సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలోని గ్రామాల రైతులపై మౌలిక వసతుల కల్పన భారాన్ని మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలో భూ సమీకరణ కింద రైతుల నుంచి భూములు తీసుకున్న సమయంలో ప్లాట్లతోపాటు గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిని తామే చేపడతామని, ఎలాంటి చార్జీలను వసూలు చేయబోమని చెప్పిన సర్కారు ఇప్పుడు మాట తప్పింది. భూ సమీకరణ జరిపిన 29 గ్రామాలను 13 జోన్లుగా విభజించి అభివృద్ధి చార్జీలను రైతులు, గ్రామస్థుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది.
రహదారులు, వంతెనలు, తాగునీరు, మురుగునీటి, పారిశుద్ధ్యం, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలను కల్పించినందుకు హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు మెకన్సీ కన్సల్టెన్సీ రూపొందించిన సూచనలను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం 3 జోన్లకు టెండర్లు కూడా ఖరారు చేసింది. అయితే సీఆర్‌డీఏ భరించే 49 శాతం వ్యయంతోనే ఈ పనులు పూర్తి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 51 శాతం ఖర్చు పెట్టే ప్రైవేట్ డెవలపర్లకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వటంతోపాటు పదేళ్ల పాటు వాటికి చెల్లింపులు జరపాలని నిర్ణయించటంపై సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రైవేట్ డెవలపర్లకు స్థానిక రైతులు చెల్లించేదంతా చివరకు ప్రభుత్వ ‘పెద్ద’ల ఖాతాలోకే చేరుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పదేళ్లు నిర్వహణ బాధ్యత డెవలపర్‌దే
హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో భాగంగా తొలిదశలో 10 జోన్లలో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)ను రూపొందించిన సీఆర్‌డీఏ మూడు జోన్లకు టెండర్లు ఖరారు చేసింది. ప్రాజెక్టు వ్యయంలో సీఆర్‌డీఏ 49 శాతం, 51 శాతం ప్రైవేట్ డెవలపర్ భరిస్తారు. నిర్మాణం తరువాత పదేళ్ల పాటు ఆపరేషన్, నిర్వహణ బాధ్యత ప్రైవేట్ డెవలపర్‌దే. నిర్మాణ సమయంలో 49 శాతం నిధులను సీఆర్‌డీఏ చెల్లిస్తుంది. తొలుత పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇస్తుంది. మిగతా 51 శాతం నిధులను ప్రైవేట్ డెవలపర్ బ్యాంకుల నుంచి సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ కూడా ఇవ్వనుంది. ప్రైవేట్ డెవలపర్ చేసిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లలో ఏటా రెండు విడతలుగా మొత్తం 20 వాయిదాల్లో చెల్లించనుంది. అప్పటి మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) కన్నా అదనంగా మూడు శాతం వడ్డీతో చెల్లిస్తుంది. ఎస్క్రో అకౌంట్ ద్వారా సీఆర్‌డీఏ, ప్రైవేట్ డెవలపర్ నిధులను వ్యయం చేస్తారు. ఆపరేషన్, నిర్వహణ చార్జీలను మూడు నెలలకోసారి ప్రైవేట్ డెవలపర్‌కు చెల్లించాలి.
మెగా, బీఎస్‌ఆర్, ఎన్‌సీసీకి టెండర్లు ఖరారు
జోన్–1లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.652.88 కోట్ల అంతర్గత అంచనాలతో టెండర్లను పిలవగా మెగా ఇంజనీరింగ్‌తో పాటు బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా పాల్గొన్నాయి. 679.64 కోట్లతో 4.10 శాతం ఎక్కువగా కోట్ చేసి ఎల్–1 గా నిలిచిన మెగా ఇంజనీరింగ్‌కే టెండర్ ఖరారు చేశారు. జోన్–2లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.698.21 కోట్ల అంతర్గత అంచనాలతో టెండర్లను ఆహ్వానించగా బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా, మెగా ఇంజనీరింగ్, ఎల్ అండ్ టీ పాల్గొన్నాయి. రూ.725.71 కోట్లతో 3.94 శాతం ఎక్కువకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాకు టెండర్ ఖరారు చేశారు. జోన్–3లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.626.61 కోట్ల అంతర్గత అంచనాలతో టెండర్లను ఆహ్వానించగా ఎన్‌సీసీ, మెగా ఇంజనీరింగ్, బీఎస్‌ఆర్ పాల్గొన్నాయి. రూ.653.67 కోట్లతో 4.32 శాతం ఎక్కువకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎన్‌సీసీకి టెండర్‌ను ఖరారు చేశారు.
ఇదీ సంగతి..
- రాజధాని గ్రామాల్లో రహదారులు, నీరు, విద్యుత్తు లాంటి మౌలిక వసతుల కల్ప నకు అయ్యే వ్యయాన్ని రైతులే భరించాలి.
- రైతులు, గ్రామస్థుల నుంచి యూజర్,అభివృద్ధి చార్జీలు, ఇతర పన్నులు వసూలు చేసి ప్రైవేట్ డెవలపర్‌కు చెల్లిస్తారు.
- సీఆర్‌డీఏ భూములను విక్రయించడం, తనఖా ద్వారా వచ్చే డబ్బుల నుంచి కూడా ప్రైవేట్ డెవలపర్‌కు చెల్లిస్తారు.
- ప్రైవేట్ డెవలపర్ల 51 శాతం వాటాకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీతోపాటు పదేళ్ల పాటు వాటికి చెల్లింపులు జరుపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment