సాక్షి, రామచంద్రాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలో బుధవారం ప్రారంభమైన పాదయాత్ర కుయ్యేరు, బాలాంత్రం, ఎర్రపోతవరం, వేగాయమ్మ పేట మీదుగా ద్రాక్షారామం వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి గ్రామస్తులు కుయ్యేరు వద్ద వైఎస్ జగన్‌ను కలిశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో బెదిరింపులకు పాల్పడి, ఇప్పటికే తమ దగ్గర నుంచి 54 వేల ఎకరాలు లాక్కున్నారని రైతులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. భూమి ఇవ్వకుంటే లాండ్ అక్విజేషన్ కింద తీసుకుని స్వచ్చందంగా ఇచ్చినట్టు ప్రకటిస్తామని బెదిరిస్తున్నారని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు.
జగన్‌పై నమ్మకం ఉంది
తమకు రుణాలు, సబ్సిడీలు, నీరు రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారని సీఆర్డీఏ రైతులు తెలిపారు. సేకరించిన 54 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి కావాల్సింది 900 ఎకరాలు మాత్రమేనని వివరించారు. ఇప్పటికీ ఒక్క నిర్మాణం చేపట్టకుండా భూముల కోసం తమని వేధించటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అందుకే తమ సమస్యలు చెప్పుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసినట్టు రైతులు తెలిపారు. రాజధాని రైతులకు న్యాయం చేస్తామని జగన్ హామి ఇచ్చారని, ఆయనపై తమకు నమ్మకం ఉందని రైతులు పేర్కొన్నారు.
పాదయాత్రలో భాగంగా రామచంద్రామపురం నియోజకవర్గంలోని కే గంగవరం మండలం గోపాలరావుపేట గ్రామస్తులు కూడా వైఎస్ జగన్‌ను కలిశారు. తమ గ్రామంలోని రోడ్ల దుస్థితిని జననేత దృష్టికి తీసుకెళ్లారు. అడుగు తీసి అడుగు వేయలంటే అవస్థలు పడుతున్నామన్నారు. స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డు సమస్యగా మారిందని చిన్నారులు తెలిపారు. వైఎస్సార్ హయాంలో తారు రోడ్డు వేశారని, ఆ తర్వాత రోడ్డు కొట్టుకుపోతే ఇప్పటి వరకు పట్టించుకునేవారు లేరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని వారు తెలిపారు.
మేమంతా జగన్ వెంటే..
మాదిగలంతా వైఎస్ జగన్ వెంటే ఉంటారని మాదిగ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మడికి కిషోర్ బాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు సాదే రాజేష్ కుమార్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరుతూ వైఎస్ జగన్‌కు వీరు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్ మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే జిల్లాలో మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వైఎస్ జగన్ హమీ ఇచ్చారని తెలిపారు. గత ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ చేసి పెదమాదిగ అవుతానని చంద్రబాబు తమ జాతిని నమ్మించారని విమర్శించారు. జిల్లాలో మాదిగలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని, తమను ఓటు బ్యాంక్‌గా వాడుకున్నారని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment