సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గురువారం ఉదయం కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. వారంలో తెలుగు రాష్టాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. గతేడాది కంటే ముందుగానే నైరుతి పవనాలు రాగా, ఇప్పటికే కేరళ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు.. కేరళ రాష్ట్రాన్ని ఐఎండీ అలెర్ట్ చేసింది.
నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాల్లో విస్తరించాయి. లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి.
కాగా, వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాన్ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment