- మెదక్ జిల్లా చేగుంటలో అత్యధికంగా 21.7 సెంటీమీటర్లు, మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో 20.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 25 చోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ ప్రకటించింది.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుండపోత వాన కురిసింది. చాలా ప్రాంతాల్లో పది, పదిహేను సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది. వందకుపైగా బస్తీలు నీటమునిగాయి. పెద్ద సంఖ్యలో కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు.
ఐదు జిల్లాల్లో అప్రమత్తం
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వానలు పడే అవకాశం ఉందని.. ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
సాక్షి, హైదరాబాద్/ నెట్‌వర్క్: రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. చెరువులు నిండాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజుల కింద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోపాటు ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుత నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో ఇప్పటివరకు 36.9 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 2.67 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా హైదరాబాద్‌లో 8.17 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు ప్రకటించింది.
జిల్లాల్లో వానలే వానలు..
- యాదాద్రి జిల్లాలో బుధవారం రాత్రంతా కుండపోత వాన పడింది. 25 చెరువులు అలుగు పోస్తున్నాయి. బిక్కేరు వాగు పొంగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 1,000 ఎకరాల్లో వరి నీటమునిగింది. పత్తి చేలలో నీరు నిలిచింది. మూసీ కల్వర్టులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపివేశారు.
- జనగామ జిల్లాలో భారీ వర్షంతో బచ్చన్నపేట- నక్కవానిగూడెం శివారు, జనగామ మండలం గానుగుపహాడ్ వాగులు పొంగి పొర్లుతున్నాయి. నల్లచెరువు, వెల్దండ, గండిరామారం, తాటికొండ వల్లభరాయ్, ఛాగల్ మర్రికుంట చెరు వులు మత్తడి పోస్తున్నాయి. రోడ్లపై నీటి వరదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
- నిర్మల్ జిల్లాలో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వీర్నపల్లి మండలంలోని గిరిజన తండాల్లో వాననీరు ఇళ్లలోకి చేరింది. పత్తి చేన్లు మునిగాయి. నక్కవాగు, సుద్దవాగు, బిక్కవాగు, గంజివాగు, సండ్రవాగులు పొంగిపొర్లుతున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుద్రంగి మండలంలో గొర్రెగుండం జలపాతం దూకుతోంది.
- వికారాబాద్ జిల్లాలో వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. పరిగి, వికారాబాద్, తాండూర్ పట్టణాల్లోని పలు కాలనీల్లో నీళ్లు చేరాయి. ధారూర్ మండలం రాళ్లచిట్టంపల్లిలో ఇల్లు కూలి షబ్బీర్ (38) అనే వ్యక్తి మృతి చెందాడు. మోమిన్‌పేట మండలం గోవిందాపూర్‌కు చెందిన బుడ్డమ్మ ఆసరా పింఛన్ తీసుకొని వస్తుండగా మల్లారెడ్డిగూడెం సమీపంలోని వాగు దాటుతూ కొట్టుకుపోయింది. మొయినాబాద్ మండలం అమ్డాపూర్‌లో ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
వాగులో చిక్కుకుని.. సురక్షితంగా బయటపడి
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం–ఎఖీన్‌పూర్ గ్రామాల మధ్య వాగులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోగా.. పోలీసులు ఫైర్ రెస్క్యూ టీం, గ్రామస్తులతో కలిసి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
తెగిన చెరువు కట్ట
భారీవర్షంతో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో చెరువు కట్ట తెగిపోవడంతో పెద్దవాగు పొంగిపొర్లింది. సాతారంలో శివార్లలో వ్యవసాయ పనులకు వెళ్లిన ఏడుగురు, వేంపల్లిలో మరొకరు వాగులో చిక్కుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు గజ ఈతగాళ్లు, తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment