రెండు రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం
అప్పటి వరకు కొనసాగనున్న ఎండల తీవ్రత
ఏప్రిల్‌లో 46 డిగ్రీలతో ఉష్ణోగ్రతలు మొదలు
మే ఆఖరు వరకు అదే రీతిలో కొనసాగిన ఉష్ణతాపం
నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రెండు రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారానికి ఇవి రాయలసీమలోకి ప్రవేశిస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, త్రిపుర, మేఘాలయ, అస్సాంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ప శ్చిమ బెంగాల్, సిక్కింలోని చాలా ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే రెండు రోజుల్లో అరేబియా సముద్రంలోని పలు భాగాలు, లక్షదీ్వప్, కేరళ, కర్ణాటక, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో రుతు పవనాలు ప్రవేశించే వరకు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. రెమల్ తుపాను ప్రభావంతో గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఎండ, ఉక్కపోత ప్రభావం ఎక్కువగా ఉంటోంది. రుతు పవనాలు ముందుగా ప్రవేశించనుండటంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత మిగిలిన ప్రాంతాల కంటే కొంచెం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నారు. అవి పురోగమించకపోతే ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండేదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
ఏదేమైనా మరో రెండు, మూడు రోజులు ఎండల తీవ్రత ఉంటుందని, ఆ తర్వాత వాతావరణం చల్లబడి వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువులో 45.4 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 45.3, గుంటూరు జిల్లా తుళ్లూరు, ఫిరంగిపురంలో 45, బాపట్ల జిల్లా పర్చూరులో 44.8, నెల్లూరు జిల్లా జలదంకిలో 44.4, కృష్ణా జిల్లా కోడూరులో 44.2, అల్లూరి జిల్లా కూనవరంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కొద్ది రోజులు ఎండల్లో తిరగొద్దు
రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశిస్తున్నప్పటికీ, మరోవైపు ఎండల తీవ్రత మరికొద్ది రోజులు కొనసాగనుంది. ఈ తరుణంలో వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠిన పనులను ఎండలో చేయరాదని వైద్యులు సూచిస్తున్నారు.
నేడు అక్కడక్కడ వడగాడ్పులు, వర్షం
శనివారం విజయనగరం జిల్లాలో 6, పార్వతీపురం మన్యం జిల్లాలోని 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 43 మండలాల్లో ఓ మోస్తరు వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం నుంచి మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశి్చమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ప రుతు పవనాలుమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ వేసవి భగభగ
ఈ ఏడాది వేసవి ఆద్యంతం అగ్ని గుండంగానే కొనసాగింది. గతానికి భిన్నంగా మార్చి మూడో వారం నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అప్పట్నుంచే వడగాడ్పులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ మొదటి వారానికల్లా ఉష్ణోగ్రతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. సాధారణం కంటే 5–8 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలోని 358 మండలాల్లో వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీచాయి.
మే నెల మధ్యలో నమోదు కావలసిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ రెండో వారంలోనే రికార్డయ్యాయి. ఏప్రిల్ 8న మార్కాపురంలో 46 డిగ్రీలు, మే 2న 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 3న నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజనులో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. ఆ తర్వాత కూడా పగటి ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యమధ్యలో వర్షాలు కురిసి ఉష్ణ తీవ్రతను కాస్త తగ్గించినా, రెండు మూడు రోజుల్లోనే మళ్లీ యథా స్థితికి చేరుకున్నాయి.
ఇలా ఒకపక్క అధిక ఉష్ణోగ్రతలు, మరోపక్క వడగాడ్పులు పోటీ పడుతూ జనాన్ని బెంబేలెత్తించాయి. ఈ వేసవిలో రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 5–9 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఏప్రిల్ 17న ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 33.4 డిగ్రీలు, కర్నూలులో 32, కడపలో 31 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మే నెలలో రాత్రిళ్లు పలుమార్లు 31–34 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment