ఐదు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
ఆ తర్వాత ఆరు రోజులకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం
మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్న వాతావరణ శాఖ
రాష్ట్రంలోని పలు చోట్ల మండుతున్న ఎండలు.. భారీగా ఉష్ణోగ్రతలు నమోదు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు మధ్య బంగాళాఖాతంలో చురుకుగా కదులుతున్నాయి. రానున్న 5 రోజుల్లో రుతుపవనాలు బంగాళాఖాతంలో పూర్తిగా విస్తరించి కేరళను తాకేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వారాంతంలోగా కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఆరు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. రుతుపవనాల కదలికల ఆధారంగా రాష్ట్రంలోకి ప్రవేశించే సమయం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. దేశంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.
చాలా చోట్ల సాధారణం.. కొన్నిచోట్ల అత్యధికం..
ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనవల్ల రానున్న రెండ్రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవగా కొన్నిచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 45.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఆ తర్వాత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జంబూగలో 45.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 44.9, జగిత్యాల జిల్లా తిర్యాణిలో 44.9, ఆసిఫాబాద్ జిల్లా వెల్గటూరులో 44.8, జగిత్యాల జిల్లా జైనలో 44.7, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 44.7 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment