్తి చేశారు. జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారానికి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు సంబంధించి అధికారులు ప్రతిపాదనలు, నివేదికలు తయారు చేశా రు. సీఎంకు అందించాలని భావిం చారు. అయి తే చివరి నిమిషంలో భారీ వర్ష సూచన కారణం గా చంద్రబాబు పర్యటన రద్దయింది. అయితే వచ్చే నెలలో సీఎం జిల్లాలో పర్యటించే అవకాశముందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. -
నైరుతి ఆలస్యం
మరో ఐదు రోజుల్లో రాష్ట్రానికి.. రెండు రోజులుగా రాష్ర్టవ్యాప్తంగా వర్షాలు రిజర్వాయర్లలో పెరుగుతున్న ఇన్‌ఫ్లో జల విద్యుత్కేంద్రాల్లో ఆశాజనకం పలు జిల్లాల్లో ఊపందుకున్న వ్యవసాయ పనులు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో నైరుతి రుతు పవనాల ప్రవేశం ఆలస్యమవుతోంది. ఈ నెల నాలుగు లేదా ఐదో తేదీల్లో రుతు పవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు గతంలో అంచనా వేసినా, అలాంటి సూచనలేవీ ప్రస్తుతానికి లేవు. తాజా అంచనాల ప్రకారం ఈ నెల 9 లేదా 10న రుతు పవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయి. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి రాష్ర్టంలో రుతు పవనాలు ప్రవేశించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు, నైరుతి రుతు పవనాలకు సంబంధం లేదని అధికారులు తెలిపారు. మరో వైపు సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కురిసిన భారీ వర్షాల వల్ల రిజర్వాయర్లలో నీటి మట్టంతో పాటు నదుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. బళ్లారి జిల్లాలో నాలుగేళ్లుగా ఆశించిన వర్షాలు లేవు. రెండు రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు హగరి బొమ్మనహళ్లి తాలూకాలోని మాలవి రిజర్వాయర్‌లోకి మూడు అడుగుల మేరకు నీరు చేరింది. నాలుగేళ్లగా ఈ రిజర్వాయర్ ఎండిపోయింది. మైసూరు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడడంతో పలు నదుల్లో ప్రవాహం వేగం అందుకుంది. చిక్కమగళూరు, కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ పంటలకు ఈ వర్షాలు శుభ శకునమని రైతుల మోముల్లో ఆనందం తాండవిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వ్యవసాయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. వేసవిలో కరెంటు కోతలు ఉండబోవని తొలుత ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం తదనంతరం నాలుక కరచుకోవాల్సి వచ్చింది. వారం తిరగక ముందే అధికారిక కరెంటు కోత వేళలను ప్రకటించి విమర్శల పాలైంది. ప్రస్తుత వర్షాలతో కరెంటు కష్టాలు కూడా తీరాయి. జల విద్యుత్కేంద్రాల్లో ప్రవాహం ఆశాజనకంగా ఉండడంతో ఉత్పత్తి తిరిగి ఊపందుకుంది.