ముంచెత్తిన వాన
విశాఖలో భారీ వర్షం.. 14 సెం.మీ. నమోదు
జిల్లాలోనూ ఆశాజనకంగా వర్షం
ఖరీఫ్ పంటలకు మేలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ద్రోణులు, ఆవర్తనాలు, ఈశాన్య రుతుపవనాల కరుణతో వర్షాలు కుమ్మరిస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు ఆదివారం కూడా కొనసాగాయి. భారీ వర్షాలకు వరసగా రెండు రోజులూ రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలో వర్షపాతం నమోదయింది. శనివారం ఉదయం వరకు 7 సెం.మీ.ల వర్షం కురవగా ఆదివారం ఉదయం వరకు 14 సెం.మీ.ల వాన కురిసింది. ఆదివారం రాత్రికి విశాఖలో 6 సెం.మీ.ల వర్షపాతం రికార్డయింది. ఎడతెరిపిలేని వానకు జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. జిల్లాలోనూ రెండు రోజులుగా వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. ఆదివారం పాయకరావుపేట, నక్కపల్లి, యలమంచిలి, అనకాపల్లి, తగరపువలస, భీమిలి, పెందుర్తి, తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నర్సీపట్నం, చోడవరం, మాడుగులతో పాటు మన్యంలోనూ తేలికపాటి జల్లులు కురిశాయి. ఈ వర్షాలు పంటలకు ఎంతో మేలు చేస్తాయని రైతులు సంబరపడుతున్నారు. ఇప్పటికే వరి పంట వెన్ను, పొట్ట దశలోను, చెరకు ఎదిగే దశలోనూ ఉన్నాయి. వీటితో పాటు ఇతర పంటలకు ఇవి ప్రాణం పోశాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వానలకు రిజర్వాయర్లలోనూ వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఇది కూడా భవిష్యత్తులో సాగునీటి ఎద్దడి లేకుండా చేస్తుందని భావిస్తున్నారు.
గత కొన్నాళ్లుగా వర్షాభావ పరిస్థితులేర్పడిన నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలు పంటలకు మళ్లీ జీవం పోసినట్టయిందని వీరు ఊరట చెందుతున్నారు. ఆవ ప్రాంతంలో వరిపైరు నీటమునిగింది. పలు చోట్ల ఈదురు గాలులకు చెరకుతోటలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలయిన మునగపాక బీసీ కాలనీ, నాగులాపల్లి జగ్గయ్యపేట అగ్రహారం, పల్లపు ఆనందపురం, యాదగిరిపాలెం తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు నానా అవ స్థలకు గురయ్యారు. ఈ వర్షాలు వరికి మేలు చేస్తాయని వ్యవసాయాధికారి పావని తెలిపారు. ఎక్కడైనా వరి ముంపునకు గురైతే సాధ్యమైనంత త్వరగా బయటకు పోయేలా చూడాలని రైతులకు సూచించారు.
విశాఖలో... :విశాఖలోని పూర్ణామార్కెట్, వెలంపేట, స్టేడియం రోడ్డు, రామకృష్ణా జంక్షన్, పండావీధి ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. గాజువాక ప్రాంతం మసీదు రక్షణ గోడ, కొత్తగాజువాక, కాకతీయనగర్‌లలో గోడలు కూలిపోయాయి. పాతగాజువాకను జాతీయ రహదారి ముంచెత్తింది. పెదగంట్యాడ హెచ్‌బీ కాలనీ, కుంచమాంబ కాలనీ, కూర్మన్నపాలెం సాయిరాంనగర్ కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. తెరపినివ్వకుండా కురిసిన వానకు జనం బయటకు వచ్చే సాహసం చేయలేకపోయారు. వీటికి గాలులు కూడా తోడవడంతో జనం ఇబ్బంది పడ్డారు. ఆదివారం కావడంతో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. చిరువ్యాపారులు పూర్తిగా దుకాణాలు తెరవడం మానేశారు. సాయంత్రానికి వర్షాలు తెరపినిచ్చాయి. సోమవారం కూడా వర్షాలు కొనసాగుతాయని, తర్వాత తగ్గుముఖం పడతాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు.
మేహాద్రిలో పెరిగిన నీటిమట్టం : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు మేహాద్రి జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏఈ రవీంద్రనాధ్‌ఠాగూర్, ఇన్‌స్పెక్టర్ సుబ్బరాజు రిజర్వాయర్ పరిస్ధితిని అంచనా వేశారు. 58.50 అడుగుల నుంచి 60అడుగులకు నీటిమట్టం పెరిగినట్టు ఇన్‌స్పెక్టర్ సుబ్బరాజు తెలిపారు. ముందస్తుగా ఒక గేటు ఎత్తి 1045 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు
వరి, మొక్కజొన్నకు అనుకూలం
వర్షాలు వరి, మొక్కజొన్న పంటలకు మేలు చేశాయి. కొంత కాలంగా వర్షాభావ పరిస్థితులతో ఆలస్యంగా వేసిన వరినాట్లు ఎండిపోతున్నాయి. ఈ దశలో వర్షాలతో కళకళలాడుతున్నాయి. రబీ మొక్కజొన్న నాట్లు వేసినవారికి, ఇంకా విత్తనాలు జల్లాలనుకున్న రైతులకు ముసురుపట్టిన వాతావరణం మేలు చేకూర్చింది. ఖరీఫ్‌లో ముందస్తుగా నాట్లు వేసినచోట వరి పొట్టదశలో ఉంది. అది వాలిపోకుండా రైతులు తాటిఆకులతో కట్టలుగా కట్టి నిలబెడుతున్నారు. కూరగాయల పంటకు కూడా వర్షం అనుకూలం. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సరుగుడు నాట్లు పనుల్లోనూ రైతులు నిమగ్నమయ్యారు. కాగా పూలతోటలు, ఇటీవల మిరపనారు వేసినచోట్ల మడులలో నీరు నిల్వ ఉండటంతో ఇవి కుళ్లిపోయే ప్రమాదం ఉందని మెట్టప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆనబ, దొండ, చిక్కుడు, ముల్లంగి పంటలు ఊట పట్టే ప్రమాదముందని రైతులు భయపడుతున్నారు.