31కల్లా కేరళకు రుతుపవనాలు
2, 3 తేదీల్లో ఏపీలోకి ప్రవేశం
ఈ సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షాలు
జూన్‌లో సాధారణానికి మించి వర్షాలు
నెలాఖరు వరకు రాష్ట్రంలో వడగాడ్పులు.. కొన్నిచోట్ల 49 డిగ్రీలు నమోదయ్యే అవకాశం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈనెల 31 నాటికల్లా ఇవి కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమ వారం తెలిపింది. నిరీ్ణత సమయానికి మూడ్రోజులు ముందుగా అంటే ఈనెల 19న అండమాన్ సముద్రంలోకి ఈ రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇవి చురుగ్గా కదులుతుండగా సోమవారం నాటికి బంగాళాఖాతం, శ్రీలంకలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. అలాగే, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అనుకున్న దానికంటే ముందుగానే వచ్చేనెల 1, 2 తేదీల్లో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.
వాతావరణ పరిస్థితులు ఏమైనా మారితే ఒకట్రెండు రోజులు ఆలస్యమై 3, 4 తేదీల నాటికి రాష్ట్రంలో ప్రవేశించే అవకాశముంది. మొత్తంగా ఐదో తేదీలోపే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక రుతు పవనాలు చురుగ్గా ఉండడంతో వచ్చేనెల మొదటి వారంలో రాయలసీమలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. రెమల్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ఈ తుపాను బంగ్లాదేశ్ వైపు కదిలి ఆ పరిసరాల్లోనే తీరం దాటడంతో రుతు పవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండ్రోజుల్లో అవి చురుగ్గా కదిలాయి.
రైతులకు ఎంతో ఊరట..
జూన్‌లో రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలు కురవనున్నాయని సోమవారం విడుదల చేసిన రెండో దశ దీర్ఘకాలిక నెలవారీ అంచనా నివేదికలో ఐఎండీ పేర్కొంది. ఈ సమాచారం రైతాంగానికి ఎంతగానో ఊరటనిస్తోంది. గత ఏడాది వారం రో జులు ఆలస్యంగా అంటే జూన్ 8న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. అనంతరం వర్షాలు అరకొరగానే కురిశాయి. పైగా రాష్ట్రంలో జూన్ అంతా మే నెలను తలపించేలా వడగాడ్పులు కొనసాగాయి.
ఫలితంగా జూన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో ఖరీఫ్ పనులు ముందుకు సా గలేదు. ఆపై జూలై, ఆగస్టుల్లో సకాలంలో వర్షాలు కురవలేదు. దీంతో గతేడాది రైతులకు నైరుతి రుతుపవనాలు నిరాశను, నష్టాలను మిగిల్చాయి. కానీ, ఈ ఏడాది పరిస్థితులు అందుకు భిన్నంగా, అనుకూలంగా మారుతున్నాయి. ఎల్‌నినో బలహీనపడుతూ జూన్ మధ్య నుంచే లానినా పరిస్థితులేర్పడుతున్నాయి. దీంతో వర్షాలు పుష్కలంగా కురవడానికి దోహద పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మూడ్రోజులు వడగాడ్పులు..
ఇదిలా ఉంటే.. రెమాల్ తీవ్ర తుపాను ఫలితంగా గాలిలో తేమను తుపాను ప్రాంతం వైపు లాక్కుపోయింది. దీంతో.. రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. దీనికి తోడు రోహిణి కార్తె కూడా రెండ్రోజుల క్రితమే మొదలైంది. వీటివల్ల రానున్న మూడ్రోజులు సాధారణంకంటే 4–8 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గరిష్టంగా కొన్నిచోట్ల 49 డిగ్రీల వరకు రికార్డయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల మళ్లీ వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి.
టకాగా, మంగళవారం 149 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 160 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయి. శ్రీకాకుళం జిల్లాలో 22, విజయనగరం 27, పార్వతీపురం మన్యం 15, అల్లూరి సీతారామరాజు 2, విశాఖపట్నం 6, అనకాపల్లి 20, కాకినాడ 18, కోనసీమ 7, తూర్పు గోదావరి 18, పశి్చమ గోదావరి 4, ఏలూరు 7, బాపట్ల 1, కృష్ణా 2 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
⇒ అలాగే, వడగాడ్పులు శ్రీకాకుళం జిల్లాలో 8, అల్లూరి 8, విశాఖపట్నం 2, అనకాపల్లి 2, కాకినాడ 3, కోనసీమ 8, తూర్పుగోదావరి 1, పశ్చిమ గోదావరి 13, ఏలూరు 21, కృష్ణా 19, ఎనీ్టఆర్ 17, గుంటూరు 17, పల్నాడు 15, బాపట్ల 20, ప్రకాశం 6 మండలాల్లోను వీయనున్నాయని వివరించింది.
⇒ ఇక బుధవారం 195 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 147 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది.
⇒ సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడులో 41.9, మనుబోలు (నెల్లూరు) 41.5, వేమూరు (బాపట్ల), పెడన (కృష్ణా) 40.9, చింతూరు (అల్లూరి) 40.8, డెంకాడ (విజయనగరం) 40.7, రావికమతం (అనకాపల్లి) 40.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఈ సీజన్‌లో వర్షాలే వర్షాలు..
ఈ సీజన్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతాలు నమోదవుతాయని తెలిపింది. రుతు పవనాలు వేగంగా విస్తరిస్తుండడంతో మంచి వర్షాలకు అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఐఎండీ ప్రత్యేక బులిటెన్ విడుదల చేసింది. అలాగే, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, వాయవ్య భారతంలో సాధారణ వర్షపాతం, మధ్య, దక్షిణ భారతదేశాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకావచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర సోమవారం ఢిల్లీలో జరిగిన వర్చువల్ మీడియా సమావేశంలో అంచనా వేశారు. జూన్–సెప్టెంబర్ కాలంలో దీర్ఘకాల సగటు 87 సెం.మీ. వర్షపాతంలో 106 శాతం మేర వర్షపాతం నమోదుకావచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment