సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో తీవ్ర గందరగోళం నెలకొంది. భూ సమీకరణ సమయంలో ప్రకటించిన విధంగా అభివృద్ధి చేసిన ప్లాట్లనే తమకు ఇవ్వాలని రైతులు డిమాండు చేస్తుండగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పొలాలను బిట్లుగా విభజించి యథాతథంగా రైతులకు అంటగట్టాలని చూస్తోంది. ప్రభుత్వం (సీఆర్‌డీఏ) వాటా కింద ఉంచుకునే ప్రాంతంలో వేగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ తమకు ప్లాట్లు కేటాయించే ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముక్కారు పంటలు పండే సారవంతమైన భూములను తాము త్యాగం చేసి రాజధాని కోసం ఇస్తే సర్కారు ఇలా ద్రోహం చేయడం దారుణమని రైతులు విమర్శిస్తున్నారు. భూసమీకరణ ఒప్పందాలు సమర్పించిన మూడు నెలల్లో ప్లాట్లు కేటాయిస్తామని చెప్పి మూడేళ్లయినా లేఅవుట్ల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉండటం గమనార్హం.
రైతుల విముఖత
రాజధానికి భూ సమీకరణ కింద 33 వేల ఎకరాలు పైగా ఇచ్చిన రైతులకు ఎల్‌పీఎస్ ఒప్పంద నిబంధనల ప్రకారం నివాస, వాణిజ్య ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాలి. అయితే కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్లాట్లను రైతులకు కట్టబెట్టేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నిస్తోంది. దీంతో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రైతులు అంగీకరించడంలేదు. రాజధానికి ఎల్‌పీఎస్ కింద భూములు ఇచ్చిన వారికి సీఆర్‌డీఏ 59,014 ప్లాట్లు కేటాయించగా ఇప్పటి వరకూ 6,900 మంది మాత్రమే తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులోనూ అధికార పార్టీ నాయకులుగా పలుకుబడి ఉపయోగించి రోడ్ల పక్కన, పెద్ద ప్లాట్లను పొందిన వారే ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో ఎక్కువ మంది ఉన్నారు. మిగిలిన 52,114 ప్లాట్లు రైతులు తీసుకునేందుకు ఇష్టపడడంలేదు. లేఅవుట్లు అభివృద్ధి చేయకుండా కా>గితాలపై ఇచ్చే ప్లాట్లు తమకెందుకని రైతులు మండిపడుతున్నారు.
ఏకపక్ష రిజిస్ట్రేషన్ల కోసం...
రైతులు ఎదురుతిరగడంతో ఏకపక్షంగా వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి చేతులు దులుపుకోవాలని సీఆర్‌డీఏ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ‘రైతుల హాజరు, సంతకాలతో సంబంధం లేకుండా వారి పేర్లతో సీఆర్‌డీఏ అధికారులు వచ్చి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తార’ంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు సీఆర్‌డీ కమిషనర్ శ్రీధర్ లేఖ రాశారు. కొనుగోలుదారుల (స్వీకర్తల) ఆమోదం లేకుండా వారి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం వీలుకాదని ఆశాఖ అధికారులు తేల్చి చెప్పారు. రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించి అయినా ఆ ప్లాట్లను రైతులకు కట్టబెట్టాలని సీఆర్‌డీఏ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దీంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్, సీఆర్‌డీఏ మధ్య వివాదం నెలకొంది.
మూడేళ్లయినా అతీగతీ లేదు
రాజధాని నిర్మాణానికి భూమి ఇస్తే రైతులకు అన్ని విధాలా లాభం కలిగేలా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని మూడేళ్ల క్రితం హామీ ఇచ్చారు. ఇంత వరకు ఒక్క రైతుకు కూడా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. తొలుత రైతులకు తుళ్లూరులో ముఖ్యమంత్రి చేతులు మీదుగా ప్లాట్ల కాగితాలు ఇచ్చినప్పుడు నెల రోజుల్లో రైతులందరికి అభివద్ధి చేసి ప్లాట్లు అందిస్తామన్నారు. ఏడాది అయినా ఇంత వరకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కాగితపు స్థలాలు మాకు అవసరం లేదనే రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంలేదు.
– కొమ్మినేని కష్ణారావు, దొండపాడు రైతు
Comments
Please login to add a commentAdd a comment