- మోసం తెచ్చిన రింగ్‌బండ్
- తూము మరమ్మతుల్లో నిర్లక్ష్యం
- పనులు పర్యవేక్షించని అధికారులు
- ఆగని నీటి ప్రవాహం
- లబోదిబోమంటున్న రైతులు
తూములోకి నీరు రాకుండా అడ్డుగా మట్టి పోస్తున్న రైతులు,(ఇన్‌సెట్‌లో)తూములోకి ఉధృతంగా వస్తున్న నీరు
వరంగల్ : జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒక్కటైన రామప్ప చెరువు నీరు లీకేజీల కారణంగా వృథాగా పోతోంది. వెంకటాపు రం మండలంలోని రామప్ప సరస్సు తూము దశాబ్దాల కిత్రం నిర్మించినందున తరచూ లీకవుతోంది. మూడు స్థాయిల్లో నీటిని విడుదల చేసే విధంగా షెటర్లు ఉన్న ఈ తూము ను నిజాం కాలంలో పునర్నిర్మించారని స్థాని కులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాతబడిన తూము షటర్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు 2012లో సుమారు రూ.20లక్షల వ్యయంతో మరమ్మతులు చేపట్టారు. ఇందులో రూ.10 లక్షలు ఎంపీ బలరాంనాయక్ తన సీడీఎఫ్ నుంచి సమకూర్చగా, మరో రూ.10 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.
అసలేం జరిగింది...
రామప్ప ప్రధాన తూము నుంచి ఓగరు చానల్ ద్వారా రామాంజపూర్ పరిధిలోని చివరి ఆయకట్టు పొలాలకు సాగు నీరందించేందుకు డీఈఈ ఆనందం ఆదేశాలతో ఐబీ శాఖ ఉద్యోగి శుక్రవారం సాయంత్రం తూము షటర్లను లేపాడు, సరస్సు నీరు అధికమోతాదులో పోతుండడంతో షటర్లు దింపేందుకు ప్రయత్నించగా.. దిగలేదు. షటర్ల కిందకు రాళ్లు వచ్చి చేరడంతో ఈపరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. తూము ద్వారా నీరు వృథాగా పోతోందని తెలిసిన ఐబీ అధికారులు ఆదివారం చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో తొలగించిన రింగ్‌బండ్‌ను మళ్లీ పోసేందుకు ప్రయత్నించినా.. నీటి ఉధృతి కారణంగా పనులు పూర్తి చేయలేకపోయారు.
ఉన్నతాధికారులు నిర్లక్ష్యం...
వేల ఎకరాలకు సాగు నీరు, వందలాది గ్రామాలకు తాగు నీరందించే రామప్ప సరస్సుపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సరస్సు నిర్వహణకు రెగ్యులర్ ఏఈని నియమించలేదు. వెంకటాపూర్ మండల ఏఈగా నియమితులైన మహిళా ఇంజనీరు ప్రస్తుతం సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది. ఈమె స్థానంలో ఉద్యోగ విరమణ పొందిన ఇంజనీరు విధులు నిర్వర్తిస్తున్నారు. పనులు జరుగుతున్న సమయంలో పర్యవేక్షణ లోపం కారణంగానే కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పూర్తి చేసినట్లు సమాచారం.
అందువల్లే రింగ్‌బండ్ తొలగించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఏఈ, డీఈఈలు రాలేదని స్థానికులు తెలిపారు. ఆదివారం ఈఈతో పాటు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు లీకేజీలు అరికట్టేందుకు చెరువు వద్దకు వచ్చినట్లు తెలిసింది. నీరు ఉధృతి కారణంగా చేతికి వచ్చిన పంట మొత్తం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. నీటి లీకేజీలను వెంటనే అరికట్టి, ఇప్పటికైన పూర్తి స్థాయి ఏఈని నియమించాలని రైతులు కోరుతున్నారు. కాగా, పొక్లెయినర్ తీసుకువచ్చి పనులు పూర్తి చేసి నీటి లీకేజీలను అరికడతామని ములుగు ఈఈ గోపాలరావు తెలిపారు.