నైరుతి ఆలస్యం | Southwestern delay | Sakshi
Sakshi News home page

నైరుతి ఆలస్యం

Published Thu, Jun 5 2014 1:32 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

Southwestern delay

  • మరో ఐదు రోజుల్లో రాష్ట్రానికి..
  •  రెండు రోజులుగా రాష్ర్టవ్యాప్తంగా వర్షాలు
  •  రిజర్వాయర్లలో పెరుగుతున్న ఇన్‌ఫ్లో
  •  జల విద్యుత్కేంద్రాల్లో ఆశాజనకం
  •  పలు జిల్లాల్లో ఊపందుకున్న వ్యవసాయ పనులు
  •  సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో నైరుతి రుతు పవనాల ప్రవేశం ఆలస్యమవుతోంది. ఈ నెల నాలుగు లేదా ఐదో తేదీల్లో రుతు పవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు గతంలో అంచనా వేసినా, అలాంటి సూచనలేవీ ప్రస్తుతానికి లేవు. తాజా అంచనాల ప్రకారం ఈ నెల 9 లేదా 10న రుతు పవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయి. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి రాష్ర్టంలో రుతు పవనాలు ప్రవేశించాల్సి ఉంది.

    రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు, నైరుతి రుతు పవనాలకు సంబంధం లేదని అధికారులు తెలిపారు. మరో వైపు సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కురిసిన భారీ వర్షాల వల్ల రిజర్వాయర్లలో నీటి మట్టంతో పాటు నదుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. బళ్లారి జిల్లాలో నాలుగేళ్లుగా ఆశించిన వర్షాలు లేవు. రెండు రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు హగరి బొమ్మనహళ్లి తాలూకాలోని మాలవి రిజర్వాయర్‌లోకి మూడు అడుగుల మేరకు నీరు చేరింది.

    నాలుగేళ్లగా ఈ రిజర్వాయర్ ఎండిపోయింది. మైసూరు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడడంతో పలు నదుల్లో ప్రవాహం వేగం అందుకుంది. చిక్కమగళూరు, కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ పంటలకు ఈ వర్షాలు శుభ శకునమని రైతుల మోముల్లో ఆనందం తాండవిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వ్యవసాయ కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

    రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. వేసవిలో కరెంటు కోతలు ఉండబోవని తొలుత ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం తదనంతరం నాలుక కరచుకోవాల్సి వచ్చింది. వారం తిరగక ముందే అధికారిక కరెంటు కోత వేళలను ప్రకటించి విమర్శల పాలైంది. ప్రస్తుత వర్షాలతో కరెంటు కష్టాలు కూడా తీరాయి. జల విద్యుత్కేంద్రాల్లో ప్రవాహం ఆశాజనకంగా ఉండడంతో ఉత్పత్తి తిరిగి ఊపందుకుంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement