నిద్రా సమయం
షవర్ ఆన్ చేశాక నీళ్లు తల మీద పడుతుంటే దొంగ వెధవ జడ్డి వెధవ ముష్టి వెధవ అని తిట్టుకుంది.
పైకి తిట్టుకుందా లోపల తిట్టుకుందా తెలియలేదు.
కాని ఆ కోపం ఈ రాత్రికి దిగదు.
మొన్నొక రోజు ఒక సబార్డినేట్‌ని పిలిచి చెడామడా తిడితే తిట్టించుకున్నామె బాగానే ఉంది. పక్కన ఉన్న నలుగురూ చేరి పైకి కంప్లయింట్ చెయ్ ఈవిణ్ణి ఇక్కణ్ణుంచి జిల్లాలకు సాగనంపుదాం అని ఎక్కించారు. జిల్లాలకు? అదీ సిటీని వదిలి. ఆ తలనొప్పి నుంచి బయట పడాల్సి వచ్చింది.
టైమ్‌కి వచ్చారా లేదా అని మొన్న సర్‌ప్రైజ్ విజిట్ చేసింది. అదీ కరెక్ట్ కాదట. ఈమెకెందుకు.. పనయ్యిందా లేదా అని చెప్పమనండీ అని నలుగురైదుగురు క్యాంటీన్‌లో రంకెలు వేశారని తెలిసింది.
ఇవాళ ఒకణ్ణి పిలిచి ఫైల్ పుటప్ చేయవయ్యా మగడా అంది. వాడి ఇంగ్లిష్ నిండా తప్పులే. రెడ్డింక్‌తో రౌండప్ చేసి పంపితే- అవి టైపింగ్ మిస్టేక్స్... ఫైల్ పుటప్ చేయడంలో ఇలాంటి తప్పులు మామూలే... అవి సరి చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని వాడే రివర్స్‌లో కామెంట్ రాసి పంపాడు.
ఏమనడానికి ఏముంది?
ఇంటికొచ్చి ఇదిగో ఈ పని.
లేడీ ఆఫీసరంటే అన్నింటికీ అటెన్షన్. డ్రస్సు సరిగ్గా ఉన్నా అటెన్షన్. లేకపోయినా అటెన్షన్. గట్టిగా మాట్లాడితే అటెన్షన్. మాట్లాడకపోయినా అటెన్షన్. ఆఖరుకు ఆకలికి రెండు మూడు అరలున్న లంచ్‌బాక్స్ తెచ్చుకున్నా అటెన్షన్. మేడం... మేడం.. అందరూ గౌరవం నటించే మగాళ్లే మళ్లీ. కాని ఎంత కిందకు లాగుదామా అని చూట్టంలో ఒక్కడూ తక్కువ కాదు.
మమ్మల్నీ వేధిస్తారండీ అంటాడు పక్క సెక్షన్ ఆఫీసరు.
కాని అతడు సాయంత్రానికి ఫ్రెండ్స్‌తో చేరి బార్‌కు వెళ్లి హాయిగా బూతులు తిట్టుకొని రెండు గుటకలు పుచ్చుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరక్కుండా పది లోపలే ఇల్లు చేరి భోం చేసి నిద్ర పోతాడట.
తనేం చేయాలి? బూతులు రావు. బార్‌కు వెళ్లలేదు. రాత్రి పదికి వెళ్లి భోం చేసి పడుకుందామంటే ఆ భోజనం అనే మాటను మళ్లీ తయారు చేయాల్సింది తనే. ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. లోలోపల ఏదో కోపంగా ఉంటుంది. బలవంతంగా నిశ్శబ్దంగా ఉండబుద్ధేస్తోంది. అలాగే ఉంటోంది.
మొన్న పెద్దది కనిపెట్టి అంది- నువ్వు చాలా మారిపోయావ్ మమ్మీ అని. ఎనిమిది చదువుతోంది. ఎంత గమనింపో బంగారానికి. ఇంతకు మునుపైతే ఆఫీసు నుంచి రావడమే దానితో చాలా కబుర్లు చెప్పేది. కాలనీ వీధిలోకి తీసుకెళ్లి దీపాల వెలుతురులో షటిల్ ఆడేది. చిన్నాడు సైకిల్ తొక్కుతుంటే సీట్ పట్టుకుని వెనుక పరుగు తీసేది. ఇరుగు పొరుగు వాళ్లతో బోలెడు బోలెడు కబుర్లు చెప్పేది. ఇప్పుడు అవన్నీ మెల్లమెల్లగా గడ్డకట్టి పోయినట్టుగా అనిపిస్తున్నాయి. నిర్లిప్తమైన ముఖం. కోపంతో ముడతలు పడ్డ నుదురు.
స్నానం ముగించి నైటీ జార్చుకుని బయటకు వచ్చింది. ఇక వంట. పిల్లలు టీవీ ముందు పుస్తకాలు వేసుకుని కూచుని ఉన్నారు. మామూలుగా అయితే వాళ్లతో కూచుని కబుర్లు చెప్పి... భర్త ఇంటికొస్తే తను పడుతున్న ఇబ్బందులేవో చెప్పుకుని...
ఏం చెప్పుకున్నా ఏం ప్రయోజనం?
గవర్నమెంట్ వ్యవహారాలు అర్థం కావు. పాడిందే పాడరా అన్నట్టుగా ఉద్యోగం మానేయరాదా అంటాడు. లేదంటే అవన్నీ పట్టించుకోకు అంటాడు. రెండూ సాధ్యం కాదు. చాలాసార్లు ఆ మాటే చెప్పింది. ఏం అని రెట్టిస్తాడు. వివరంగా చెప్పాలా?
ఆడవాళ్లు పుట్టిల్లు అనే మాటను తీసేశారు. మంచైనా చెడ్డైనా తమ బతుకేదో తాము బతకాలని నిశ్చయించుకున్నారు. నీకు అనువుగా ఉన్నంత కాలమే నువ్వు భద్రత ఇస్తావు. తేడా వస్తే బ్యాగు సర్ది చేతికిస్తావు. అప్పుడు నా ఉద్యోగమే నాకు దిక్కు. కనుక దానిని నేను వదులుకోను. పైగా ఇది నా చదువుకీ తెలివితేటలకీ సామర్థ్యానికీ వచ్చిన ఉద్యోగం. వదిలేసి నన్ను నేను చిన్నబుచ్చుకోలేను. ఇక పట్టించుకోకపోవడం గురించి. ఒకసారి రెండుసార్లైతే పర్లేదు. అనునిత్యం ముల్లులాగా పదే పదే గుచ్చుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉండమంటావ్?
అంతటితో వాదన ముగుస్తుంది.
ఇది కూడా ఈ మధ్య ఆపేసింది. ఒక్క ఊరడింపు మాట కూడా లేకపోతే ఏం చేసేది?
నా గోల నేను పడుతున్నాను... నన్నెవరు బుజ్జగిస్తున్నారు... నాకెవరు జోల పాడుతున్నారు... ఎంత సేపూ నీవైపు నుంచే చూస్తున్నావ్ అంటాడు.
ఈ మధ్య గమనిస్తోంది. ప్రతి మనిషీ
సాటి మనిషంటే మంటెత్తి పోతున్నాడు. ఇక టీమ్ లీడర్ అంటే ఊరుకుంటారా? ఏమేం పడుతున్నాడో? అవన్నీ పడి అలో లక్ష్మణా అని ఇల్లు చేరితే కాసిని పూలు పెట్టుకుని ఎదురు రాకుండా ముఖం గంటు పెట్టుకుని ఉంటే... అప్పటికీ ట్రై చేస్తోంది. కాని కుదరడం లేదే.
బెల్ మోగింది. పిల్లలు నాన్నా.. నాన్నా.. అని పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ తీశారు.
వాళ్లతో ఒకటి రెండు మాటలు... తనకు కళ్లతో పలకరింపు... ముఖం చూడగానే అర్థమైపోయుంటుంది... మాట్లాడకుండా షవర్‌కి వెళ్లిపోయాడు. లోపల ఎవర్ని తిట్టుకుంటున్నాడో.
ఆ పూట మునగాకు పప్పు చేసింది. నలభైకి చేరుకున్నాక ఆడవాళ్లకు ఆకుకూరలు తప్పనిసరి అని ఎక్కడో చదివింది. కాదు భర్త చేష్టలు తప్పనిసరి అని స్నేహితురాలు జోక్ చేసింది.
అయితే అలా జోక్ చేసే రోజులన్నీ ఎప్పుడో పోయాయి. పిల్లలతో తప్ప ఎదురూ బొదురూ కూచుని నవ్వుకుని ఎన్నాళ్లయ్యిందని. ఒకోరోజు ఈవైపు మూడ్ బాగోదు. లేకుంటే ఆ వైపు మూడ్ బాగోదు.
భోజనాల దగ్గర కొంచెం పితలాటకం అయ్యింది. పిల్లలు మునగాకు తినం అని మారాం చేస్తే- నేను వండగలిగింది ఇంతే తింటే తినండి లేకుంటే పోండి అని పెద్దగా గద్దించింది. ఉలిక్కిపడ్డాడు. పిల్లలు కూడా. చివరికి మామిడిపండు కోసి వారికి పెరుగన్నం తినిపించింది. కాసేపు టీవీ టైం. నలుగురూ కూచున్నాక కాస్త మంచి మూడ్ సెట్ చేసే ప్రోగ్రామ్ చూద్దామంటే అన్నీ చావు వార్తలు... దుర్మార్గపు సంఘటనలు.
చూసి చూసి లేచింది.
పిల్లల్ని పడుకోబెడతాను అని వాళ్లను వాళ్ల గదికి బయల్దేరదీసి అరగంట తర్వాత బయటకు వచ్చింది.
నేను నిద్ర పోతున్నాను- ప్రకటించింది.
తల ఊపాడు.
తొందరగా నిద్ర పోడు. పదకొండు దాకా టీవీ చూస్తాడు. తనకు పొద్దున్నే లేవక తప్పదు. పైగా మరుసటిరోజు ఆఫీస్ పనులను ఒకసారి మననం చేసుకోవాలి. వ్యూహాలతో సిద్ధం కావాలి. లోపలికి వెళ్లి పడుకుంది.
సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ అది. అరవై డెబ్బై వేలు పెట్టి కొన్నారు. అందులో ఏం తక్కువ లేదు. ఇద్దరూ కలిసి ఇంటి నిండా ఖరీదైనవన్నీ నింపారు. బాంటియాలో ఇది డిజైనర్ బెడ్ అంటే సింగిల్ పేమెంట్‌తో ఇంటికి తెచ్చుకున్నారు. మెత్తగా ఉంటుంది. పడుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. స్లిప్పర్స్ వదిలి ఒక పక్కకు వాలి దిండుకు చెంపను ఆనించి నిద్ర పోయింది. ఆ తర్వాత ఎప్పుడొచ్చి పడుకున్నాడో పడుకున్నాడు.
ఇలా వాళ్ల కాపురం గడిచిపోతూ ఉంది.
బంధువుల్లో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ జరిగినా, కాలనీలో కారు వేసుకుని వెళుతూ వాళ్లు కనిపించినా అందరూ వాళ్లకేమీ అని అంటూ ఉంటారు.
అవును. వాళ్లకేమి?
మహమ్మద్ ఖదీర్‌బాబు