the water
-
శివమెత్తిన ‘గంగ’
చిలమత్తూరు (హిందూపురం): చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ వై.గొల్లపల్లిలోని పాడుబడ్డ బావిలో నీరు పెల్లుబుకుతోంది. స్థానికులు తెలిపిన మేరకు... రైతు కె.చిన్నప్పయ్య పొలంలో ఏర్పాటు చేసుకున్న బావిలో పదేళ్ల కిందటే నీళ్లు అడుగంటిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం యర్రకొండ అటవీ ప్రాంతంలో, చిలమత్తూరు పరిసర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో మెరుపులు సంభవించినప్పుడు శిల బావిలో పడడంతో నీరు పైకి పెల్లుబికి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎండిన బావిలో జలధార నిండుగా రావడంతో గ్రామస్తులు తిలకించేందుకు క్యూ కట్టారు. -
అమ్మా.. ఇంత దారుణమా..!
నిజాంసాగర్: నిండుగా నీటితో కళకళలాడాల్సిన నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక బోసిపోవడంతో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ ఆశ్చర్యపోయారు. జిల్లాకు సాగు, తాగు నీరు అందించే ప్రాజెక్టు ఆగస్టులో ఇంత దారుణంగా ఉండటం ఊహించలేదన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో నిర్వహించిన మల్లన్నసాగర్ సాధన సదస్సుకు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ అమ్మా ఇంతదారుణమా అన్నారు. అంతకుముందు ప్రాజెక్టు వరదగేట్ల వద్ద అడుగంటిన నీటి మట్టాని ఆయన తెలుసుకున్నారు. ప్రాజెక్టు వరద గేట్లు, ఆయకట్టు, నీటి మట్టాలను ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు తదితరులున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి ఆలయాలు, ప్రభుత్వ స్థలాలతో పాటు ఖాళీ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టపై సిద్ధి వినాయక ఆలయంలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఆలయం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. గ్రామాల వారిగా నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. ఆలయాల వద్ద నాటిన మొక్కలను పూజారులు సంరక్షించాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంపగోవర్దన్, ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, రాజేశ్వర్, డీసీసీబీ చైర్మన్ ముజుబోద్దిన్, ఆలయపూజారి సంజీవ్రావ్శర్మ నాయకులు తదితరులున్నారు. -
ముగ్గురిని రక్షించి.. తాను గల్లంతై..
ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి వంకలో పడ్డ ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి వారిని రక్షించి తూములో పడి ప్రవాహంలో కొట్టుకుపోయిన 65 ఏళ్ల వృద్ధుడు పోలీసుల ముమ్మర గాలింపు పూతలపట్టు: ముగ్గురిని ప్రమాదం నుంచి రక్షించడం కోసం ఓ వృద్ధు డు తన ప్రాణాలను పణంగా పెట్టి న ఘటన పూతలపట్టు మండలంలోని యం.బండపల్లె వంకలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పూ తలపట్టు, పెనుమూరు పోలీసుల కథనం మేరకు.. జీడీ నెల్లూరు మండలం కొట్రకోణ గ్రామానికి చెందిన కె. కృష్ణయ్య(65) కొంత కాలంగా పెనుమూరు మండలం కలికిరి గ్రామంలోని తన కూతురు వద్ద ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు యం.బండపల్లె నుంచి తూపల్లె మీదుగా వెళ్లే వంతెనను దాటుతున్నాడు. ఈ సమయంలో ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వంతెనను దాటుతుండగా అదుపుతప్పి నీటిలో పడ్డారు. వెంటనే కృష్ణయ్య వారిని కాపాడాడు. ఇదే క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న తూములో పడ్డాడు. ఎన్టీఆర్ జలాశయానికి కేవలం 200 మీటర్లు దూరంలో ఘటనాస్థలం ఉండడం, నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వరదనీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పూతలపట్టు ఎస్ఐ మురళీమోహన్ సంఘటనా స్థలం వద్దకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కృష్ణయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో ఎంత వెదికినా కృష్ణయ్యజాడ దొరకలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. శనివారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. స్థానికులు కృష్ణయ్య సాహసాన్ని.. పరోపకార గుణాన్ని తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. -
భూగర్భ గరళం
ప్రజల ప్రాణాలతో చెలగాటం దశాబ్దాలుగా కలుషితమవుతున్న జలం పారిశ్రామిక వాడల్లో పరిస్థితి దారుణం ఎన్జీఆర్ఐ అధ్యయనంలో తేటతెల్లం డిసెంబర్లో తుది నివేదిక సిటీబ్యూరో: మహా శివుడు ఒక్కసారే గరళం తాగాడు. గ్రేటర్ ప్రజలు మాత్రం జలం పేరిట నిత్యం విషం తాగుతున్నారు. అధికారుల ఉదాసీనత సాక్షిగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మహా నగరంలో భూగర్భ జలాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసింది. పారిశ్రామిక వాడల్లో భూగర్భ జలాలు హాలాహలంగా మారాయని ఆ సంస్థ నిగ్గు తేల్చింది. దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనిక వ్యర్థాలు భూమిలోకి ఇంకడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని తేటతెల్లం చేసింది. ఎన్జీఆర్ఐ నిపుణులతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చేయించిన అధ్యయనంలో ఈ అంశం వెలుగు చూసింది. పర్యావరణ పరిరక్షణలో బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు, పీసీబీల నిర్లక్ష్యానికి ఫలితమే విష జలమని వెల్లడవుతోంది. గత ఏడాది వర్షాకాలానికి ముందు... ఆ తరువాత సుమారు13 పారిశ్రామిక వాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భ జలాలు... చెరువుల నీటి నమూనాలను ఎన్జీఆర్ఐ సేకరించి పరీక్షించింది. వర్షాకాలానికి ముందు... ఆ తరువాత భూగర్భ జలాల్లో కరిగిన ఘన పదార్థాల శాతంలో ఎంతో వ్యత్యాసం ఉందని తేల్చింది. సాధారణంగా ఒక లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మిల్లీగ్రాములకు మించ కూడదు. కానీ అనేక పారిశ్రామిక వాడల్లో ఇందుకు మూడు నాలుగురెట్లు అధికంగా టీడీఎస్ నమోదవడం గమనార్హం. నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్ నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాల్లోని కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. ఇదీ తీరు ►నాచారం- ఉప్పల్ ప్రాంతాల్లోని నీటి నమూనాలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ (కరిగిన ఘన పదార్థాలు) గరిష్టంగా 3730 ఎంజీ/లీ. నమోదు కాగా... వర్షాకాలం అనంతరం నిర్వహించిన పరీక్షల్లో టీడీఎస్ 1970 ఎంజీ/లీ నమోదైంది. ► మాల్లాపూర్ ఐడీఏ ప్రాంతంలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 5390 ఎంజీ/లీ. నమోదు కాగా... వానా కాలం తరువాతనిర్వహించిన పరీక్షల్లో 1720 ఎంజీ/లీ నమోదైంది. ► చర్లపల్లి ఐడీఏలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 6350 ఎంజీ/లీ. కాగా... ఆ తరువాత 2140 ఎంజీ/లీ నమోదైంది. ►కాటేదాన్ ఐడీఏలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 5530ఎంజీ/లీ. కాగా... అనంతర కాలంలో 1860 ఎంజీ/లీ నమోదైంది. ► బాలానగర్, సనత్ నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 7500 ఎంజీ/లీ. కాగా... అనంతరం 1530 ఎంజీ/లీ.గా తేలింది. ►ఖాజీపల్లి ఐడీఏలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 4830 ఎంజీ/లీ. నమోదు కాగా... ఆ తరువాత 1810 ఎంజీ/లీ నమోదైంది. ►బొంతపల్లి ఐడీఏ ప్రాంతాల్లో తొలుత టీడీఎస్ గరిష్టంగా 1920 ఎంజీ/లీ. కాగా..అనంతరం 1280 ఎంజీ/లీ నమోదైంది. ►పటాన్చెరువు-బొల్లారం-పాశమైలారం ప్రాంతాల్లో టీడీఎస్ గరిష్టంగా 3160 ఎంజీ/లీ. నమోదు కాగా... వర్షాకాలం అనంతరం పరీక్షల్లో 1890 ఎంజీ/లీ నమోదైంది. డిసెంబరులో పూర్తి నివేదిక ప్రస్తుతం ఎన్జీఆర్ఐ సమర్పించినది మధ్యంతర నివేదిక మాత్రమే. డిసెంబర్ వరకు అధ్యయనాన్ని కొనసాగించి తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. నగర పరిధిలో భూగర్భ జలాల స్థితిగతులు, జలప్రవాహం దిశ, కలుషితమవుతున్న తీరు, నివారణ తదితర చర్యలను తుది నివేదికలో ఆ సంస్థ పొందుపరచనుంది. అనర్థాలివే.. ►తాగడానికి, స్నానానికి ఈ నీరు పనికి రాదు. మొక్కలు, జంతువులు ఈ నీటితో చనిపోతాయి. ►ఈ నీరు తాగిన వారికి చర్మ, జీర్ణకోశ వ్యాధులతో పాటు నిమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, జలుబు వస్తాయి. ►ఈ నీటిని నిల్వ చేస్తే పాత్రలో తెల్లటి పెచ్చులు ఏర్పడతాయి. ►జీవకణాలు చనిపోతాయి. ► సల్ఫేట్లు, ఫ్లోరైడ్లు, కాల్షియం, మెగ్నీషియం వంటి మిశ్రమ పదార్థాలతో మానవ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. -
నిద్రా సమయం
షవర్ ఆన్ చేశాక నీళ్లు తల మీద పడుతుంటే దొంగ వెధవ జడ్డి వెధవ ముష్టి వెధవ అని తిట్టుకుంది. పైకి తిట్టుకుందా లోపల తిట్టుకుందా తెలియలేదు. కాని ఆ కోపం ఈ రాత్రికి దిగదు. మొన్నొక రోజు ఒక సబార్డినేట్‌ని పిలిచి చెడామడా తిడితే తిట్టించుకున్నామె బాగానే ఉంది. పక్కన ఉన్న నలుగురూ చేరి పైకి కంప్లయింట్ చెయ్ ఈవిణ్ణి ఇక్కణ్ణుంచి జిల్లాలకు సాగనంపుదాం అని ఎక్కించారు. జిల్లాలకు? అదీ సిటీని వదిలి. ఆ తలనొప్పి నుంచి బయట పడాల్సి వచ్చింది. టైమ్‌కి వచ్చారా లేదా అని మొన్న సర్ప్రైజ్ విజిట్ చేసింది. అదీ కరెక్ట్ కాదట. ఈమెకెందుకు.. పనయ్యిందా లేదా అని చెప్పమనండీ అని నలుగురైదుగురు క్యాంటీన్లో రంకెలు వేశారని తెలిసింది. ఇవాళ ఒకణ్ణి పిలిచి ఫైల్ పుటప్ చేయవయ్యా మగడా అంది. వాడి ఇంగ్లిష్ నిండా తప్పులే. రెడ్డింక్తో రౌండప్ చేసి పంపితే- అవి టైపింగ్ మిస్టేక్స్... ఫైల్ పుటప్ చేయడంలో ఇలాంటి తప్పులు మామూలే... అవి సరి చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని వాడే రివర్స్‌లో కామెంట్ రాసి పంపాడు. ఏమనడానికి ఏముంది? ఇంటికొచ్చి ఇదిగో ఈ పని. లేడీ ఆఫీసరంటే అన్నింటికీ అటెన్షన్. డ్రస్సు సరిగ్గా ఉన్నా అటెన్షన్. లేకపోయినా అటెన్షన్. గట్టిగా మాట్లాడితే అటెన్షన్. మాట్లాడకపోయినా అటెన్షన్. ఆఖరుకు ఆకలికి రెండు మూడు అరలున్న లంచ్‌బాక్స్ తెచ్చుకున్నా అటెన్షన్. మేడం... మేడం.. అందరూ గౌరవం నటించే మగాళ్లే మళ్లీ. కాని ఎంత కిందకు లాగుదామా అని చూట్టంలో ఒక్కడూ తక్కువ కాదు. మమ్మల్నీ వేధిస్తారండీ అంటాడు పక్క సెక్షన్ ఆఫీసరు. కాని అతడు సాయంత్రానికి ఫ్రెండ్స్‌తో చేరి బార్‌కు వెళ్లి హాయిగా బూతులు తిట్టుకొని రెండు గుటకలు పుచ్చుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరక్కుండా పది లోపలే ఇల్లు చేరి భోం చేసి నిద్ర పోతాడట. తనేం చేయాలి? బూతులు రావు. బార్‌కు వెళ్లలేదు. రాత్రి పదికి వెళ్లి భోం చేసి పడుకుందామంటే ఆ భోజనం అనే మాటను మళ్లీ తయారు చేయాల్సింది తనే. ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. లోలోపల ఏదో కోపంగా ఉంటుంది. బలవంతంగా నిశ్శబ్దంగా ఉండబుద్ధేస్తోంది. అలాగే ఉంటోంది. మొన్న పెద్దది కనిపెట్టి అంది- నువ్వు చాలా మారిపోయావ్ మమ్మీ అని. ఎనిమిది చదువుతోంది. ఎంత గమనింపో బంగారానికి. ఇంతకు మునుపైతే ఆఫీసు నుంచి రావడమే దానితో చాలా కబుర్లు చెప్పేది. కాలనీ వీధిలోకి తీసుకెళ్లి దీపాల వెలుతురులో షటిల్ ఆడేది. చిన్నాడు సైకిల్ తొక్కుతుంటే సీట్ పట్టుకుని వెనుక పరుగు తీసేది. ఇరుగు పొరుగు వాళ్లతో బోలెడు బోలెడు కబుర్లు చెప్పేది. ఇప్పుడు అవన్నీ మెల్లమెల్లగా గడ్డకట్టి పోయినట్టుగా అనిపిస్తున్నాయి. నిర్లిప్తమైన ముఖం. కోపంతో ముడతలు పడ్డ నుదురు. స్నానం ముగించి నైటీ జార్చుకుని బయటకు వచ్చింది. ఇక వంట. పిల్లలు టీవీ ముందు పుస్తకాలు వేసుకుని కూచుని ఉన్నారు. మామూలుగా అయితే వాళ్లతో కూచుని కబుర్లు చెప్పి... భర్త ఇంటికొస్తే తను పడుతున్న ఇబ్బందులేవో చెప్పుకుని... ఏం చెప్పుకున్నా ఏం ప్రయోజనం? గవర్నమెంట్ వ్యవహారాలు అర్థం కావు. పాడిందే పాడరా అన్నట్టుగా ఉద్యోగం మానేయరాదా అంటాడు. లేదంటే అవన్నీ పట్టించుకోకు అంటాడు. రెండూ సాధ్యం కాదు. చాలాసార్లు ఆ మాటే చెప్పింది. ఏం అని రెట్టిస్తాడు. వివరంగా చెప్పాలా? ఆడవాళ్లు పుట్టిల్లు అనే మాటను తీసేశారు. మంచైనా చెడ్డైనా తమ బతుకేదో తాము బతకాలని నిశ్చయించుకున్నారు. నీకు అనువుగా ఉన్నంత కాలమే నువ్వు భద్రత ఇస్తావు. తేడా వస్తే బ్యాగు సర్ది చేతికిస్తావు. అప్పుడు నా ఉద్యోగమే నాకు దిక్కు. కనుక దానిని నేను వదులుకోను. పైగా ఇది నా చదువుకీ తెలివితేటలకీ సామర్థ్యానికీ వచ్చిన ఉద్యోగం. వదిలేసి నన్ను నేను చిన్నబుచ్చుకోలేను. ఇక పట్టించుకోకపోవడం గురించి. ఒకసారి రెండుసార్లైతే పర్లేదు. అనునిత్యం ముల్లులాగా పదే పదే గుచ్చుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉండమంటావ్? అంతటితో వాదన ముగుస్తుంది. ఇది కూడా ఈ మధ్య ఆపేసింది. ఒక్క ఊరడింపు మాట కూడా లేకపోతే ఏం చేసేది? నా గోల నేను పడుతున్నాను... నన్నెవరు బుజ్జగిస్తున్నారు... నాకెవరు జోల పాడుతున్నారు... ఎంత సేపూ నీవైపు నుంచే చూస్తున్నావ్ అంటాడు. ఈ మధ్య గమనిస్తోంది. ప్రతి మనిషీ సాటి మనిషంటే మంటెత్తి పోతున్నాడు. ఇక టీమ్ లీడర్ అంటే ఊరుకుంటారా? ఏమేం పడుతున్నాడో? అవన్నీ పడి అలో లక్ష్మణా అని ఇల్లు చేరితే కాసిని పూలు పెట్టుకుని ఎదురు రాకుండా ముఖం గంటు పెట్టుకుని ఉంటే... అప్పటికీ ట్రై చేస్తోంది. కాని కుదరడం లేదే. బెల్ మోగింది. పిల్లలు నాన్నా.. నాన్నా.. అని పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ తీశారు. వాళ్లతో ఒకటి రెండు మాటలు... తనకు కళ్లతో పలకరింపు... ముఖం చూడగానే అర్థమైపోయుంటుంది... మాట్లాడకుండా షవర్‌కి వెళ్లిపోయాడు. లోపల ఎవర్ని తిట్టుకుంటున్నాడో. ఆ పూట మునగాకు పప్పు చేసింది. నలభైకి చేరుకున్నాక ఆడవాళ్లకు ఆకుకూరలు తప్పనిసరి అని ఎక్కడో చదివింది. కాదు భర్త చేష్టలు తప్పనిసరి అని స్నేహితురాలు జోక్ చేసింది. అయితే అలా జోక్ చేసే రోజులన్నీ ఎప్పుడో పోయాయి. పిల్లలతో తప్ప ఎదురూ బొదురూ కూచుని నవ్వుకుని ఎన్నాళ్లయ్యిందని. ఒకోరోజు ఈవైపు మూడ్ బాగోదు. లేకుంటే ఆ వైపు మూడ్ బాగోదు. భోజనాల దగ్గర కొంచెం పితలాటకం అయ్యింది. పిల్లలు మునగాకు తినం అని మారాం చేస్తే- నేను వండగలిగింది ఇంతే తింటే తినండి లేకుంటే పోండి అని పెద్దగా గద్దించింది. ఉలిక్కిపడ్డాడు. పిల్లలు కూడా. చివరికి మామిడిపండు కోసి వారికి పెరుగన్నం తినిపించింది. కాసేపు టీవీ టైం. నలుగురూ కూచున్నాక కాస్త మంచి మూడ్ సెట్ చేసే ప్రోగ్రామ్ చూద్దామంటే అన్నీ చావు వార్తలు... దుర్మార్గపు సంఘటనలు. చూసి చూసి లేచింది. పిల్లల్ని పడుకోబెడతాను అని వాళ్లను వాళ్ల గదికి బయల్దేరదీసి అరగంట తర్వాత బయటకు వచ్చింది. నేను నిద్ర పోతున్నాను- ప్రకటించింది. తల ఊపాడు. తొందరగా నిద్ర పోడు. పదకొండు దాకా టీవీ చూస్తాడు. తనకు పొద్దున్నే లేవక తప్పదు. పైగా మరుసటిరోజు ఆఫీస్ పనులను ఒకసారి మననం చేసుకోవాలి. వ్యూహాలతో సిద్ధం కావాలి. లోపలికి వెళ్లి పడుకుంది. సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ అది. అరవై డెబ్బై వేలు పెట్టి కొన్నారు. అందులో ఏం తక్కువ లేదు. ఇద్దరూ కలిసి ఇంటి నిండా ఖరీదైనవన్నీ నింపారు. బాంటియాలో ఇది డిజైనర్ బెడ్ అంటే సింగిల్ పేమెంట్‌తో ఇంటికి తెచ్చుకున్నారు. మెత్తగా ఉంటుంది. పడుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. స్లిప్పర్స్ వదిలి ఒక పక్కకు వాలి దిండుకు చెంపను ఆనించి నిద్ర పోయింది. ఆ తర్వాత ఎప్పుడొచ్చి పడుకున్నాడో పడుకున్నాడు. ఇలా వాళ్ల కాపురం గడిచిపోతూ ఉంది. బంధువుల్లో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ జరిగినా, కాలనీలో కారు వేసుకుని వెళుతూ వాళ్లు కనిపించినా అందరూ వాళ్లకేమీ అని అంటూ ఉంటారు. అవును. వాళ్లకేమి? మహమ్మద్ ఖదీర్‌బాబు -
లీకేజీల రామప్ప
- మోసం తెచ్చిన రింగ్‌బండ్ - తూము మరమ్మతుల్లో నిర్లక్ష్యం - పనులు పర్యవేక్షించని అధికారులు - ఆగని నీటి ప్రవాహం - లబోదిబోమంటున్న రైతులు తూములోకి నీరు రాకుండా అడ్డుగా మట్టి పోస్తున్న రైతులు,(ఇన్సెట్లో)తూములోకి ఉధృతంగా వస్తున్న నీరు వరంగల్ : జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒక్కటైన రామప్ప చెరువు నీరు లీకేజీల కారణంగా వృథాగా పోతోంది. వెంకటాపు రం మండలంలోని రామప్ప సరస్సు తూము దశాబ్దాల కిత్రం నిర్మించినందున తరచూ లీకవుతోంది. మూడు స్థాయిల్లో నీటిని విడుదల చేసే విధంగా షెటర్లు ఉన్న ఈ తూము ను నిజాం కాలంలో పునర్నిర్మించారని స్థాని కులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాతబడిన తూము షటర్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు 2012లో సుమారు రూ.20లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. ఇందులో రూ.10 లక్షలు ఎంపీ బలరాంనాయక్ తన సీడీఎఫ్ నుంచి సమకూర్చగా, మరో రూ.10 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. అసలేం జరిగింది... రామప్ప ప్రధాన తూము నుంచి ఓగరు చానల్ ద్వారా రామాంజపూర్ పరిధిలోని చివరి ఆయకట్టు పొలాలకు సాగు నీరందించేందుకు డీఈఈ ఆనందం ఆదేశాలతో ఐబీ శాఖ ఉద్యోగి శుక్రవారం సాయంత్రం తూము షటర్లను లేపాడు, సరస్సు నీరు అధికమోతాదులో పోతుండడంతో షటర్లు దింపేందుకు ప్రయత్నించగా.. దిగలేదు. షటర్ల కిందకు రాళ్లు వచ్చి చేరడంతో ఈపరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. తూము ద్వారా నీరు వృథాగా పోతోందని తెలిసిన ఐబీ అధికారులు ఆదివారం చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో తొలగించిన రింగ్‌బండ్‌ను మళ్లీ పోసేందుకు ప్రయత్నించినా.. నీటి ఉధృతి కారణంగా పనులు పూర్తి చేయలేకపోయారు. ఉన్నతాధికారులు నిర్లక్ష్యం... వేల ఎకరాలకు సాగు నీరు, వందలాది గ్రామాలకు తాగు నీరందించే రామప్ప సరస్సుపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సరస్సు నిర్వహణకు రెగ్యులర్ ఏఈని నియమించలేదు. వెంకటాపూర్ మండల ఏఈగా నియమితులైన మహిళా ఇంజనీరు ప్రస్తుతం సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది. ఈమె స్థానంలో ఉద్యోగ విరమణ పొందిన ఇంజనీరు విధులు నిర్వర్తిస్తున్నారు. పనులు జరుగుతున్న సమయంలో పర్యవేక్షణ లోపం కారణంగానే కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పూర్తి చేసినట్లు సమాచారం. అందువల్లే రింగ్‌బండ్ తొలగించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఏఈ, డీఈఈలు రాలేదని స్థానికులు తెలిపారు. ఆదివారం ఈఈతో పాటు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు లీకేజీలు అరికట్టేందుకు చెరువు వద్దకు వచ్చినట్లు తెలిసింది. నీరు ఉధృతి కారణంగా చేతికి వచ్చిన పంట మొత్తం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. నీటి లీకేజీలను వెంటనే అరికట్టి, ఇప్పటికైన పూర్తి స్థాయి ఏఈని నియమించాలని రైతులు కోరుతున్నారు. కాగా, పొక్లెయినర్ తీసుకువచ్చి పనులు పూర్తి చేసి నీటి లీకేజీలను అరికడతామని ములుగు ఈఈ గోపాలరావు తెలిపారు. -
గాలి+నీరు = ఈ-డీజిల్!
అవసరమనండి... పెరిగిపోతున్న డిమాండ్ కానివ్వండి. ముంచుకొస్తున్న వాతావరణ మార్పుల ముప్పు అనండి.. కారణమేదైనా పర్యావరణానికి హాని కలిగించని ఇంధనాల తయారీకి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలైతే ముమ్మరమవుతున్నాయి! ప్రఖ్యాత కార్ల కంపెనీ ఆడీ ఈ దిశగా కీలకమైన ముందడుగు వేసింది! కేవలం గాల్లోని కార్బన్ డైయాక్సైడ్, నీళ్లు మాత్రమే వాడుతూ కృత్రిమ డీజిల్‌ను తయారు చేయడంలో విజయం సాధించింది... ఆర్డర్లు రావాలేగానీ... ఈ-డీజిల్‌ను తయారు చేసి అమ్మేందుకు మేం రెడీ అంటోంది! పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతో భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భూమ్మీద బతకటమే కష్టంగా మారిపోతుందని తరచూ వింటూంటాం. అందుకు తగ్గట్టుగానే అకాల వర్షాలు, వరదలు, కరవు కాటకాల వార్తలూ వినిపిస్తూన్నాయి. భూతాపోన్నతికి కారణమవుతున్న గ్రీన్హౌస్ వాయువుల్లో 13 శాతం రవాణా రంగం నుంచి వస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలోనే పర్యావరణ హితమైన ఇంధనాల తయారీకి ప్రాముఖ్యత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. మొక్కజొన్నలు మొదలుకొని రకరకాల పంటల ద్వారా ఎథనాల్ తయారీకి పూనుకున్నా... వ్యర్థ పదార్థాల నుంచి గ్యాస్ తయారు చేసి వాడుకున్నా ఇందుకోసమే. అయితే ఇప్పటివరకూ సాధించినవన్నీ ఒక ఎత్తు. ఆడి పరిచయం చేస్తున్న ఈ డీజిల్ కాన్సెప్ట్ మరో ఎత్తు. కృత్రిమంగా డీజిల్లాంటి ఇంధనాన్ని తయారు చేయడమొక్కటే దీని ప్రత్యేకత కాదు.. ఈ క్రమంలో కార్బన్‌డైయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువును మళ్లీ డీజిల్‌గా మార్చడం... వాహనాల్లో వాడినప్పుడు కూడా అతితక్కువ మోతాదులో వ్యర్థవాయువులను విడుదల చేయడం చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు! తయారీ ఇలా... ఈ-డీజిల్ తయారీ కోసం ఆడి కంపెనీ జర్మనీలోని డ్రెస్డెన్లో ఓ పెలైట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. పవన, సౌరవిద్యుత్తులతో నడిచే ఈ ప్లాంట్‌లో ముందుగా రివర్సిబుల్ ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా నీటిని హైడ్రోజెన్, ఆక్సిజన్లుగా విడగొడతారు. ఆ తరువాత దీనికి కార్బన్‌డైయాక్సైడ్ వాయువును కలిపి కార్బన్ మోనాక్సైడ్గా మారుస్తారు. మరో రెండు రసాయన ప్రక్రియల తరువాత ఈ కార్బన్ మోనాక్సైడ్ కాస్తా... ముడిచమురును పోలిన ద్రవంగా మారుతుంది. రిఫైనరీల్లో మాదిరిగా శుద్ధి చేయడం ద్వారా దీన్నుంచి డీజిల్‌ను రాబడతారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కోసం బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన కార్బన్‌డైయాక్సైడ్‌ను ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో అక్కడికక్కడే వాతావరణం నుంచి ఈ వాయువును సేకరించి వాడుకోవచ్చునని కంపెనీ అంటోంది. డీజిల్ కంటే మెరుగు... ఆడి కంపెనీ తయారు చేసిన కృత్రిమ డీజిల్ సంప్రదాయ డీజిల్ కంటే మెరుగైన లక్షణాలు కలిగి ఉంటుంది. పైగా గంధకం అసలు లేని ఈ కొత్త డీజిల్ ద్వారా వెలువడే విష వాయువులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంజిన్ ద్వారా వెలువడే శబ్దం కూడా తగ్గుతుందని, ఆడితో కలిసి ఈ ఇంధనాన్ని అభివృద్ధి చేసిన సన్ఫైర్ కంపెనీ సీటీవో క్రిస్టియన్ వాన్ అంటున్నారు. డ్రెస్డెన్లోని పెలైట్ ప్లాంట్‌లో ప్రస్తుతం రోజుకు 160 లీటర్ల ఈ-డీజిల్‌ను తయారు చేస్తున్నారు. వాణిజ్యస్థాయిలో ఉత్పత్తికి పెద్దసైజు ప్లాంట్ ఏర్పాటు అవుతోంది. -
‘ఆందోళన వద్దు’
సాక్షి, ముంబై: నీటి నిల్వలపై ముంబైకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఎంసీ తెలిపింది. నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో జూలై 31 వరకు సరిపడే నిల్వలున్నాయని స్పష్టం చేసింది. వర్షాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయనే దాని గురించి వాతావరణశాఖ ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదని, సమాచారం అందగానే ప్రణాళిక ప్రకారం నీటి సరఫరా చేస్తామని బీఎంసీ నీటి సరాఫరా శాఖ చీఫ్ ఇంజినీరు రమేశ్ బాంబ్లే అన్నారు. ప్రస్తుతం నగరానికి నీటి సరఫరాచేసే బాత్సా, మోడక్‌సాగర్, మధ్య వైతర్ణ, విహార్, తులసీ, తాన్సా జలాశయాల్లో 4,06,973 మిలియన్ లీటర్ల నిల్వ ఉందని, దీన్ని పరిగణలోకి తీసుకుంటే జులై 31 వరకు నీటికి ఢోకా లేదని బాంబ్లే అన్నారు. ముంబైకర్లకు ప్రతి రోజు 3,750 మిలియన్ లీటర్ల నీరు అవసరముంటుందని ఆయన అన్నారు. కాగా, కొన్నేళ్లుగా సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో నీటి నిల్వలు కాపాడుకోడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ప్రతి ఏటా నెల రోజుల ముందే వాతావరణ శాఖ నుంచి వర్షానికి సంబంధించిన వివరాలు వస్తాయని, దీన్ని బట్టి వర్షాలు ఆలస్యమైతే ఎంత శాతం నీటి కోత అమలు చేయాలో ముందుగానే ప్రణాళిక రూపొందిస్తారని ఆయన చె ప్పారు.