శ్రీకాకుళం రూరల్/శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం ఒక మాదిరి వర్షాలు కురిశాయి. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురవడంతో ఇబ్బడిముబ్బడిగా వేసిన వరినారుమళ్లు అటు తరువాత తలెత్తిన వర్షాభావ పరిస్థితులతో ఎండిపోవడం మొదలెట్టాయి. రైతులు మోటార్లతోనూ... బిందెలతోనూ నీటిని తోడి నారుమళ్లను కాపాడుకుంటూ వచ్చారు. ఇక వర్షాలు రావేమోనన్న బెంగపడుతున్న తరుణంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిశాయి. దీంతో మళ్లీ నారుమళ్లకు ఊపిరి పోశాయి.
అరకొరగానే ఖరీఫ్
ఖరీఫ్‌లో సాధారణ సాగు 2.45లక్షల హెక్టార్లు కాగా ఇంతవరకు 76,662 హెక్టార్లకే పరిమితమైంది. వరి సాధారణ విస్తీర్ణం 2 లక్షల హెక్టార్లు కాగా 66,572 హెక్టార్లలోనే సాగయింది. ఇటీవల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులకు వరి నారుమళ్ళు, నాట్లుతోపాటు మెట్టు పంటలు కూడా ఎండిపోయాయి. దీనికి కరెంటు కోతలు తోడవడంతో మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. ఇంతవరకు అక్కడక్కడా ఆయిల్ ఇంజన్ల సహాయంతో నీటి తడులిచ్చిన వరి నారుమడులు, మెట్టు పంటలు కాపాడుకుంటూ వచ్చారు. ఈ తరుణంలో కురిసిన వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. అయితే ఈ వర్షాలు నారుమడుల్ని కొంతవరకు బతికించుకునేందుకే తప్ప దమ్ములకు సరిపోవని రైతులు చెబుతున్నారు.
ఆరంభం నుంచీ అరకొరే...
ఖరీఫ్ ఆరంభంలో ఒకమాదిరి వర్షాలు కురిసినా తరువాత అరకొరగానే కురుస్తున్నాయి. జూన్ నెలలో సాధారణం కంటే 65.9 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది.
దీంతో రైతులు ఆదరాబాదరాగా వరినారు మడులు సిద్ధం చేశారు. జూలై, ఆగస్టులో ఇంతవరకు కనీసం చుక్క చినుకు కూడా పడలేదు. జూలై నెలల్లో వర్షపాతం సాధారణం కంటే 51.7 శాతం తక్కువ నమోదయింది. ఆగస్టులో 12 తేదీ వరకు సాధారణంగా అయితే 7033.3 మి.మీలు నమోదు కావాల్సి ఉండగా కేవలం 1484.2 మిమీలు మాత్రమే నమోదైంది. బుధవారం లావేరులో అత్యధికంగా 66.6 మి.మీలు వర్షపాతం నమోదవగా, టెక్కలిలో 52.4 మిమీ.లు, శ్రీకాకుళం మండలంలో అత్యల్పంగా 0.1 మి.మీ. మాత్రమే నమోదయింది.
పలుకరించిన వరుణుడు
Published Thu, Aug 13 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM
Advertisement