నిర్వేదం.. | Despair .... | Sakshi
Sakshi News home page

నిర్వేదం..

Published Thu, Sep 3 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

నిర్వేదం..

నిర్వేదం..

అడుగంటిన అన్నదాతల ఆశలు
ముఖం చాటేసిన వరుణుడు
25 లక్షల హెక్టార్లలో మొలకెత్తని విత్తనాలు
 

బెంగళూరు: రాష్ట్రం లో వర్షం జాడ లేకపోవడంతో వివిధ రకాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 25 లక్షల హెక్టార్లలో వేసిన విత్తనం భూమిలోనే ఎండిపోయిం ది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఆశించిన మేర కురవలేదు. ప్రధానంగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో సాధారణం కంటే 43 శాతం, కరావళి ప్రాంతంలో 27 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. దక్షిణ కర్ణాటకలో సాధారణం కంటే 20 శాతం     తక్కువ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే సగటున 32 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో వ్యవసాయ శాఖ ఈ ఏడాది ఖరీఫ్‌లో నిర్దేశించుకున్న 73 లక్షల హెక్టార్ల విత్తన ప్రక్రియలో ఇప్పటి వరకు 52 లక్షల హెక్టార్లను మాత్రమే చేరుకోగలిగింది. గత ఏడాది ఇదే సమయానికి 61.78 లక్షల హెక్టార్లలో విత్తన ప్రక్రియ జరిగింది.

 అగమ్యగోచరం
 అప్పు చేసి ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగు చేపట్టిన రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరో 20 రోజుల్లో ఖరీఫ్ ముగుస్తున్నా చాలా చోట్ల వర్షాభావం వల్ల భూమిలో వేసిన విత్తనం మొలకెత్తలేకపోయింది. వ్యవసాయ శాఖ గణాంకాలను అనుసరించే ఈ ఏడాది ఇప్పటి వరకూ జరిగిన విత్తులో 25 లక్షల హెక్టార్లలో విత్తనం ఎండిపోయిందంటే రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసుకోవచ్చు. పంట సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని అయోమయంలో అన్నదాతలు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పరువు కాపాడుకునేందుకు పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్‌లో 172 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ మంది పంట నష్టం కావడంతో పాటు రబీ పంట సాగుకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్లనే అన్నది బహిరంగ రహస్యమని కర్ణాటక హసిరుసేన వ్యవస్థాపక సభ్యుడు కోడిహళ్లి చంద్రశేఖర్ పేర్కొంటున్నారు.

 రబీ దిశగా అధికారులు
 ఖరీఫ్ పంటపై ఆశలు వదులకున్న రైతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా రబీ పంట సాగుపై దృష్టి సారిస్తున్నారు. పొలంలోనే ఎండిపోయిన పైరును, విత్తనాలను వదిలి రబీ పంట సాగు చేపడుతున్నారు. ఇందుకోసం పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో తీసుకున అప్పు తీర్చందే కొత్తగా రుణాలు మంజూరు చేయలేమంటూ బ్యాంకర్లు పేర్కొంటుండడంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వైపు చూస్తున్నారు. కాగా, రబీ పంట సాగు కింద గత ఏడాది 33 లక్షల హెక్టార్లను లక్ష్యంగా ఉంచుకున్న వ్యవసాయాధికారులు ఈ సారి దానిని 40 లక్షల హెక్టార్లకు పెంచారు. ఖరీప్ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ డెరైక్టర్ సుబ్బయ్య మాట్లాడుతూ... ‘ఖరీఫ్ పంట నష్టం వాస్తవమే. రబీలో ఈ పరిస్థితి రాదని ఆశిస్తున్నాం. లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుగుణంగా ఇప్పటికే అవసరమైన పరిమాణంలో విత్తనాలు, ఎరువులతో పాటు యంత్ర పరికరాలను కూడా సమకూర్చుకుంటున్నాం.’ అని పేర్కొన్నారు.                     
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement