అనుకున్నదొక్కటి... అయినదొక్కటి..
సాక్షి, విజయవాడ : ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తామంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రచారం చేస్తుండగా, మరో వెపు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఇక్కడకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది.
రానున్న మూడునాలుగేళ్లలో అమరావతి జనాభాను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పాఠశాలలను ఏర్పాటు చేయించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) అధికారులు నిర్ణయించారు. అయితే దీనిపై జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు.
నాలుగు పెద్ద విద్యాసంస్థలు ఏర్పాటుకు సిద్ధం..
అమరావతిలో 27 టౌన్‌షిప్‌లు ఉన్నప్పటికీ తొలుత నాలుగు పెద్దస్కూల్స్ మాత్రమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలోని నవులూ రు, మందడం, నేలపాడు, తుళ్లూరు గ్రామాల్లో ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్, ఇంటర్నేషనల్ డే స్కూల్, నేషనల్ బోర్డింగ్ స్కూల్, నేషనల్ డే స్కూల్ ఏర్పాటుకు గత ఏడాది నవంబర్‌లో గ్లోబల్ టెండర్లు పిలిచారు. ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్‌కు 8 ఎకరాలు, డే స్కూల్‌కు 4 ఎకరాలు, నేషనల్ బోర్డింగ్ స్కూల్‌కు 4 ఎకరాలు, డే స్కూల్‌కు 2 ఎకరాల భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. చదరపు గజం కనీసం రూ.1250 చొప్పున 33 ఏళ్ల పాటు స్థలం లీజుకు ఇస్తామని, ప్రభుత్వం నిర్ణయించిన లీజు ధరకు ఏ సంస్థ ఎక్కువ చెల్లిస్తే వారికి స్థలం కేటాయిస్తామని సీఆర్‌డీఏ ప్రకటించింది. విద్యా సంస్థలను మూడు నుంచి ఐదు ఏళ్లలో నిర్మించాలని నిబంధన పెట్టింది.
కేవలం 19 దరఖాస్తులు మాత్రమే...
జాతీయ, అంతర్జాతీయ స్థాయి నాలుగు పెద్ద విద్యా సంస్థలకు కేవలం 19 టెండర్లు మాత్రమే వచ్చాయి. ఇందులోనూ సీఆర్‌డీఏ అధికారులు కొన్ని విద్యాసంస్థలతో సంప్రదించి టెండర్లు వేయించారని సమాచారం. వచ్చిన దరఖాస్తుల్లో తాము పెట్టిన నిబంధనలకు అనుగుణంగా ఎన్ని ఉన్నాయో అధికారులు పరిశీలిస్తున్నారు. వాస్తవంగా కార్పొరేట్ స్కూల్స్‌కు టెండర్లు పిలవడంతో ఒక్కొక్క స్కూలు పదుల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని ఆశించారు. అయితే అందుకు విరుద్ధంగా రెండు మూడు కంటే ఎక్కువ రాకపోవడంతో అధికారులు పెదవి విరుస్తున్నారు. వచ్చిన వాటినే పరిశీలించి ఈ నెలాఖరులోగా ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
సొంతంగా స్థలం కొనేందుకు ఆసక్తి
కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వం వద్ద స్థలాన్ని 33 ఏళ్లకు లీజుకు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. దీనికి బదులు ప్రభుత్వమే తక్కువ ధరకు స్థలాన్ని విక్రయిస్తే... కొనుగోలు చేసి భవనాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. లీజుకు తీసుకుని మూడు నాలుగేళ్లలో తాము పాఠశాల భవనాలను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించినా తగినంత మంది విద్యార్థులు రాకపోతే నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకునేకంటే భవిష్యత్తులో ఇక్కడకు వచ్చే జనాభాను బట్టి రైతులకు కేటాయించే భూముల్ని వారి వద్ద నుంచే కొనుగోలు చేసి శాశ్వత నిర్మాణాలు చేపడితే ఎన్ని ఏళ్లయినా తమకు ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు.
బైపాస్ రైల్వే లైనుతో రైతులకు నష్టం
విజయవాడరూరల్ : రైల్వేశాఖ నిర్మించతలపెట్టిన విజయవాడ–సికింద్రాబాద్, విజయవాడ–విశాఖపట్నం రైల్వే బైపాస్ నిర్మాణం ప్రతిపాదనలు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని రాయనపాడు, గొల్లపూడి గ్రామాల రైతులు విజయవాడ సబ్‌కలెక్టర్ (ఇన్‌చార్జి) బాలాజీ దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం ఆ గ్రామాల రైతులు విజయవాడలోని సబ్‌కలెక్టర్‌ను కలిసి మాట్లాడారు. కొండపల్లి స్టేషన్ నుంచి రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి గ్రామాలను కలుపుతూ మరో రైల్వే లైను నిర్మించడం వలన రైతులకు చెందిన వ్యవసాయ భూములను కోల్పోవలసి వస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా రాయనపాడు గ్రామానికి రెండు వైపులా రైల్వే లైన్లు ఉండడం వలన భవిష్యత్‌లో బుడమేరు వరద సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉందని, అంతేకాక ప్రస్తుతం ఆ గ్రామంలో రెండులైన్లు ఉండగా మరో లైను నిర్మాణం జరుగుతుందని, అదీకాక బైపాస్ నిర్మాణాన్ని ఉత్తరం వైపు చేపట్టాలని రైల్వేశాఖ ప్రతిపాదించిందని రైతులు శీలంనేని సాంబశివరావు, కాటంనేని నాగేశ్వరావు, నూతులపాటి బాలకోటేశ్వరావు సబ్‌కలెక్టర్‌కు వివరించారు.