స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు
ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక రోజు ముందుగా అంటే గురువారానికే అవి కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నెల 31 లేదా వచ్చే నెల ఒకటో తేదీకల్లా రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. వీటి పురోగమనం ఆశాజనకంగా ఉండడంతో గురువారం లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది.
వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
ఒకటి నుంచి వర్షాలు..
రాష్ట్రంలో జూన్ ఒకటో తేదీ నుంచి వర్షాలు కురవనున్నాయి. జూన్ ఒకటిన అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను, జూన్ 2న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా సంభవిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment