మూడు రోజులు తేలికపాటి వర్షాలు
నేడు 28 మండలాల్లో వడగాడ్పులు
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల విస్తరణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రం, మాల్దీవులు, కొమరిన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇవి రానున్న రెండు రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, కొమరిన్, అండమాన్, నికోబార్ దీవుల్లోని మిగిలిన భాగాలకు విస్తరించనున్నాయి. మరోవైపు దక్షిణ కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి, నైరుతి దిశగా వంగి ఉంది.
అలాగే దక్షిణ కోస్తా తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర అంతర్గత కర్నాటక వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఉంది. మరోపక్క రాష్ట్రంపైకి ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా రానున్న మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. ప్రధానంగా మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో, బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను వర్షాలు కురవవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
అదే సమయంలో అక్కడక్కడ పిడుగులు కూడా పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు మంగళవారం 28 మండలాల్లో వడగాడ్పలు వీచే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాల్లో, విజయనగరం 6, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వివరించింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఓబులదేవర చెరువు (శ్రీసత్యసాయి) వద్ద 5.5 సెంటీమీటర్లు, వెదురుకుప్పం (చిత్తూరు) 3.8, మండపేట (కోనసీమ) 3.3, కొత్తవలస (విజయనగరం) 3, పులివెందుల (వైఎస్సార్) 2.9, నిడదవోలు (తూర్పు గోదావరి), అడ్డతీగల (అల్లూరి సీతారామరాజు)ల్లో 2.8, చింతలపూడి (ఏలూరు), నర్సీపట్నం (అనకాపల్లి)ల్లో 2.6 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి.
22న అల్పపీడనం
ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 24వ తేదీకి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment