గాలి+నీరు = ఈ-డీజిల్!
అవసరమనండి... పెరిగిపోతున్న డిమాండ్ కానివ్వండి. ముంచుకొస్తున్న వాతావరణ మార్పుల ముప్పు అనండి..
కారణమేదైనా పర్యావరణానికి హాని కలిగించని ఇంధనాల తయారీకి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలైతే ముమ్మరమవుతున్నాయి! ప్రఖ్యాత కార్ల కంపెనీ ఆడీ ఈ దిశగా కీలకమైన ముందడుగు వేసింది! కేవలం గాల్లోని కార్బన్ డైయాక్సైడ్, నీళ్లు మాత్రమే వాడుతూ కృత్రిమ డీజిల్‌ను తయారు చేయడంలో విజయం సాధించింది... ఆర్డర్లు రావాలేగానీ... ఈ-డీజిల్‌ను తయారు చేసి అమ్మేందుకు మేం రెడీ అంటోంది!
పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతో భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భూమ్మీద బతకటమే కష్టంగా మారిపోతుందని తరచూ వింటూంటాం. అందుకు తగ్గట్టుగానే అకాల వర్షాలు, వరదలు, కరవు కాటకాల వార్తలూ వినిపిస్తూన్నాయి. భూతాపోన్నతికి కారణమవుతున్న గ్రీన్‌హౌస్ వాయువుల్లో 13 శాతం రవాణా రంగం నుంచి వస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలోనే పర్యావరణ హితమైన ఇంధనాల తయారీకి ప్రాముఖ్యత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. మొక్కజొన్నలు మొదలుకొని రకరకాల పంటల ద్వారా ఎథనాల్ తయారీకి పూనుకున్నా... వ్యర్థ పదార్థాల నుంచి గ్యాస్ తయారు చేసి వాడుకున్నా ఇందుకోసమే. అయితే ఇప్పటివరకూ సాధించినవన్నీ ఒక ఎత్తు. ఆడి పరిచయం చేస్తున్న ఈ డీజిల్ కాన్సెప్ట్ మరో ఎత్తు. కృత్రిమంగా డీజిల్‌లాంటి ఇంధనాన్ని తయారు చేయడమొక్కటే దీని ప్రత్యేకత కాదు.. ఈ క్రమంలో కార్బన్‌డైయాక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువును మళ్లీ డీజిల్‌గా మార్చడం... వాహనాల్లో వాడినప్పుడు కూడా అతితక్కువ మోతాదులో వ్యర్థవాయువులను విడుదల చేయడం చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు!
తయారీ ఇలా...
ఈ-డీజిల్ తయారీ కోసం ఆడి కంపెనీ జర్మనీలోని డ్రెస్‌డెన్‌లో ఓ పెలైట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. పవన, సౌరవిద్యుత్తులతో నడిచే ఈ ప్లాంట్‌లో ముందుగా రివర్సిబుల్ ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా నీటిని హైడ్రోజెన్, ఆక్సిజన్‌లుగా విడగొడతారు. ఆ తరువాత దీనికి కార్బన్‌డైయాక్సైడ్ వాయువును కలిపి కార్బన్ మోనాక్సైడ్‌గా మారుస్తారు. మరో రెండు రసాయన ప్రక్రియల తరువాత ఈ కార్బన్ మోనాక్సైడ్ కాస్తా... ముడిచమురును పోలిన ద్రవంగా మారుతుంది. రిఫైనరీల్లో మాదిరిగా శుద్ధి చేయడం ద్వారా దీన్నుంచి డీజిల్‌ను రాబడతారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కోసం బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన కార్బన్‌డైయాక్సైడ్‌ను ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో అక్కడికక్కడే వాతావరణం నుంచి ఈ వాయువును సేకరించి వాడుకోవచ్చునని కంపెనీ అంటోంది.
డీజిల్ కంటే మెరుగు...
ఆడి కంపెనీ తయారు చేసిన కృత్రిమ డీజిల్ సంప్రదాయ డీజిల్ కంటే మెరుగైన లక్షణాలు కలిగి ఉంటుంది. పైగా గంధకం అసలు లేని ఈ కొత్త డీజిల్ ద్వారా వెలువడే విష వాయువులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంజిన్ ద్వారా వెలువడే శబ్దం కూడా తగ్గుతుందని, ఆడితో కలిసి ఈ ఇంధనాన్ని అభివృద్ధి చేసిన సన్‌ఫైర్ కంపెనీ సీటీవో క్రిస్టియన్ వాన్ అంటున్నారు. డ్రెస్‌డెన్‌లోని పెలైట్ ప్లాంట్‌లో ప్రస్తుతం రోజుకు 160 లీటర్ల ఈ-డీజిల్‌ను తయారు చేస్తున్నారు. వాణిజ్యస్థాయిలో ఉత్పత్తికి పెద్దసైజు ప్లాంట్ ఏర్పాటు అవుతోంది.