ఖరీఫ్.. పాయే.. | .. .. Kharif PAAYE | Sakshi
Sakshi News home page

ఖరీఫ్.. పాయే..

Published Sat, Nov 8 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM

.. .. Kharif PAAYE

అనంతపురం అగ్రికల్చర్:  ఈ ఏడాది కూడా వర్షాభావం ఁఅనంత* ఖరీఫ్‌ను కాటేసింది. లక్షలాది హెక్టార్లలో సాగు చేసిన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అందులో ప్రధానమైన వేరుశనగ పంట 5.06 లక్షల హెక్టార్లలో వేయగా వర్షాలు లేక బెట్ట పరిస్థితులు ఏర్పడటంతో ఎకరాకు సగటున రెండు బస్తాల దిగుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొంది.

అప్పులు చేసి పెట్టిన రూ.1,500 కోట్ల పంట పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదు. దీంతో సుమారు రూ.2,500 కోట్ల పంట దిగుబడులు కోల్పోయారు. వర్షపాతం, పంటల విస్తీర్ణం, పంట నష్టం, బెట్టపరిస్థితులను ప్రామాణికంగా తీసుకుని ఇటీవల  జిల్లా యంత్రాంగం పంట నష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపారు.

 ఆరు మండలాలకు దక్కని చోటు
  ప్రాథమిక నివేదిక ప్రకారం కరువు మండలాల జాబితాలో 57 మండలాలు చోటు దక్కించుకోగా తక్కిన ఆరు మండలాలకు స్థానం లేకుండా పోయింది. జిల్లా అంతటా వర్షపాతం, పంట స్థితిగతులు దాదాపు ఒకే రకంగా ఉన్నా కూడేరు, పెద్దవడుగూరు, శెట్టూరు, పెనుకొండ, లేపాక్షి, రాయదుర్గం మండలాలు కరువు జాబితాలో లేకపోవడం విశేషం. ఈ ఆరు మండలాల విషయానికి వస్తే కేవలం పెద్దవడుగూరు మండలంలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.

మిగతా మండలాల్లో వర్షం తక్కువగానే పడింది. పెనుకొండ మండలంలో 60 శాతం తక్కువ వర్షం పడింది. లేపాక్షిలో కూడా 50 శాతం తక్కువ వర్షం కురిసింది. అయినా కరువు జాబితాలో లేకపోవడం గమనార్హం. ఈ ఆరు మండలాలను జాబితాలో చేర్చాలని జిల్లా అధికారులు మరోసారి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.

 96 డ్రైస్పెల్స్ నమోదు
 మునుపెన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో ఏకంగా 96 డ్రైస్పెల్స్ (వర్షపాత విరామాలు) నమోదయ్యాయి. జూన్ నెలలో 63.9 మిల్లీమీటర్లకు (మి.మీ) గాను 44.9 మి.మీ, జూలైలో 67.4 మి.మీ గాను 35.7 మి.మీ, ఆగస్టులో 88.7 మి.మీ గాను 56.8 మి.మీ, సెప్టెంబర్‌లో 118.4 మి.మీ గాను కేవలం 35 మి.మీ వర్షం కురిసింది. అంటే ఖరీఫ్‌లో 335.4 మి.మీ వర్షం పడాల్సివుండగా 50 శాతం తక్కువగా 172 మి.మీ వర్షం పడింది.

వరుసగా 21 నుంచి 28 రోజుల పాటు వర్షం పడనివి 50, 29 నుంచి 42 రోజుల పాటు వర్షం పడనివి 43, వరుసగా 43 రోజులకు పైగా వర్షం రాని డ్రైస్పెల్స్ 3 ఉండటం విశేషం. ఇలా నెలల తరబడి వర్షం మొహం చాటేయడంతో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కరువు జాబితాలో లేని ఆరు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నా... మధ్య మధ్యలో ఒకట్రెండు సార్లు చిరుజల్లులు పడటంతో వర్షం కురిసినట్లు రికార్డు కావడంతో డ్రైస్పెల్స్ సంఖ్య తగ్గడం వల్ల జాబితాలో లేకుండా పోయాయి.

కేవలం 2.5 మి.మీ వర్షం పడినా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. బత్తలపల్లి, బొమ్మనహాల్, బుక్కపట్టణం, చిలమత్తూరు, ధర్మవరం, గాండ్లపెంట, గార్లదిన్నె, గోరంట్ల, హిందూపురం, కనగానపల్లి, కొత్తచెరువు, లేపాక్షి, మడకశిర, ముదిగుబ్బ, ఓడీచెరువు, పామిడి, పరిగి, పెద్దపప్పూరు, పెనుకొండ, పుట్టపర్తి, రామగిరి, రాప్తాడు, రొద్దం, శింగనమల, సోమందేపల్లి, తాడిమర్రి, తాడిపత్రి, తనకల్లు, ఉరవకొండ, యల్లనూరు మండలాల్లో 50 నుంచి 86 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది.

 ఎకరాకు రెండు బస్తాలు
  ఈ ఏడాది వేరుశనగ ఎకరాకు సగటున రెండు బస్తాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రణాళిక శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు కొనసాగిస్తున్న పంట కోత ప్రయోగాలు (క్రాప్ కటింగ్ ఎక్స్‌పెరిమెంట్స్) పరిగణలోకి తీసుకుంటే దిగుబడులు దయనీయంగా ఉన్నాయి. 756 పంట కోత ప్రయోగాలు నిర్వహించాల్సివుండగా ఇప్పటివరకు 242 ప్రయోగాలు పూర్తి చేశారు.

హెక్టారుకు 203 కిలోలు దిగుబడులు అంటే ఎకరాకు 80 కిలోలు వచ్చే పరిస్థితి ఉంది. ఎకరాకు ఒక క్వింటా కూడా దక్కని పరిస్థితి నెలకొంది. పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు గ్రామంలో చెట్టుకు ఒక కాయ కూడా లేక ఁజీరో* దిగుబడులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. చాలా ప్రయోగాల్లో 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాములు వచ్చాయి.

కొన్ని చోట్ల మాత్రమే కాస్త అటుఇటుగా ఒక కిలో దిగుబడులు వచ్చాయి. రెండు మూడు మండలాలు మినహా తక్కిన అన్ని మండలాల్లోనూ పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రయోగాలు పూర్తయిన వాటిలో గోరంట్ల, బ్రహ్మసముద్రం, యాడికి, పామిడి, రాయదుర్గం, తాడిపత్రి, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, కూడేరు, శింగనమల, యల్లనూరు, నార్పల, బుక్కరాయసముద్రం, అనంతపురం, రాప్తాడు, శెట్టూరు, బత్తలపల్లి తదితర మండలాల్లో పంట దిగుబడులు నిరాశాజనకంగా ఉన్నాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement