రాలని చినుకు
మండ్య జిల్లాలో మొలకెత్తని విత్తు
తలకిందులైన అధికారుల అంచనాలు
63,450 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం
259 హెక్టార్లకే పరిమితం పంట సాగుపై రైతుల అనాసక్తి
తొలకరి వర్షాలతో రైతులను ఊరించిన మేఘాలు తర్వాత ముఖం చాటేశాయి. చినుకు నేల రాలకపోవడంతో భూమిలో వేసిన విత్తనం మొలకదశలోనే వాడిపోతోంది. పంట సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండడంతో అన్నదాతల గుండెలు గుభేలుమంటున్నాయి. దీంతో పంట సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా అధికారుల అంచనాలు తారుమారై ఈ సారి మండ్య జిల్లాలో పంట సాగు గణనీయంగా తగ్గిపోయింది. - మండ్య
మండ్య: తొలకరి జల్లులు విస్తారంగా కురవడంతో మండ్య జిల్లా వ్యాప్తంగా రైతులు దుక్కిదున్ని భూమిలో విత్తనాలు వేశారు. ఈ నేపథ్యంలోనే తదుపరి వరుణుడు ముఖం చాటేయడంతో వర్షం జాడ లేకుండా పోయింది. ఫలితంగా భూమిలో వేసిన విత్తనం మొలక దశలోనే పంట ఎండిపోవడం మొదలైంది. పంట సాగు చేసిన అప్పులు కంటి మెదలడంతో వాటిని ఎలా తీర్చాలంటూ అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఈ దశలోనే అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడం, వాటిని తీర్చలేకపోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన చిన్నెనహళ్లికి చెందిన రైతు రాజేంద్ర బలవన్మరణానికి పాల్పడడం జిల్లా రైతాంగాన్ని కుదేలు చేసింది. తర్వాత కూడా అప్పులు తీర్చే మార్గం కానరాక జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలు పెట్టారు. దీంతో ఈ ఏడాది వ్యవసాయానికి గడ్డుకాలంగా భావించిన పలువురు పంట సాగు చేయడానికి భయపడుతున్నారు.
తగ్గిన సాగు విస్తీర్ణం
మండ్య జిల్లాలో తొలకరి జల్లులు ప్రారంభం కాగానే కోతకు వచ్చిన చెరుకు పంటను వదిలి 63,450 హెక్టార్లలో వరి పండించేందుకు రైతులు సిద్ధపడ్డారు. ఇదే సందర్భంలో 68,680 హెక్టార్లలో రాగి, 6500 హెక్టార్లలో మొక్కజొన్న పంటను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని అధికారులు ప్రభుత్వంృదష్టికి తీసుకెళ్లారు. పంట సాగు చేసే రైతుల వివరాలను సైతం సేకరించారు. అయితే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. 63,450 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కాగా కేవలం 0.04 శాతం అంటే 259 హెక్టార్లలో మాత్రమే వరి పైరును వేశారు. పంట సాగుకు అవసరమైన నీరు లభ్యం కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా రైతులు పేర్కొంటున్నారు. అదే విధంగా రాగి (350 హెక్టార్లు), మొక్కజొన్న (619 ఎకరాలు) పంట విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిపోయింది. 25,700 హెక్టార్లలో ద్విదళ పంటలను సాగు చేయవచ్చన్న అధికారులు అంచనాలు సైతం తలకిందులయ్యాయి. కేవలం 6409 హెక్టార్లలో మాత్రమే ద్విదళ పంటలను రైతులు సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం జులై నెల 29వ తేది నాటికి జొన్న, బెంగాల్ గ్రామి, హురళి, సూర్యకాంతి, మాతాబీన్, మస్టర్డ్, సోయాబీన్ సాగు ఒక హెక్టారును కూడా మించలేదు.
చెరుకు పంటది అదే పరిస్థితి
మండ్య జిల్లాలో గత ఏడాది ఇదే సమయానికి 30,550 హెక్టార్లలో చెరుకు సాగును రైతులు చేపట్టారు. చక్కెర కర్మాగారాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో చెరుకు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో చెరుకు సాగు చేసిన రైతులు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఫలితంగా జిల్లాలో చెరుకు సాగు చేయడానికి రైతులు ముందుకు రావడం లేదు. ఈ ఏడాది జులై చివరకు 6257 హెక్టార్లలో మాత్రమే రైతులు చెరుకు సాగు చేపట్టారు.