మా పొలాలతో వ్యాపారాలా?
- అధికారులను నిలదీసిన రాజధాని రైతులు
- ప్లాట్ల పంపిణీ తేదీ ప్రకటించకుండానే బిచాణా సర్దేసిన అధికారులు
తుళ్లూరు: మా పొలాలు అక్రమంగా తీసుకుని వ్యాపారాలు చేసుకుంటారా అని రాజధాని రైతులు అధికారులను నిలదీశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద శుక్రవారం అధికారులు ఏర్పాటు చేసిన ప్లాట్ల పంపిణీ అవగాహన సదస్సు రసాభాసగా మారింది. తుళ్లూరు మండలంలోని కొండమరాజుపాలెం గ్రామానికి గాను శనివారం ప్లాట్ల పంపిణీకి గాను సీఆర్‌డీఏ అధికారులు రంగం సిద్ధం చేశారు. 691 రెసిడెన్షియల్, 545 కమర్షియల్ ప్లాట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దీనికి రైతులను ఆహ్వానించారు. సీఆర్‌డీఏ ప్లానింగ్ అధికారులు చూపిన మ్యాప్‌ల ప్రకారం జరీబు రైతులకు కూడా మెట్టప్రాంతంలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు కేటాయించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తప్పులు ప్రశ్నిస్తే.. అనుచిత వ్యాఖ్యలా?
ముందుగా రైతులకు అవగాహన కల్పించాలని, వారి చేసే అభ్యర్థనలను, సవరణలను తీసుకుని న్యాయం చేయాలని రైతులు విన్నవించారు. అలాగాక రైతులకు రోడ్డు పోటు, వీధి పోటు ఉన్న ప్లాట్లను అంటగట్టేందుకు చూస్తున్నారని వారు మండిపడ్డారు. తప్పులను కనిపెట్టి ప్రశ్నించే రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత హామీల ప్రకారం ప్లాట్ల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. లేకుంటే ప్లాట్లు తీసుకోబోమని అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో సీఆర్‌డీఏ డిప్యూటీ కమిషనర్ చెన్నకేశవులు.. సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌తో ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఫోన్ కలవకపోవడంతో రైతులు చెప్పిన అభిప్రాయాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళతామని, వారిచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని ఆయన వివరించారు.