నీటి నిల్వలపై ముంబైకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఎంసీ తెలిపింది...
సాక్షి, ముంబై: నీటి నిల్వలపై ముంబైకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఎంసీ తెలిపింది. నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో జూలై 31 వరకు సరిపడే నిల్వలున్నాయని స్పష్టం చేసింది. వర్షాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయనే దాని గురించి వాతావరణశాఖ ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదని, సమాచారం అందగానే ప్రణాళిక ప్రకారం నీటి సరఫరా చేస్తామని బీఎంసీ నీటి సరాఫరా శాఖ చీఫ్ ఇంజినీరు రమేశ్ బాంబ్లే అన్నారు.
ప్రస్తుతం నగరానికి నీటి సరఫరాచేసే బాత్సా, మోడక్‌సాగర్, మధ్య వైతర్ణ, విహార్, తులసీ, తాన్సా జలాశయాల్లో 4,06,973 మిలియన్ లీటర్ల నిల్వ ఉందని, దీన్ని పరిగణలోకి తీసుకుంటే జులై 31 వరకు నీటికి ఢోకా లేదని బాంబ్లే అన్నారు. ముంబైకర్లకు ప్రతి రోజు 3,750 మిలియన్ లీటర్ల నీరు అవసరముంటుందని ఆయన అన్నారు. కాగా, కొన్నేళ్లుగా సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో నీటి నిల్వలు కాపాడుకోడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రతి ఏటా నెల రోజుల ముందే వాతావరణ శాఖ నుంచి వర్షానికి సంబంధించిన వివరాలు వస్తాయని, దీన్ని బట్టి వర్షాలు ఆలస్యమైతే ఎంత శాతం నీటి కోత అమలు చేయాలో ముందుగానే ప్రణాళిక రూపొందిస్తారని ఆయన చె ప్పారు.