Mohammed khadirbabu
-
థ్యాంక్యూ...
మెట్రో కథలు - 20 మెనూ కార్డ్ ముందుకు తోశాడు. ఫస్ట్‌టైమ్ అలా చేయడం. ఏంటిది?... ఆర్డర్ చెప్పు. నేనా... నేనెప్పుడైనా చెప్పానా... నన్నెప్పుడైనా చెప్పనిచ్చావా?... ఎందుకు మాటలనడం. ఇప్పుడు చెప్పొచ్చుగా. తీసుకొని తిరగేసింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. పాపను అడిగింది. ఏంవే... ఏం చెప్దాం... దానికేం తెలుసు? తల్లి వైపు చూసి ఫోర్కులతో ఆట కొనసాగించింది. మెనూ కార్డ్ తిరిగి ఇచ్చేస్తూ అంది. నువ్వే చెప్దూ... సాధారణంగా రెండు నాన్, ఒక వెజ్ కర్రీగానీ నాన్ వెజ్ కర్రీగానీ, ఒక బిరియానీ, కర్డ్ రైస్ చెప్తాడు. స్టాండర్డ్. ఎప్పుడు వచ్చినా అంతే. అలా అలవాటు చేశాడు. వెజ్ నూడుల్స్ ఇష్టం. ఎప్పుడూ అడగలేదు తింటావా అని. గోంగూర మటన్ ఇష్టం. అదీ అడగలేదు ఎప్పుడైనా కావాలా అని. పాపకు వెనిల్లా ఇష్టం. కాని ఎప్పుడూ టూ బై త్రీ బటర్ స్కాచ్ చెప్తాడు. ఇవాళ ఛాయిస్ తనకు ఇస్తున్నాడు. పెళ్లికి తీసుకెళ్దామని మస్కా వేస్తున్నాడేమో. కల్లో కూడా జరగని పని. నవ్వుతూనే అంది- పెళ్లికి ప్లాన్ చేస్తున్నావా... చచ్చినా రాను... అబ్బెబ్బే... అని ఊరుకున్నాడు. సొంత బాబాయి కొడుకు పెళ్లి. బాబాయి కొడుకే అయినా బాగా చనువు ఎక్కువ. సొంత తమ్ముడి కంటే ప్రేమగా ఉంటాడు. వెళ్లకపోతే ఎలా? ముందు రోజే చర్చ జరిగింది. రచ్చ అనాలేమో. నేను రానుగాక రాను. మా పిన్నికూతురి పెళ్లికి వెళ్దామంటే నువ్వొచ్చావా? ఆఫీస్‌లో వీలుగాదని ఎగ్గొట్టావ్. కనిపించిన ప్రతి మహాతల్లి మీ ఆయనెక్కడే మీ ఆయనెక్కడే అని అడుగుతుంటే తల ఎక్కడ పెట్టుకున్నానో తెలుసా? ఆ నొప్పి నీకు తెలియాలి. రాను. పెటేల్మని ఒక్కటి పీకాడు. కొట్టు. చంపు. రాను గాక రాను. మళ్లీ ఒక్కటి. మీ వాళ్లంతా నీ పెళ్లాం ఎక్కడ్రా నీ పెళ్లాం ఎక్కడ్రా అని అడుగుతుంటే అప్పుడు చెప్పు సమాధానం. మీ అక్క నా మీద ఏదో ఎక్కిస్తే పెళ్లికి ఎగ్గొడ్తావేం... రాత్రి ఇద్దరూ సరిగ్గా నిద్ర పోలేదు. తెల్లారి బ్రేక్‌ఫాస్ట్ మీద అలిగి వచ్చేశాడు. తినూ తినూ తినేసి పో అని తనూ యాక్టింగ్ చేయలేదు. పనేదో చేస్తున్నాడు. సడన్‌గా తేడాగా అనిపించింది. ఒళ్లు తేలిగ్గా అవుతున్నట్టు... స్పృహ తప్పుతున్నట్టు.... తెలియని ఆందోళనగా... దడగా... గుటక పడుతూ... గుండెపోటుకు సూచనలా... కలీగ్కి చెప్తే కంగారు పడిపోయి ఆఫీస్ వెహికల్లో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. డాక్టర్ ఎవరో మంచోడే. పల్స్ అదీ చెక్ చేసి- ఏం కాలేదు... సరదా ఉంటే చెప్పండి టెస్ట్‌లు రాస్తాను... రెండు మూడు వేలవుతాయి అన్నాడు. ఈసీజీ కూడా వద్దన్నాడు. ఒకటి రెండు గ్లాసులు మంచినీళ్లు తాగమని, తాగనిచ్చి అడిగాడు- దేనికైనా టెన్షన్ పడుతున్నారా? మొహమాటంగా చెప్పాడు. మామూలే. ఇంట్లో చిన్న చిన్న గొడవలు. అందుకే యాంగ్జయిటీ. ప్రిస్కిప్షన్ మీద ఏదో టాబ్లెట్ రాశాడు. చింపుతూ అన్నాడు- దీని కంటే మీకో చిన్న సూఫీ కథ బాగా పని చేస్తుంది. ఒక సూఫీ తన శిష్యులతో రెండేళ్లుగా దేశాటన చేస్తున్నాడట. ఏ ఊరికెళ్లినా ఆదరించేవాళ్లకి కొదవే లేదట. పెట్టే కంచం కడిగే కంచం. ఒక ఊరికెళితే ఆ ఊరి వాళ్లు బాగా తిక్క మీద ఉన్నారట. అసలే వానల్లేక తిండి గింజలకు నానా అవస్థలు పడుతుంటే పడి మేయడానికి వచ్చారట్రా అని కర్రలు తీసుకుని వెంటపడ్డారట. సూఫీ తన శిష్యులతో పరిగెత్తుకుంటూ ఊరు దాటి ఒక్కసారిగా మోకాళ్ల మీద కూలబడి దేవుడికి పదే పదే కృతజ్ఞతలు మొదలుపెట్టాడట. శిష్యులు ఆశ్చర్యపోయి వ్యంగ్యాలు పోతూ- ఎందుకు స్వామీ దేవునికి కృతజ్ఞతలు... ఈ ఊరి వాళ్లు అన్నం పెట్టనందుకా అని అడిగారట. కాదురా... ఇన్నాళ్లూ అన్ని ఊళ్ల వాళ్లు అన్నం పెట్టినందుకు... పెట్టినన్నాళ్లు దేవుని దయ తెలియలేదు... ఇప్పుడే కదా తెలిసింది అని మళ్లీ కృతజ్ఞతలకు మళ్లుకున్నాడట. అర్థ మైందా... చూస్తూ ఉన్నాడు. ఇంత పెద్ద సిటీ. రోడ్లు బాగుండవు. ట్రాఫిక్‌కు. ఎక్కడ పడితే అక్కడ గుంటలు తవ్వేసి ఉంటారు. మేన్హోళ్లు. ఇక ఈ మెట్రో రైలు పనులతో అదో తలనొప్పి. చాలక చైన్ స్నాచర్లు. చీటర్లు. ఫ్రాడ్ మాస్టర్లు. నోట ఏది పెట్టినా కల్తీ ప్లస్ పొల్యూషన్. తోడు పనిచోట రాజకీయాలు ప్రాంతాలను బట్టి స్పర్థలు. ఇవి ఇచ్చే స్ట్రెస్ చాలదా... మళ్లీ ఇంట్లో కూడా స్ట్రెస్ జనరేట్ చేస్తున్నారా? గ్యాప్ ఇచ్చి అన్నాడు. థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి. మీకో పెళ్లాం ఉన్నందుకు థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి. మీ పెళ్లానికి మీరున్నందుకు ఆమెను థ్యాంక్‌ఫుల్‌గా ఉండమనండి. మీ ఇద్దరూ ఇవాళ డిన్నర్‌కు వెళ్తే గనక అంతటి మహద్భాగ్యం కలిగించిన దేవునికి థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి. అసలు ప్రాణాలతో ఉన్నందుకు మొదట థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి సార్... ఈ గొడవలన్నీ దూదిపింజల్లా తేలిపోతాయి... సాయంత్రం కిక్కురుమనకుండా నేరుగా ఇంటికి చేరుకుని డిన్నర్ ప్లాన్ చేశాడు. కాని పెళ్లికి ఐస్ చేస్తున్నాడేమోనని అనుమానపడుతోంది. చెప్పేశాడు- పెళ్లికి వద్దులే. అదేం పెద్ద విషయం కాదు. తర్వాత చూద్దాం. ఆశ్చర్యంగా చూసింది. అదేంటి? అవును. అలగడానికీ సాధించడానికీ బోలెడన్ని చాన్సులు వస్తాయి. కాని పెళ్లి మాటిమాటికీ చేసుకోరుగా. మీ పిన్నికూతురి పెళ్లికి నేను రావాల్సింది. తప్పు చేశాను. సారీ. దానికి ఇది విరుగుడు. ఇక ఇంతటితో వదిలేద్దాం. నవ్వింది. ఇంటికి ఎటు నుంచి వచ్చావ్? ఏదైనా తొక్కి వచ్చావా ఏంటి? ఇక ఈ దెప్పిపొడుపు మాటలు వదిలేద్దాం. ప్లీజ్. విసుగ్గా ఉంది. బయట ఉన్న తలనొప్పులు దేశాన ఉన్న తలనొప్పులు చాలవా పడ్డానికి. నువ్వూ నేనూ కూడా ఎందుకు బాధించుకోవడం. హ్యాపీగా ఉందాం సరేనా. గోంగూర మటన్ చెప్పనా? సీరియస్‌గా చూసింది. నిజం చెప్తున్నావా? నిజం. ఫోర్క్‌తో ఖాళీ ప్లేట్‌ను రెండు సార్లు మోగించింది. ఏం అక్కర్లేదు. వెళ్దాంలే. పర్లేదు. వెళ్దాం అంటున్నాగా. వెజ్ నూడుల్స్, వైట్ రైస్, గోంగూర మటన్ చెప్పాడు. చివర్లో వెనిల్లా తెమ్మని కూడా. మళ్లీ అన్నాడు. మీ అమ్మ మీ అన్నయ్య దగ్గర ఉండటానికి ఇబ్బంది పడుతున్నదని తెలుసు. కావాలంటే కొన్నాళ్లు మన దగ్గర పెట్టుకుందాం. డ్రామా కాదు. నిజంగానే చెప్తున్నా. ఇంకా నీకేదైనా మనసులో ఉంటే అది చెప్పకుండా సాధించే పనిలో మాత్రం దిగకు. వినడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నాదో రిక్వెస్ట్. అమ్మను చూడ్డానికి ఊరికెళ్లి చాలా రోజులైంది. నువ్వు ప్లాన్ చేస్తే రెండ్రోజులు ఉండి వచ్చేద్దాం. తల కిందకు వంచి ఫోర్క్‌ను టేబుల్ మీద గుచ్చుతూ అలాగే ఉండి తలెత్తి చూసింది. మొగుడూ పెళ్లాల కళ్లు. ఏం మాట్లాడుకుంటాయో ఎవరికి తెలుసు. మెల్లగా నవ్వి తేలిక పడింది. సరే. పాపకు నెక్ట్స్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయ్. అవి అయ్యాక వెళ్దాం. ఈలోపు బీపీ మెషీన్ ఒకటి పంపు. ఎన్నాళ్ల నుంచో అడుగుతోందిగా. పాపం సంతోషపడుతుంది. థ్యాంక్యూ... ఓయబ్బా... థ్యాంక్యూ... టూ వీలర్ మీద మధ్యలో కూచోబెట్టుకుంటే పాప దారిలోనే నిద్రపోయింది. ఫ్లాట్‌కు వచ్చాక జాగ్రత్తగా ఎత్తుకొని నిద్రపుచ్చి చీర మార్చుకుని నైటీ తొడుక్కుంది. ఇందాక కావాలని పెట్టుకోలేదు. ఇప్పుడు ఫ్రిజ్ తెరిచి పాలిథిన్ కవర్లో దాచిన ఆ కాసిని విరజాజులని తలలో తురుముకుంది. హాల్లోకొచ్చి అంది- ఇంకా టీవీ ఎంత సేపు చూస్తావ్... రారాదూ? ఊ..ఊ.. అంటూ టీవీ ఆఫ్ చేసి లేచి వచ్చాడు. నడుం మీద చేయి వేసింది. పొట్ట పెరిగింది. తగ్గించరాదూ? తగ్గిస్తా. కొంచెం ట్రై చేసి ఇలాగే హ్యాపీగా ఉందాం. సరేనా? సరే. థ్యాంక్యూ... ఈసారి కాలు వేసింది. మొగుడూ పెళ్లాల చేష్టలు. ఆ తర్వాతి చేష్ట ఏమిటో మనకు మాత్రం ఏం తెలుసు? - మహమ్మద్ ఖదీర్‌బాబు గమనిక: 20 కథల ఈ మెట్రో సిరీస్ ఇంతటితో ముగిసింది. ఆదరించిన పాఠకులకు కృతజ్ఞతలు. - రచయిత, 9701332807 -
సబ్వే...
మెట్రో కథలు పదండి సీనియర్గారూ అని నవ్వింది. అలాగే జూనియర్గారూ అని తోడు కలిపాడు.ఆరంజ్, ఎల్లో పాట్రన్‌లో అందంగా తయారైన టేబుల్స్‌లో మూడో వరుసలో ఉన్న మొదటిది వాళ్ల ఫేవరేట్. ఎప్పుడూ అక్కడే కూచుంటారు. పదిహేను నిమిషాలు... మహా అయితే అరగంట. ఆఫీసులో రొడ్డకొట్టుడు పనిలో అదే పెద్ద వెసులుబాటు. కాని ఇవాళ రోజూ కలిసినట్టుగా కాదు. ఇవాళ ప్రత్యేకం. మెనూ అందుకుంది. బిల్ నేను పే చేస్తాను. అడ్డు చెప్పకూడదు. సరే. చట్పటా చనా, ఆలూ పాటీ చెప్పింది. టిన్ కోక్ ఒకటి చెప్తే ఆఖరులో చెరి సగం తాగుతారు. సో... అంది. సో... అన్నాడు. చూసుకున్నారు. మాటలు రాలేదు. మూడేళ్లుగా కూచుంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుందని తెలుసు. అందుకే ప్రిపేర్డ్గాఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సుద్దులు చెప్తున్నట్టుగా అంది- కొత్త ఆఫీసులో అయినా సరిగ్గా లంచ్ బాక్స్ తెచ్చుకో. డెస్క్‌లో కొన్ని డ్రైఫ్రూట్స్ పెట్టుకొని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తిను. టీలు తక్కువ తాగు. అలా గడ్డం పెంచకు. ఆరు నెల్లకు ఒకసారి కంప్లీట్ చెకప్ చేయించుకో. ఇవన్నీ పదే పదే చెప్పడానికి చేయించడానికి అక్కడ నేను ఉండను. గుర్తు పెట్టుకో.... ముఖంలోకి చూడలేక తలాడించాడు. అన్నింటి కంటే ముఖ్యం ఇంక మెయిల్సు, వాట్సప్‌లు, ఫేస్బుక్ పలకరింపులు బంద్ చెయ్. ఫర్మాలిటీగా కంటిన్యూ చేసి తర్వాత కట్ చేయడం కన్నా వెంటనే కట్ చేయడం మంచిది. మనమేం చిన్నపిల్లలం కాదు కదా. ఏమంటావ్?... మళ్లీ తలాడించాడు. ఏదీ నా వైపు చూడు...చూశాడు. ఓరి బాబో... ఏడవకురా తండ్రీ.... పెద్ద పెద్దగా నవ్వింది. కాసేపాగి కళ్లు తుడుచుకుంటూ నవ్వే ప్రయత్నం చేశాడు. ఆఫీసులో చేరిన కొత్తలో ఇలాగే ఏడ్చింది. పని చేతగాక ఏడుపు తన్నుకొచ్చేది. పెళ్లికి ముందు ఉద్యోగం చేసేదే. పెళ్లి తర్వాత ఏడేళ్లు ఉద్యోగం మాటే మర్చిపోయింది. ఆ తర్వాత మళ్లీ చేరితే ఎంత అనుభవం ఉన్నా తెలిసిన సాఫ్ట్వేర్ తతంగమే అయినా మారిపోవాల్సినవన్నీ మారిపోయే ఉంటాయి కదా. ఏమైనా కావాలంటే మీ సీనియర్ని అడగండి అన్నాడు టీమ్ లీడర్. సీనియర్ అంటే వాడెంత పెద్దాడో ఏ నలభై నలభై అయిదేళ్ల వాడో అనుకుంది. తన కంటే చిన్నవాడు. ముప్పై ఏళ్లు కూడా దాటని వాడు. కాని సీనియర్ సీనియరే కదా. డౌట్లు తీర్చే పద్ధతి విసుక్కోకుండా పని నేర్పే పద్ధతి ఎంత పనిలో ఉన్న పోజు కొట్టక అటెండ్ చేసే పద్ధతి నచ్చి సీనియర్గారూ అని పిలవడం మొదలుపెట్టింది. జూనియర్గారూ అని తిరిగి జవాబు ఇవ్వడం మొదలుపెట్టాడు. అదో చిన్న నవ్వు. ఇద్దరూ సిటీలో ఈ మూల నుంచి ఒకరు ఆ మూల నుంచి ఒకరు తెల్లారి ఎనిమిదికి బయలు దేరుతారు. క్యాబ్‌లో గంటా గంటన్నర జర్నీ నరకం. వచ్చాక సీట్లకు అతుక్కుపోయి మళ్లీ క్యాబ్ ఎక్కి ఇల్లు చేరేంత వరకూ అదో నరకం. ఏసి అద్భుతంగా ఉంటుంది. కాని గాలే ఆడనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కూచుని కూచుని ఉబుసుపోక- మీ ఆవిడ ఏం వండిందండీ అని వచ్చి కూచునేది. ఏం వండలేదండీ. తను పొద్దున్నే లేచి చేయలేదు. బాబుతో కుదర్దు. పర్లేదు. నేను తెచ్చాను లెండి. తినండి.. మొహమాటస్తుడు. వినేవాడు కాదు. సరే. సబ్వేలో అయినా ఏదైనా ఎంగిలి పడదాం పదండి... బలవంతం చేసేది. ఆఫీసుకు ఫర్లాంగు దూరంగలో సబ్వే ఉంది. అందరూ వెళ్లి తింటుంటారు. వీళ్లకూ అలవాటైంది.అందరికీ చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉంటారు. మాట్లాడిందే మాట్లాడి కొత్తదేం మాట్లాడటానికి ఉండదు. పైగా మనం ఏ మానసిక స్థితిలో ఉన్నామో వాళ్లకు తెలీదు. కలీగ్స్ ఉంటారు. కాని అందరికీ అన్నీ చెప్పుకునే పరిస్థితులు ఉండవు. ఎవరో ఒకరుభద్రంగా క్షేమంగా అనిపించాలి. తలుపు తట్టాలి. మీ ఆయన మంచివాడే కదండీ.... చాలా. మీ ఆవిడ?దేవత కదండీ...కొన్నాళ్లకు ఈ సంభాషణ మారుతుంది. అబ్బో... మా ఆయనకు చాలా కోపమండీ.... అమ్మో... మా ఆవిడ చాలా సతాయిస్తుందండీ.... నిజానికి పెళ్లయిన మొదటి మూడు రాత్రులలోనే సమస్య తెలిసింది. పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ. ఆ తర్వాత కూడా సమస్య పోలేదు. రాత్రి వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి పగలంతా పెత్తనం చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తాడు. అదంతా చెప్పలేదు. ఏం అలా ఉన్నారు అనడితే- ఎవరి బాధలు వారివి లేండి అని ఊరుకుంటుంది. తెలియకపోతే కదా. పెళ్లయి ఇన్నాళ్లయినా నిజంగా గౌరవిస్తుందా ప్రేమిస్తుందా పక్కన కూచుని మెత్తగా ఎందుకు మాట్లాడదు ప్రతిదీ సందేహమే. ఆ మాటా నిజమే లేండి అని ఊరుకుంటాడు. ఇంతకుమునుపు క్యాబ్ ప్రయాణం బోర్ కొట్టేది. ఇప్పుడు ఇద్దరూ చెరో క్యాబ్‌లో బయలు దేరాక ఫోనో, వాట్సప్పో నడిచిపోతూ ఉంటుంది. ఆఫీస్‌లో ఒకసారి కలిసి కాఫీ తాగుతారు. అతడి కోసం ఒక డబ్బా ఎక్కువ తెస్తుంది గనక కలిసి భోంచేస్తారు. సాయంత్రం సబ్వేలో స్నాక్ తినే మిష మీద ఏవో ఉబుసుపోని కబుర్లు చెప్పుకుంటారు. అతడికి జ్వరం వస్తే ఆమె టాబ్లెట్ తెస్తుంది. ఆమెకు పని పెరిగితే అతడు చేసి పెడతాడు. ఆఫీస్‌లో అందరూ గమనించారు. ఎవరూ గమనించనట్టే ఉన్నారు. ఆమె జోలికి ఇంకే మగవాళ్లు రావడం లేదు. అతణ్ణి వేరే ఆడవాళ్లెవ్వరూ కదలించడం లేదు. అంతకు మించి ఏమైనా జరిగిందా అని కుతూహలం ఉన్నవాళ్లు ఉన్నారు లేనివాళ్లూ ఉన్నారు. ఇంతకు మించి ఏమీ వద్దు కదా అడిగాడు ఒకరోజు. చూసింది. అడగడం నార్మల్. అడక్కపోతే అబ్నార్మల్... నసిగాడు. వద్దు. ఆ తర్వాత ఆ చర్చ మళ్లీ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఇంకా పెద్ద సంస్థలో ఇంకా మంచి ఆఫర్ వచ్చింది. వెళ్లిపోతున్నాడు. బిల్లు కట్టేసింది. చీకటి పడిపోయింది. ఇద్దరూ కావాలనే క్యాబ్‌ని మిస్ చేసేశారు. నిన్ను ఇంటి దాకా దింపనా? అడగలేక అడగలేక అడిగాడు. వద్దు. బస్‌లో వెళతాను. చూసుకున్నారు. సో... అన్నాడు. సో... అంది. చేయి ఊపింది. చేయి సాచాడు. చివరి కరచాలనం. రేపు మళ్లీ తెల్లారుతుంది. మళ్లీ ఆఫీసు ఉంటుంది. కాకపోతే వీళ్లు మళ్లీ ఇలా ఉండకపోవచ్చు. అందరూ ఇలా ఉండకపోవచ్చు. కాని ఇలా ఉండి ఆర్డర్ ప్లేస్ చేసేవారి కోసం మాత్రం సబ్వేలో పదార్థాలు తయారవుతూనే ఉంటాయి. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
మెట్రో...
వెళ్లి తీసుకురండి అని నిలబడింది. దూరంగా ఉన్న టూ వీలర్ పార్కింగ్ వైపు ప్లాస్టిక్ ఆంజనేయస్వామి కీచైన్‌ను ఊగులాడించుకుంటూ వెళుతూ ఉంటే లైట్ల వెలుతురులో ఆ కుట్టించిన ప్యాంట్ కుట్టించిన చొక్కా టక్ మూడొందల యాభై రూపాయల చెప్పులు... విసుగ్గా అనిపించాయి. చేతిలో ఉన్న పాలిథిన్ కవర్ని ఒకసారి చూసుకొని ఎందుకనో దూరంగా జరిగి నిలుచుంది. చాలామంది లోపలి నుంచి ట్రాలీలతోనే కార్ల వరకూ వచ్చి డిక్కీలు తెరిచి కొనుక్కున్న సరుకులను ట్రాలీలలో నుంచి కార్లలో పడేసి దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. మొగుడూ పెళ్లామూ... ఉంటే పిల్లలూ. మెట్రోకి కార్లు ఉన్నవాళ్లే ఎక్కువగా వస్తారు. కార్డ్ ఉన్న వాళ్లనే రానిస్తారు. నాలుగు నెలల క్రితం త్రీ నాట్ ఫోర్ వాళ్ల ఫ్లాట్‌కు వెళ్లినప్పుడు కొత్త డైనింగ్ టేబుల్ కనిపించింది. చిన్నగా ముచ్చటగా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు అని అడిగితే మెట్రోలో అని చెప్పారు. అప్పుడే మొదటిసారి మెట్రో గురించి వినడం. కుకట్‌పల్లిలో చాలా పెద్ద స్టోరట. ఎన్నో ఎకరాల్లో పెట్టారట. అక్కడ దొరకనిదేదీ ఉండదట. అసలు చూడ్డానికే కళ్లు చాలవట. ప్రతి వస్తువూ డిస్కౌంట్లో ఇస్తారట. ఫ్రీ గిఫ్ట్స్ ఉంటాయట. ఒకసారి తీసుకెళ్లండీ అంది ఆ రాత్రి. అందరినీ రానివ్వరు అన్నాడు. ఎలాగోలా తీసుకెళ్లండీ అంది మళ్లీ. ఏదో చెప్పబోయాడు. అటు తిరిగి పడుకుంది. జీతం ఆరు వేలు పెరుగుతుందంటే ఆఫీసు మారి ఈ వైపున కాస్త దూరంగా వచ్చాక ఈ ఫ్లాట్స్ చాలా నచ్చాయి. ఎనిమిది వేలు అద్దె. మెయింటెనెన్స్ ఇతర నెలవారీ ఖర్చులూ హాస్టల్లో పడేయగా పది చదువుతున్న పిల్లవాడి ఖర్చూ అన్నీ పోగా మొత్తం నలభై వేలలో ఒక పదీ పన్నెండు మిగులుతాయి. ఒకటి రెండు రీసేల్‌కు ఉన్నట్టున్నాయ్... లోనుకు ట్రై చేయండి అనంటే అతి కష్టం మీద పదిహేను పద్దెనిమిది ఇస్తారట. అంతకు మించి పైసా ఇవ్వరట. ఫ్లాట్... థౌజండ్ ఎస్ఎఫ్టిది కూడా పాతిక ఉంది. ఇలా ఎంతకాలం అని అనిపించింది కాని విసుగు కలగలేదు. పచారి కొట్లో పద్దు ఇచ్చి సామాన్లు తెచ్చుకోవడం, మల్టీప్లెక్స్ ముఖం చూడకుండా దగ్గర్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లోనే సినిమా చూసి వచ్చేయడం, కుక్కర్లు హాట్ బాక్సుల్లాంటి వాటిక్కూడా సిటీలోకి వెళ్లకుండా దగ్గరలోనే సర్దుకోవడం... నయం ఆర్.ఎస్. బ్రదర్స్వాడు కొత్తగా షోరూం తెరిచాడు లేదంటే పండగలకూ పబ్బాలకూ కూడా ఇక్కడిక్కడే కానిచ్చేద్దాం అనంటే అప్పుడూ విసుగనిపించలేదు. కాని అమాసకీ పున్నానికైనా ఇలాంటి కొత్తవాటికి తీసుకెళ్లి చూపించడానికి ఏం నొప్పి అని? కార్డ్ సంపాదించడానికి కొన్నాళ్లు అవస్థ పడ్డాడు. అది రిటైలర్లకూ సొంత ఫర్మ్ఉన్నవాళ్లకీ పైహోదాలో ఉన్న ఉద్యోగులకూ ఇంకా ఎవరెవరికో ఇస్తారట. మామూలు వాళ్లకు ఇవ్వరట. ఏవో పడి సంపాదించాడు. దానిని తెచ్చి చూపించిన రోజు లాటరీ తగిలినట్టుగా సంబరపడింది. అంటే ఇది తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లొచ్చన్నమాట. అవును. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చన్న మాట. అవును. ఆ అవును విలువ కనీసం వెయ్యి రూపాయలని తర్వాత తెలిసింది. మొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఏమీ అర్థం కాలేదు. పూర్తిగా బెంబేలు పడిపోయింది. ఇంత పెద్ద స్టోరా? టీవీలు... ఒక వంద ఉన్నాయి. వాషింగ్ మెషీన్లు... ఒక వంద ఉన్నాయి. మిక్సీలూ గ్రైండర్లు... లెక్కలేనన్ని పడి ఉన్నాయి. కూర కలిపే గరిటెలు ఒక వంద రకాలు ఉన్నాయి. ట్యూబులు బల్బ్‌లు ఫ్యాన్లు బట్టలు చెప్పులు పండ్లు కూరగాయలు ఆఖరకు సాంబ్రాణీ ప్యాకెట్లతో సహా ఏవైనా సరే ఒకటీ రెండూ లేవు. వంద రకాలే. జనం తోసుకుంటున్నారు. ట్రాలీలు నెట్టుకుంటూ కోరినది అందుకుని పడేసుకుంటున్నారు. బెల్లం ఎండు మిరపకాయలను కూడా పడీ పడీ తీసుకుంటున్నారు. డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు చేతుల్లో పట్టుకుని క్యూల్లో నిలుచుంటున్నారు. కంగారు పుట్టి ఇది అయ్యే పని కాదని నాలుగు రకాల పండ్లు తీసుకొని గబగబా బయట పడాలనుకుంది. కాని వాటి బిల్లు వెయ్యి దాటలేదట. వెయ్యి రూపాయలకు మించి సరుకులు కొంటేనే బిల్ చేస్తారట. ఒళ్లు మండి వాటిని అక్కడే పడేసి వచ్చేసింది. ఇది రెండోసారి రావడం. బైక్ తెచ్చాడు. మామూలుగా అయితే చేతిలో ఉన్న పాలిథిన్ కవర్ని ఒళ్లో పెట్టుకొని వెనుక కూచుంటుంది. కాని కూచోవాలనిపించలేదు. ముందు పెట్టుకోండి. అదేంటి? పెట్టుకోండంటున్నానా? మారు మాటాడకుండా కవర్ ముడి వేసి మూట లాగా చేసి కాళ్ల మధ్యలో పెట్టుకున్నాడు. వెనుక కూచుంది. బైక్ బయలు దేరింది. కళ్ల దగ్గరగా అతడి వెనుకజుట్టు కనిపిస్తూ ఉంది. పెళ్లిచూపుల్లో నిండుగా ఉన్న ఆ తల వెంట్రుకలను చూసే ఇష్టపడింది. ఇవాళ అవి దుమ్ముకూ ధూళికీ హెల్మట్ వొత్తిడికి అణిగీ అణిగీ జీవం కోల్పోయి... రోజూ చూసేవే... ఇవాళ అయిష్టంగా అనిపిస్తున్నాయి. అపార్ట్మెంట్లో అందరికీ కార్లున్నాయి. ఆల్టోకూ నానోకు కూడా నోచుకోలేమా? చేతిలో ఉన్న పర్స్ వైపు చూసుకుంది. అందులో తెచ్చిన డబ్బు అలాగే ఉంది. ఈసారి ఎలాగైనా సరే తీరిగ్గా తిరుగుతూ నాలుగైదు వేలకు కొనేయాలనుకుంది. ఆ డబ్బుకు ట్రాలీ నిండుగా సరుకు రాదనీ కనీసం ట్రాలీలో ఒక మూలకు కూడా రాదనీ అసలు పెద్ద వస్తువు ఏదీ రాదని తెలుసుకుని అవమానపడింది. టీవీలు చూస్తుంటే ఇంట్లో టీవీ గుర్తుకొచ్చింది. దాని వయసు పన్నెండేళ్లు. వాషింగ్ మెషీన్లు చూస్తుంటే ఇంట్లో ఉన్న వాషింగ్ మెషీన్ గుర్తుకొచ్చింది. వాషింగ్ మెషీనా అది? ప్లాస్టిక్ డబ్బా. మంచి మంచి పిల్లోలు కనిపించాయి. ఇంట్లోవి మార్చి రెండేళ్లు. ఇంత అందమైన డోర్మేట్లు ఉంటాయా? ఇంట్లో ఉన్నవాటిని కాలితో కూడా తాకలేమే! కాఫీ కప్పుల సౌందర్యం చూసి చాలాసేపు ఆగిపోయింది. ఇంత మంచివి కావాలంటే ఇంత రేటు పెట్టాల్సిందేనేమో. తాజా చందువాల దగ్గర మాత్రం మనసు చాలా లాగింది. కిలో ఆరు వందల యాభై అట. అమ్మో. ఇక షాంపూల వెరైటీ చూస్తే సిగ్గేసింది. తను ఇంట్లో వాడేది షాంపూనే కాదు. హెన్నా పెట్టి అది అంటీ అంటక... మామూలు చీర... మ్యాచింగ్ లేని చెప్పులు... జిప్పు సరిగ్గా పడని పర్సు.... అంత పెద్ద మాల్లో మేచింగ్ కాని మనిషిలా నిలుచుని ఉంది. మళ్లీ ఏమీ కొనాలనిపించలేదు. వేయి రూపాయలకు ఏమి వస్తాయో అవి నాలుగు పడేసుకుని బయటకు వచ్చేసింది. ఇల్లు చేరుకునేసరికి ఎనిమిదిన్నర. వంట చేయాలనిపించలేదు. లైట్లు కూడా వేయక నేరుగా వెళ్లి గదిలో పడుకుంది. చూసీ చూసీ వచ్చి అడిగాడు. వంట చేయవా? మీరే ఏదో తెచ్చుకుని తిని పడుకోండి. నాకు బయట తిండి పడదని తెలుసు కదా. చివాలున లేచింది. తెలిస్తే ఏం చేయమంటారు? బెదిరాడు. మనం బతుకుతున్నది అన్యాయమైన బతుకు కదా. తెలిసి మీరేం చేస్తున్నారు? ఆ గొంతుకు అదిరిపోయి చూస్తున్నాడు. అత్యాశ కాదండీ. మామూలు ఆశ కూడా కాదు. కనీస కోరిక. చిన్న ఇల్లు... అవసరమైన మంచి వస్తువులు... ఆ ఖర్మకు కూడా గతి లేకపోతే కనీసం కాలంతో పాటు కలిసి నడుస్తున్నామనే ఆనవాళ్లు... అవీ లేకపోతే ఏం బతుకండీ ఇదీ.... దరిద్రమైన బతుకు.... నీకేదో దెయ్యం పట్టింది. ఇంతకు మించి నా వల్ల కాదు. మీ వల్ల కాకపోతే ఎందుకు చేసుకున్నారు? ఎందుకు కన్నారు? పెద్ద మగాడిలా బట్టలు కట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు. నా ముందు నిలబడి ఏం యోగ్యత ఉందని మాట్లాడుతున్నారు?.... దెబ్బ తిన్నాడు. అక్కడ నిలబడలేక విసవిసా విసురుగా తలుపు తీసుకుని బయటకెళ్లిపోయాడు. మళ్లీ ఉలకక పలకక పడుకుంది. మెట్రో- తనేమిటో తనకు తెలియపర్చింది. ఈ ఒక్క పూటే. రేపటి నుంచి బహుశా ఈ దారుణమైన పేదరికాన్ని మధ్యతరగతి అనే లేబుల్ కింద వంచన చేసుకుంటూ బతికేయనుంది. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
దీదీ...
మెట్రో కథలు దీదీకి మసాజ్ టేబుల్ ఎంత ఎత్తు ఉంటుందో తెలియదు.మెడ నుంచి మొదలుపెడతారా పాదాలు నొక్కుతూ ప్రారంభిస్తారా తెలియదు. ఆయిల్ వాడతారని తెలుసు. ఏ ఆయిలో తెలియదు.కాని ఒప్పుకుంది. ఎనిమిది వందలు అంటే మాటలు కాదు.గదికి బాగా వెంటిలేషన్ ఉంది. రెండు పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. సింగిల్ కాట్ బెడ్ ఉంది.ఆ కర్టెన్స్ వేసేయ్ దీదీ అని వెళ్లిపోయింది. కర్టెన్స్ వేస్తుంది సరే ఆ తర్వాత ఏం చేయాలి? దీదీని జుట్టు కొసలు కట్ చేయమంటే క్షణాల్లో చేసేస్తుంది. హెన్నా పెట్టమంటే చక్కగా పెడుతుంది. ఫేషియల్ ఓ మోస్తరు తెలుసు. ఐబ్రోస్ దిద్దడంలో పర్ఫెక్ట్. అంతకు ముందు ఆమెను మెహందీ దీదీ అని అనేవారు. ఇంటింటికీ తిరిగి మెహందీ పెట్టేది. మెల్లగా ఇవి కూడా నేర్చుకుంది. ఇప్పుడు మసాజ్లోకి దిగాలి. వచ్చింది. నైటీలో ఉంది. ఇలా పడుకోనా దీదీ అంది. వాలకం చూస్తే వెల్లికిలా పడుకునేలా ఉంది. వెల్లికిలాయేనా? నీకు తెలియదా దీదీ?నాకు తెలియదు. నాకూ తెలియదే. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఉదయం యథావిధిగా ఇంటికి వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ లేదు. ఐబ్రోస్ చేసి హెన్నా పెట్టి వెళ్లిపోవాలి. దాని కంటే ముందు ఏదైనా పెడుతుంది తిందాం అనే ఆలోచన కూడా లేకపోలేదు. ఆ ఇంటికి రావడం అంటే అందుకే దీదీకి ఉత్సాహం. కాఫీ టీ ఇస్తుంది. అప్పుడప్పుడు పాత చీరలు పడేస్తుంది. చాలా ఫ్లాట్స్ తిరుగుతుంటుంది కదా. ఇది కొంచెం బాదరబందీ లేని ఫ్లాటే. పిల్లలిద్దరూ హైస్కూల్ కాలేజీలకు వచ్చేసినట్టున్నారు. అతను కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కునేపాటి బిజీ ఉద్యోగం చేస్తున్నట్టున్నాడు. ఇంట్లో ఉడ్‌వర్క్ ఏమీ పెండింగ్ లేదంటే పర్వాలేదన్న మాటే. ఈమె ఇంట్లో ఉంటుంది. ఆదరంగా మాట్లాడుతుంది. ఫేషియల్ గట్రా చేస్తుంటే ఇలా చెయ్ అలా చెయ్ అని ఇతర ఆడవాళ్లలా నస పెట్టకుండా ఊరికే ఉంటుంది. ఇంతకు ముందు మాటల్లో ఒకటి రెండుసార్లు దీని ప్రస్తావన తెచ్చింది. అదేమిటో తెలియక దీదీ ఊరుకుంది. కాని ఇవాళ చేసంచి దించి సామాగ్రి సర్దుకుంటూ ఉంటే ఈ పనికి పట్టుపట్టింది. అప్పటికీ దీదీకి ఇది లంపటంగానే అనిపించింది. హెన్నా పెడతాను. వేణ్ణీళ్ల స్నానం చేసి పడుకో బేటీ. వింటేనా? రెండు చేతులనూ తల కింద దిండులాగా అమర్చుకుని కళ్లు మూసుకుని పడుకుంది. ఇద్దరు పిల్లల తల్లి. చక్కటి ముఖం. కుదురైన రూపం. పరిపూర్ణతను దిద్దుకున్న ఆకారం. దీదీ ఒక క్షణం తేరిపారా చూసింది. రాని పని చేయాలి. మోడా లాక్కుని మంచం చివర కూచుంది. పాదాలను చూసింది. పక్కపక్కన పడుకున్న జంట శిశువుల్లా ఉన్న వాటిలోని ఒక దానిని మెల్లగా చేతిలోకి తీసుకుంది. నులివెచ్చని నూనెలో వేలి కొసలను ముంచి సుతారంగా తాకించింది. జలదరించింది. మరో పాదాన్ని నిమిరింది. నిలువెల్లా ఒణికింది. దీదీ తన జీవితంలో ఎవరి పాదాలూ పట్టుకోలేదు. భర్తవి కూడా. కూతురు పుడితే చిన్నప్పుడు దాని పుష్టి కోసం క్రమం తప్పకుండా నూనె పట్టించింది. అది గుర్తుకు వచ్చింది. వాటికీ వీటికీ తేడా ఏమిటి? స్పర్శను కొనసాగించింది. సుతారంగా ఆర్ద్రంగా తన స్పర్శ అంతా ఆమె స్పర్శకు అందే విధంగా... ముఖం వైపు చూస్తూ ఉంది. కనురెప్పలు మూతపడిన ఆ ముఖం మెల్లమెల్లగా తేట పడుతూ ఉంది. పాడైపోయిన ముడి ఏదో క్రమంగా వదులవుతున్నట్టుగా ఉంది. ఎన్నాళ్ల బరువో రుద్దీ రుద్దీ తేలిక పడుతున్నట్టుగా ఉంది. అది పరవశం కాదు. ఊపిరి అందని చోట ఒక తెమ్మర తాకడం. ఒక నిమిషం... రెండు నిమిషాలు... మూడు నిమిషాలు....కళ్ల నుంచి నీళ్లు ఉబకడం మొదలుపెట్టాయి. ధారాపాతంగా కారిపోతూ ఉన్నాయి.ఏడుస్తున్న పసిపాప. ఏమీ చెప్పుకోలేని ఆడశిశువు. దీదీ చేతులు ఇప్పుడా శిశువును లాలిస్తూ ఉన్నాయి. శరీరమంతా నిమురుతూ ఉన్నాయి. దేహమంతటినీ సంపూర్ణంగా తడుముతూ ఉన్నాయి. కాని అవి ఆత్మను వెతుకులాడుతున్నట్టుగా కనిపించాయి. ఎందుకు బేటీ? అడగాలనిపించింది. కాని ఆ ప్రశ్న స్పష్టంగా వినిపించింది. స్పర్శ కావాలి. నీ భర్త ఇస్తున్నాడు కదమ్మా.తీసుకుంటున్నాడు దీదీ. ఇవ్వడం లేదు. అర్థం కాలేదు బేటీ. కాసేపు దగ్గర కూడి తాకడానికి కోరిక చాలు దీదీ. కాని మీద చేయి వేసి పక్కన పడుకోవడానికి ప్రేమ కావాలి. చాలా ప్రేమ కావాలి. ఇల్లు బట్టలు ఫేషియల్‌కి డబ్బులు ఇవి ఇస్తే సరిపోతుందనుకుంటారు. కాని పక్కన చేయి పట్టుకొని కూచోవడం అక్కర్లేదను కుంటారు. ఆ దప్పిక ప్రాణం తీస్తుందని ఎవరు చెప్పాలి దీదీ... ఎలా చెప్పాలి... ఇదంతా ఉగ్గబట్టుకుని ఎలా నిలబడాలి... ఎంతకాలం నిలబడాలి.... ఆ ప్రశ్నతో ఎవరికీ వినిపించని ఆ సంభాషణ ముగిసింది. కర్టెన్లు తొలిగాయి.తెరిపిన పడి లేచి కురులు ముడి వేసుకుంటూ కిచెన్‌లోకి వెళ్లి టీ పెట్టుకుని వచ్చింది. ఇద్దరూ తాగారు.ఆ తర్వాత డబ్బులు ఇస్తే తీసుకుని దీదీ అక్కణ్ణుంచి వచ్చేసింది. దీదీకి మసాజ్ టేబుల్ ఎంత ఎత్తు ఉంటుందో ఇప్పటికీ తెలియదు. మెడ నుంచి మొదలుపెడతారా పాదాల నుంచి మొదలుపెడతారా కూడా తెలియదు. కాని అడిగేవాళ్లు చాలామందే ఉన్నారని తెలుసుకుంది. రేటు కూడా పన్నెండు వందలకు ఒక్క రూపాయి తగ్గించడం లేదని వార్త. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
నిద్రా సమయం
షవర్ ఆన్ చేశాక నీళ్లు తల మీద పడుతుంటే దొంగ వెధవ జడ్డి వెధవ ముష్టి వెధవ అని తిట్టుకుంది. పైకి తిట్టుకుందా లోపల తిట్టుకుందా తెలియలేదు. కాని ఆ కోపం ఈ రాత్రికి దిగదు. మొన్నొక రోజు ఒక సబార్డినేట్‌ని పిలిచి చెడామడా తిడితే తిట్టించుకున్నామె బాగానే ఉంది. పక్కన ఉన్న నలుగురూ చేరి పైకి కంప్లయింట్ చెయ్ ఈవిణ్ణి ఇక్కణ్ణుంచి జిల్లాలకు సాగనంపుదాం అని ఎక్కించారు. జిల్లాలకు? అదీ సిటీని వదిలి. ఆ తలనొప్పి నుంచి బయట పడాల్సి వచ్చింది. టైమ్‌కి వచ్చారా లేదా అని మొన్న సర్ప్రైజ్ విజిట్ చేసింది. అదీ కరెక్ట్ కాదట. ఈమెకెందుకు.. పనయ్యిందా లేదా అని చెప్పమనండీ అని నలుగురైదుగురు క్యాంటీన్లో రంకెలు వేశారని తెలిసింది. ఇవాళ ఒకణ్ణి పిలిచి ఫైల్ పుటప్ చేయవయ్యా మగడా అంది. వాడి ఇంగ్లిష్ నిండా తప్పులే. రెడ్డింక్తో రౌండప్ చేసి పంపితే- అవి టైపింగ్ మిస్టేక్స్... ఫైల్ పుటప్ చేయడంలో ఇలాంటి తప్పులు మామూలే... అవి సరి చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని వాడే రివర్స్‌లో కామెంట్ రాసి పంపాడు. ఏమనడానికి ఏముంది? ఇంటికొచ్చి ఇదిగో ఈ పని. లేడీ ఆఫీసరంటే అన్నింటికీ అటెన్షన్. డ్రస్సు సరిగ్గా ఉన్నా అటెన్షన్. లేకపోయినా అటెన్షన్. గట్టిగా మాట్లాడితే అటెన్షన్. మాట్లాడకపోయినా అటెన్షన్. ఆఖరుకు ఆకలికి రెండు మూడు అరలున్న లంచ్‌బాక్స్ తెచ్చుకున్నా అటెన్షన్. మేడం... మేడం.. అందరూ గౌరవం నటించే మగాళ్లే మళ్లీ. కాని ఎంత కిందకు లాగుదామా అని చూట్టంలో ఒక్కడూ తక్కువ కాదు. మమ్మల్నీ వేధిస్తారండీ అంటాడు పక్క సెక్షన్ ఆఫీసరు. కాని అతడు సాయంత్రానికి ఫ్రెండ్స్‌తో చేరి బార్‌కు వెళ్లి హాయిగా బూతులు తిట్టుకొని రెండు గుటకలు పుచ్చుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరక్కుండా పది లోపలే ఇల్లు చేరి భోం చేసి నిద్ర పోతాడట. తనేం చేయాలి? బూతులు రావు. బార్‌కు వెళ్లలేదు. రాత్రి పదికి వెళ్లి భోం చేసి పడుకుందామంటే ఆ భోజనం అనే మాటను మళ్లీ తయారు చేయాల్సింది తనే. ఉక్కిరిబిక్కిరిగా ఉంటుంది. లోలోపల ఏదో కోపంగా ఉంటుంది. బలవంతంగా నిశ్శబ్దంగా ఉండబుద్ధేస్తోంది. అలాగే ఉంటోంది. మొన్న పెద్దది కనిపెట్టి అంది- నువ్వు చాలా మారిపోయావ్ మమ్మీ అని. ఎనిమిది చదువుతోంది. ఎంత గమనింపో బంగారానికి. ఇంతకు మునుపైతే ఆఫీసు నుంచి రావడమే దానితో చాలా కబుర్లు చెప్పేది. కాలనీ వీధిలోకి తీసుకెళ్లి దీపాల వెలుతురులో షటిల్ ఆడేది. చిన్నాడు సైకిల్ తొక్కుతుంటే సీట్ పట్టుకుని వెనుక పరుగు తీసేది. ఇరుగు పొరుగు వాళ్లతో బోలెడు బోలెడు కబుర్లు చెప్పేది. ఇప్పుడు అవన్నీ మెల్లమెల్లగా గడ్డకట్టి పోయినట్టుగా అనిపిస్తున్నాయి. నిర్లిప్తమైన ముఖం. కోపంతో ముడతలు పడ్డ నుదురు. స్నానం ముగించి నైటీ జార్చుకుని బయటకు వచ్చింది. ఇక వంట. పిల్లలు టీవీ ముందు పుస్తకాలు వేసుకుని కూచుని ఉన్నారు. మామూలుగా అయితే వాళ్లతో కూచుని కబుర్లు చెప్పి... భర్త ఇంటికొస్తే తను పడుతున్న ఇబ్బందులేవో చెప్పుకుని... ఏం చెప్పుకున్నా ఏం ప్రయోజనం? గవర్నమెంట్ వ్యవహారాలు అర్థం కావు. పాడిందే పాడరా అన్నట్టుగా ఉద్యోగం మానేయరాదా అంటాడు. లేదంటే అవన్నీ పట్టించుకోకు అంటాడు. రెండూ సాధ్యం కాదు. చాలాసార్లు ఆ మాటే చెప్పింది. ఏం అని రెట్టిస్తాడు. వివరంగా చెప్పాలా? ఆడవాళ్లు పుట్టిల్లు అనే మాటను తీసేశారు. మంచైనా చెడ్డైనా తమ బతుకేదో తాము బతకాలని నిశ్చయించుకున్నారు. నీకు అనువుగా ఉన్నంత కాలమే నువ్వు భద్రత ఇస్తావు. తేడా వస్తే బ్యాగు సర్ది చేతికిస్తావు. అప్పుడు నా ఉద్యోగమే నాకు దిక్కు. కనుక దానిని నేను వదులుకోను. పైగా ఇది నా చదువుకీ తెలివితేటలకీ సామర్థ్యానికీ వచ్చిన ఉద్యోగం. వదిలేసి నన్ను నేను చిన్నబుచ్చుకోలేను. ఇక పట్టించుకోకపోవడం గురించి. ఒకసారి రెండుసార్లైతే పర్లేదు. అనునిత్యం ముల్లులాగా పదే పదే గుచ్చుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉండమంటావ్? అంతటితో వాదన ముగుస్తుంది. ఇది కూడా ఈ మధ్య ఆపేసింది. ఒక్క ఊరడింపు మాట కూడా లేకపోతే ఏం చేసేది? నా గోల నేను పడుతున్నాను... నన్నెవరు బుజ్జగిస్తున్నారు... నాకెవరు జోల పాడుతున్నారు... ఎంత సేపూ నీవైపు నుంచే చూస్తున్నావ్ అంటాడు. ఈ మధ్య గమనిస్తోంది. ప్రతి మనిషీ సాటి మనిషంటే మంటెత్తి పోతున్నాడు. ఇక టీమ్ లీడర్ అంటే ఊరుకుంటారా? ఏమేం పడుతున్నాడో? అవన్నీ పడి అలో లక్ష్మణా అని ఇల్లు చేరితే కాసిని పూలు పెట్టుకుని ఎదురు రాకుండా ముఖం గంటు పెట్టుకుని ఉంటే... అప్పటికీ ట్రై చేస్తోంది. కాని కుదరడం లేదే. బెల్ మోగింది. పిల్లలు నాన్నా.. నాన్నా.. అని పరిగెత్తుకుంటూ వెళ్లి డోర్ తీశారు. వాళ్లతో ఒకటి రెండు మాటలు... తనకు కళ్లతో పలకరింపు... ముఖం చూడగానే అర్థమైపోయుంటుంది... మాట్లాడకుండా షవర్‌కి వెళ్లిపోయాడు. లోపల ఎవర్ని తిట్టుకుంటున్నాడో. ఆ పూట మునగాకు పప్పు చేసింది. నలభైకి చేరుకున్నాక ఆడవాళ్లకు ఆకుకూరలు తప్పనిసరి అని ఎక్కడో చదివింది. కాదు భర్త చేష్టలు తప్పనిసరి అని స్నేహితురాలు జోక్ చేసింది. అయితే అలా జోక్ చేసే రోజులన్నీ ఎప్పుడో పోయాయి. పిల్లలతో తప్ప ఎదురూ బొదురూ కూచుని నవ్వుకుని ఎన్నాళ్లయ్యిందని. ఒకోరోజు ఈవైపు మూడ్ బాగోదు. లేకుంటే ఆ వైపు మూడ్ బాగోదు. భోజనాల దగ్గర కొంచెం పితలాటకం అయ్యింది. పిల్లలు మునగాకు తినం అని మారాం చేస్తే- నేను వండగలిగింది ఇంతే తింటే తినండి లేకుంటే పోండి అని పెద్దగా గద్దించింది. ఉలిక్కిపడ్డాడు. పిల్లలు కూడా. చివరికి మామిడిపండు కోసి వారికి పెరుగన్నం తినిపించింది. కాసేపు టీవీ టైం. నలుగురూ కూచున్నాక కాస్త మంచి మూడ్ సెట్ చేసే ప్రోగ్రామ్ చూద్దామంటే అన్నీ చావు వార్తలు... దుర్మార్గపు సంఘటనలు. చూసి చూసి లేచింది. పిల్లల్ని పడుకోబెడతాను అని వాళ్లను వాళ్ల గదికి బయల్దేరదీసి అరగంట తర్వాత బయటకు వచ్చింది. నేను నిద్ర పోతున్నాను- ప్రకటించింది. తల ఊపాడు. తొందరగా నిద్ర పోడు. పదకొండు దాకా టీవీ చూస్తాడు. తనకు పొద్దున్నే లేవక తప్పదు. పైగా మరుసటిరోజు ఆఫీస్ పనులను ఒకసారి మననం చేసుకోవాలి. వ్యూహాలతో సిద్ధం కావాలి. లోపలికి వెళ్లి పడుకుంది. సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ అది. అరవై డెబ్బై వేలు పెట్టి కొన్నారు. అందులో ఏం తక్కువ లేదు. ఇద్దరూ కలిసి ఇంటి నిండా ఖరీదైనవన్నీ నింపారు. బాంటియాలో ఇది డిజైనర్ బెడ్ అంటే సింగిల్ పేమెంట్‌తో ఇంటికి తెచ్చుకున్నారు. మెత్తగా ఉంటుంది. పడుకుంటే చక్కగా నిద్ర పడుతుంది. స్లిప్పర్స్ వదిలి ఒక పక్కకు వాలి దిండుకు చెంపను ఆనించి నిద్ర పోయింది. ఆ తర్వాత ఎప్పుడొచ్చి పడుకున్నాడో పడుకున్నాడు. ఇలా వాళ్ల కాపురం గడిచిపోతూ ఉంది. బంధువుల్లో ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ జరిగినా, కాలనీలో కారు వేసుకుని వెళుతూ వాళ్లు కనిపించినా అందరూ వాళ్లకేమీ అని అంటూ ఉంటారు. అవును. వాళ్లకేమి? మహమ్మద్ ఖదీర్‌బాబు -
సుకీ...
మెట్రో కథలు మూడు రోజుల తర్వాత వార్త తెలిసి ఆమె మంచం పట్టింది. సుకీ గొంతు దాదాపు పోయిందట. ఆగకుండా మొరిగీ మొరిగీ ఏమై పోయి ఉంటుందో ఊహించుకుంటే ఆమెకు అన్నం ముద్ద దిగడం లేదు. బాగా బరువు తగ్గిపోయిందట. అప్పటికీ చెప్పి చెప్పి పంపింది- సుకీ ఏదంటే అది తినదూ దానికి బ్రెడ్ ఇష్టం రెండు పూటలా అదే పెట్టండీ అని. రొట్టె పెట్టారట. అది పొరపాటున కూడా మూచూడదు. తలుపు ఏ కాస్త అలికిడైనా తన వాళ్లు వచ్చారేమోనని ఉలికులికి పడుతోందనీ నిద్ర పోవడంలేదనీ కదలిక ఏమీ లేనట్టుగా శవంలాగా పడి ఉంటోందనీ... మీరు వెళ్తారా నన్ను వెళ్లమంటారా? అని ఆమె పెద్దపెద్దగా ఏడ్చింది. ఎవరు మాత్రం సమాధానం చెప్తారు. వెళ్లినా లాభం లేదు. తెచ్చుకున్నా మళ్లీ పంపాల్సిందే. అపార్ట్మెంట్లో ఉన్న ఇతర ఫ్లాట్స్ వాళ్లకు కూడా ఇదంతా సతమతంగా ఉంది. మొదట ఆ ఫ్లాట్ మీద ఎవరి దృష్టీ లేదు. జనరల్‌బాడీలో తెలిసింది- కార్పస్ ఫండ్ కట్టలేదని, ఎమినిటీస్‌కు కట్టాల్సింది కూడా కట్టకుండానే ఆక్యుపై చేసుకున్నారనీ, మెయింటెనెన్స్‌కు వాచ్‌మెన్‌ను పదేపదే తిప్పుతున్నారనీ.... అతను అప్పుడప్పుడు నీలిరంగు కోటు వేసుకుని గ్రే కలర్ ప్యాంట్ లెదర్ షూస్ కట్టుకుని టైతో బైక్ మీద వెళుతూ కనిపించేవాడు. టూ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో ఉంటున్నవాళ్లు అలాంటి కోటు వేసుకోవడం ఏమిటో తెలియలేదు. ఆమె రోజూ వాకింగుకు కిందకు దిగినప్పుడల్లా పొద్దున కానీ సాయంత్రం కానీ వాచ్మెన్నో సెక్యూరిటీ గార్డ్నో ఏదో ఒకటి అనకుండా పైకి వెళ్లేది కాదు. అలా వాళ్లు అందరికీ తెలుసు. సుకీ వల్ల కూడా. మూడు నెలల వయసులో కార్ పార్కింగ్ దగ్గర అది సిట్ అంటే కూచుంటూ స్టాండ్ అంటే నిలబడుతూ అందరికీ కనిపించింది. చిన్న చిన్న బిస్కెట్లను ఇంకా చిన్న ముక్కలు చేసి అలా గాల్లోకి ఎగరేస్తే ఒక్కటి కూడా కింద పడకుండా నోట కరుచుకుని మరొక ముక్క కోసం కళ్లల్లో కళ్లు పెట్టి చూసేది. ముద్దుగా ఉండేది. ఎవరితోనైనా స్నేహం చేసేలా అనిపించేది. ఫ్లాట్స్‌లో కుక్క ఏమిటండీ అని వాళ్లూ వీళ్లూ అన్నారు. ఆమె సమాధానం చెప్పే పని కూడా పెట్టుకోలేదు. రోజూ ఆమె సుకీతోనే కనిపించేది. మంచి బెల్ట్ వేసి కుడి చేత్తో పట్టుకుని... ఆరు నెలల వయసుకు వచ్చి అది గునగున నడుస్తూ ఉంటే ఆమె అలా హైవే వరకూ వెళ్లి వచ్చేది. పిల్లలు ఆమెను చూసి భయపడేవారు. కాని సుకీకి కాలక్షేపంగా ఉంటుందని ఆమె వాళ్లను దానితో ఆడుకోనిచ్చేది. వాళ్లు ఉత్సాహంగా బిస్కెట్లో మరోటో పట్టుకుని వచ్చేవారు. మా గాడ్దికి తిండి యావ ఎక్కువ. లాబ్రడార్ కదా. బాగా తింటుంది. పెట్టండి అనేది. అది ఖరీదైన కుక్క అని అన్నారు. కొనాలంటే కనీసం ఇరవై వేలు ఉంటుందని చెప్పారు. కాదు ఎవరో తెలిసినవాళ్లు ఇస్తే తెచ్చుకుని ఉంటారు అని కూడా వినబడింది. దీని ఖర్చు నెలకు ఎంత లేదన్నా వెయ్యీ పదిహేను వందలు ఉంటుందట. ఇవి కాకుండా వాక్సిన్లు మందులూ జీర్ణానికి టానిక్కులూ డాక్టర్ విజిట్ కోసం ఆటోలో వేసుకొని వెళ్లడానికి అదొక ఖర్చూ... అయితే ఆమె అదంతా పెద్ద పట్టించుకున్నట్టు కనపడేది కాదు. కొడుకు ఈ మధ్యే ఏదో ప్రయివేట్ బ్యాంక్‌లో చిన్న ఉద్యోగానికి చేరాడట. ఇంట్లో దాదాపు ఉండడు. కూతురు పెళ్లయి వెళ్లిపోయిందని అంటారు. ఇది నా కొడుకు. ఇదుంటే చాలు అంటుంటుంది ఆమె. సుకీ ఆమెను వదలదు. ఉదయం ఏడింటికి నిద్ర లేచి బద్దకంగా కన్ను తెరిస్తే ఈమె కనిపించాలి. లేకుంటే అపార్ట్మెంట్ మొత్తం ఊగేలాగా గోల చేసేస్తుంది. ఈమె కిచన్లో ఉంటే ఏం వండుతున్నావే అన్నట్టుగా అక్కడే ఉంటుందట. బట్టలు తెచ్చుకోవడానికి టై మీదకు వెళ్లాలన్నా తోకలాగా వెంట తీసుకువెళ్లాల్సిందే. ఎప్పుడూ పక్కన కూచుంటుంది. రెండు బుగ్గలకూ మూతిని తాకిస్తుంది. ఇంట్లో మాట్లాడ్డానికి మనిషి లేక కబుర్లు చెబుతూ ఉంటే చెప్పుకోవే అన్నట్టు వింటూ ఉంటుంది. దానికి ఆమె గురించి పట్టింపులు జాస్తి. అన్నం తినక ఏ పనుల్లోనో పడి మర్చిపోతే తిను అని గద్దించి చెప్తుంది. టీ టైమ్ గుర్తు చేస్తుంది. సాయంత్రం కిందకు తీసుకువెళితే పిల్లలందరితో రండ్రా చిన్నయ్యలూ అని దానికి ఎంత ఆటో. సైకిళ్లు తొక్కే పిల్లలను ఓడిస్తుంది. ప్రేమగా తాకే పిల్లలను మాటా పలుకూ లేకుండా ముచ్చటగా చూస్తూ తోక ఆడిస్తూ ఉంటుంది. తొమ్మిది నెలలు వచ్చేసరికి పెద్దవాళ్లకు కూడా ఫ్రెండ్ అయిపోయింది. కొందరు పొద్దున దానిని చూస్తారు. కొందరు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు పలకరిస్తారు. కొందరు రాత్రి నిద్రకు ముందు పచార్లకు దిగినప్పుడు దానికి గుడ్ నైట్ చెప్పి చెయ్యూపుతూ నవ్వుతూ ఫ్లాట్లలోకి వస్తారు. ఎంత అలవాటు అంటే ఆఖరకు దాని కోసం సుకీ ఎక్కడండీ అని ఆమెతో మాట్లాడటానికి కూడా సిద్ధమైపోయారు. అయితే సుకీ కూడా ఆమెను బాగా గడబిడగా ఉంచేది. బాత్రూమ్ బయట ఉంచిన స్లిప్పర్లను చీల్చి అవతల పారేసేది. దిండును నోట కరుచుకుందంటే ఎంత లాగినా దిండు చిరగాల్సిందే తప్ప అది పట్టు వదలదు. ఆకలేస్తే అడగొచ్చుగా. ఊహూ. ఒక్కోసారి కుర్చీ మీద లంఘించి అక్కణ్ణుంచి డైనింగ్ టేబుల్ మీదకు దూకి గిన్నెలు దొర్లించి... ఆ...య్... సుకీ... అని గట్టిగా కేకలేస్తే చాలు. ఇంకంతే మూలకు వెళ్లి దన్‌మని పడి పోతుంది. ఉలకదు. పలకదు. పోవే టక్కరిదానా అని ఆమె కూడా లెక్క చేయకుండా ఉంటుంది. అతనుంటే కాసేపు సరదా కోసం దానిని బతిమిలాడేవాడు. పట్టించుకోదు. కొడుకు ఉంటే బుజ్జగించేవాడు. కన్నెత్తి కూడా చూడదు. ఇక చూసి చూసి ఆమే వచ్చి సరేలే... రా... తిను... అని కాస్త పెరుగన్నం కలిపి తినిపించడానికి కూచుంటే అది కాళ్లూ చేతులు వెల్లికిలా పడేసి... సారీ... సారీ... అని ముఖం ప్రసన్నంగా పెట్టేదాకా మారాం చేస్తుంటే ఆమె నవ్వుతూ నువ్వొకదానివి దాపురించావే నా ప్రాణానికి అని కళ్ల చివర తుడుచుకునేది. నిన్ను వదిలి బతగ్గలనా అని దగ్గరకు తీసుకునేది. కాని- అలాంటి సందర్భం వచ్చి పడింది. స్టేట్ డివైడ్ అయ్యాక అతడి పరిస్థితి కొంచెం బాగ లేదు. రియల్ ఎస్టేట్‌లో అతను చేసే మార్కెటింగ్ ఫీల్డ్ దెబ్బ తినిందట. మరి ఇక్కడ ఇబ్బంది వచ్చిందో అక్కడ ఇబ్బంది వచ్చిందో ఈ రాజధానికీ ఆ రాజధానికీ క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నా ప్రతిఫలం లేదు. ఇంటి లోను ఒకటి కట్టాలి. ఖర్చులు చూడాలి. ఏవో చిన్నా పెద్ద అప్పులు ఉన్నట్టున్నాయ్. అవి తీర్చాలి. ఇక ఇలాగే ఉంటే అవదని బయటకు వెళ్లి ఏదో ఒకటి చేయాలని ఆమె నిశ్చయం తీసుకుంది. మరి సుకీ? మనిషి లేని ఇంట్లో అది క్షణం కూడా ఉండలేదు. ఉత్త బెదురుపోతు. లోపల పెట్టి తాళం వేసి పోతే మొరిగీ మొరిగీ సాయంత్రం లోపల ఠారున చచ్చిపోతుంది. పర్లేదు... నా ఫ్రెండ్ ఉన్నాడు. ఇస్తానంటే వచ్చి వాళ్లూరు తిసుకెళతానంటున్నాడు. మన పరిస్థితి బాగు పడ్డాక తెచ్చుకుందాం అన్నాడతను. దాని మీద రెండు వారాలు నాలుగు వారాలు పెద్ద పెద్ద చర్చలు... ఏడుపులు అయ్యాయి. సరే... కనీసం ఆరు నెలలు అని ఒప్పందం కుదిరింది. స్నేహితుడు వచ్చాడు. కారులో తీసుకెళ్లిపోయాడు. మూడో రోజుకల్లా ఆమె మంచం పట్టింది. సుకీ... సుకీ... అన్నం మానేసింది. రెప్ప మూతపడితే నిద్రలో దాని కలలు. మంచం పక్కన రోజూలాగే పడుకుని ఉందేమో అన్నట్టుగా పదేపదే ఉలికిపడుతూ లేచి చూసేది. కాని అది ఎందుకు ఉంటుంది? అది నా కోసం ఏడుస్తూ ఉంటుందండీ... నేను లేకపోతే బతకదండీ... ఎంత ఏడ్చినా ఏం లాభం. ప్రస్తుతానికి పరిస్థితి అది. రెండు మూడు వారాలు గడిచాయి. మెల్లగా ఆమె అప్పుడప్పుడు కింద కనిపించడం మొదలుపెట్టింది. పిల్లలను చూసి తల దించుకుని వెళ్లిపోతూ ఉండేది. పెద్దవాళ్లతో కూడా ఏదో మొహమాటపు పలకరింపే. మొన్నొక రోజు రాత్రి కింద సుకీ ఇష్టంగా కూచునే మొక్కల దగ్గర కూచుని ఆమె ఎంతసేపటికీ కదల్లేదు. గేట్లు వేసేసే టైమ్ వచ్చినా కదల్లేదు. భర్త చూసి చూసి కిందకు వచ్చాడు. ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తావు? ఆమె పసిపిల్లలా చూస్తూ మెల్లగా ఏడవడం మొదలుపెట్టింది. పాపిష్టిదాన్ని... బిడ్డలాగా పెంచి చేతులారా సాగనంపాను... దాని ఉసురు పోసుకున్నాను. ఒసే గాడిద్దానా... నేనింక నిన్ను సాకలేను వాళ్ల పంచనా వీళ్ల పంచనా పడి బతుకమ్మా... ఇంక నన్ను వదిలిపెట్టు అని నిజం చెప్పేసి ఉంటే అది అంతా అర్థం చేసుకుని అలాగే అంటూ నా కళ్లవైపు కూడా చూడకుండా వెళ్లిపోయేదేమో. కాని మోసం చేశాను. పోవే... అంకుల్ వాళ్లతో అలా షికారుకు పోయిరా అని అబద్ధం చెప్పి పంపించాను. తర్వాత ఎంత కంగారు పడి ఉంటుందో. ఎంత బెదిరిపోయి ఉంటుందో. ఇంత నమ్మకద్రోహం చేస్తావా అని నా మీద కోపం పెట్టుకుని ఎంత అలిగి ఉంటుందో. అయ్యో... నేనెప్పుడు కనపడేది... దాని అలక ఎప్పుడు తీర్చేది... టక్కరిది టక్కరిది అని పిలిచేదాన్నే.... అసలైన టక్కరిదాన్ని నేనే కదా... ఏమీ రాద్ధాంతం చేయకుండా చాలా లోగొంతుకతో ఆమె పొగిలి పొగిలి ఏడుస్తూ ఉంటే ఆ గిల్ట్ ఈ జన్మకు సరిపడినదా అనిపించింది. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
నల్ల కాలర్...
ఆటో తెలిసిపోతూ ఉంది. వెనుక కూర్చుంటే సీట్ మాటిమాటికీ కదిలిపోతూ ఉంది. మీటర్ లేదు. మోత ఒకటి. దానికి తోడు గాలికి వేళ్లాడుతూ నల్లగా మురికిగా అసహ్యంగా ఉన్న ఆ షర్ట్ కాలర్. ఆటో నడుపుతూ ఖాకీషర్ట్ను వీపు ఆన్చుకునే సపోర్టింగ్ రాడ్ మీద అటు ఇటుగా పడేసి దానికి ఒత్తుకుని కూచుని ఉన్నాడు. అటు సగం కనిపించడం లేదు. ఇటు సగం మాత్రం వెల్లికిలా వేలాడుతూ కుదుపులకు ఊగుతూ ఊగినప్పుడల్లా నలుపెక్కిన కాలర్ని బహిర్గతం చేస్తూ ఉంది. ఆ చొక్కా చాలాకాలంగా ఉతకడం మర్చిపోయినట్టుగా ఉంది. అంగుళం వదలకుండా ముడుతలతో నిండిపోయింది. మరీ ముఖ్యంగా ఆ కాలర్- చారలు పడి, కాటు తేలి, నూనె దిగినట్టుగా ఉబ్బిపోయి, తేమ స్థిరపడిపోయి... దానిని తొడుక్కుంటారా ఎవరైనా? కనీసం ఆ కాలర్ని చూస్తూ చూస్తూ ఒంటి మీదకు వేసుకుంటారా ఎవరైనా? ఆ దారిలో ఆటోలు దొరకవు. వెళ్లాల్సిన దారి చెప్తే అసలుకే దొరకవు. ఇది దొరికింది. ఎంతిమ్మంటావ్? ఎంతోకొంత చూసుకుని ఇవ్వండి సార్. ఎటు నుంచి తీసుకెళ్తావ్? ఎటువైపో చూసుకొని మీరే చెప్పండి సార్. రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకుని ఉన్నాడు. చెమట పట్టిన కళ్లతో చూస్తూ ఉన్నాడు. కుట్టించిన ప్యాంట్... ఎర్రగడ్డ బూట్లు... హ్యాండిల్ మీద ఒక వైఖరి లేనట్టుగా ఉన్న చేతి వేళ్లు... పొట్ట దాదాపుగా లేదు. అసలు ఉందో లేదో. రాత్రి బాగా వాన పడినట్టుంది కదా. ఏమో... పడినట్టే ఉంది సార్. స్టేట్ డివైడ్ అయ్యాక ట్రాఫిక్ తగ్గలేదనుకుంటా. ఏమో... తగ్గలేదనుకుంటా సార్. సడన్‌గా ఆటో స్లో చేసి పక్కకు తీసుకొని అసలు ఏమాత్రం పట్టింపు లేనట్టుగా చాలా అలవాటైన పనే అన్నట్టుగా దాని వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఖాకీ షర్ట్ తీసి తొడుక్కున్నాడు. దాని మురికి అంటకుండా టీషర్ట్ అతణ్ణి కొంచెం కాపాడింది. కాని మెడ బోసిగా ఉండటం వల్ల కాలర్ వెళ్లి సరిగ్గా అక్కడే అంటుకు కూచుంది. ఒంటి మీద ముళ్లు వచ్చాయి. చేసేది లేదు. ఆటో మళ్లీ కదిలింది. పోలీసులు కనిపిస్తే ప్రాబ్లం సార్. యూనిఫామ్ లేదని ఫైన్ రాస్తారు. వచ్చిన ఆ కాస్తా దానికే పోతుంది. ఎంత సంపాదిస్తావ్? ఎంత సార్. పెట్రోలూ కిరాయి పోను రోజుకు నాలుగొందలు మిగిలితే ఎక్కువ. తెల్లారి నాలుక్కు లేస్తా. పదకొండు దాకా తోల్తా. ఇద్దరు చిన్నపిల్లలు. నా భార్య పనికి పోతుంది. అదొచ్చే దాకా ఇంట్లోనే ఉండిపోతా.ఆటో నీలుగుతూ ఉంటే ఆ సంగతి పట్టించుకోకుండా టకాపకా గేరు మారుస్తూ మళ్లీ అన్నాడు. అది కూడా పెద్దగా ఏం తేదు సార్. గ్యారంటీ లేని పని. ఒకరోజు ఉంటుంది. ఒకరోజు ఉండదు. మేస్త్రిని బట్టి. రోజంతా చేస్తే సాయంత్రానికి కమీషన్ పట్టుకుని రెండొందలో రెండొందల యాబయ్యో ఇస్తారు. అవైనా నిలుస్తాయా? డాక్టర్ తింటాడు. బస్తీలో ఉంటాం గదా సార్. నీళ్లు తాగితే చాలు బిడ్డలకు జ్వరాలు వచ్చేస్తాయ్. అవేం నీళ్లో ఏమో. ఫోన్ మోగింది.చూసుకున్నాడు. ఎత్తలేదు. నా భార్యకు ఏదైనా పనుంటే చెప్పండి సార్. ఫ్యాక్టరీ పని. చురుగ్గా చేస్తుంది. మళ్లీ ఫోన్ మోగింది.చూసుకున్నాడు. ఎత్త లేదు. మళ్లీ మోగుతుంటే ఎత్తి-ఇదిగో తమ్ముడూ... తప్పూ... తెల్లారి ఒకసారి చేశావ్. చెప్పావ్. మళ్లీ మళ్లీ చేస్తున్నావ్. అలా చెయ్యొద్దు. పెట్టెయ్. ఫోన్‌ని పై జేబులో పడేసి హ్యాండిల్ మీద చేయి ఉంచాడు. ఆటో నత్తులు కొడుతూ పోతూ ఉంది. మెట్రో పని ఎక్కడికక్కడ దారి నిలువరిస్తూ ఉంది. మళ్లీ ఫోన్ మోగింది. ఎత్తాడు. ఏయ్ బాబూ... ఏంటి... ఏంటమ్మా... దాని సంగతి నీకెందుకు చెప్పూ... తోటి పనోనివైతే నీ పని నువు చేసుకో... పైసలు తీసుకుని ఇంటికి పో... అంతేగానీ... ఆ... ఏంటి... ఆ మేస్త్రిని ఏమనకు. మంచోడు. అన్న లెక్క. పనిలో ముందూ వెనుకా అయ్యి లేటైనా ఇంటి దాకా వచ్చి దించేసి పోతాడు. సొంత మనిషి. ఏంటి... ఆ... ఏయ్... ఇంక మాట్లాడకు. పెట్టేశాడు. యాక్సిలేటర్ పెంచాడు. గోలలో ఏదో గొణుక్కున్నాడు. మళ్లీ ఫోన్ మోగింది. ఆలోచించాడు. మళ్లీ మోగింది. విసురుగా తీశాడు.... ఏంటబ్బాయ్.... ఏంటి... తెలుసుకోవాలా? ఏం తెలుసుకోవాలి. ఇంకొక్కసారి చేశావంటే చెప్పుతో కొడతా.... అసలెక్కడున్నావ్ నువ్వు... ఉండొస్తున్నా... నీ ... ఈసారి అటువైపు కట్టైపోయింది. కొంచెం గస పోశాడు.ఏమైంది? ఎవడో ఎదవ సార్. నా భార్య గురించి నోటికొచ్చింది వాగుతున్నాడు. ఆ మాట అని అంతకుమించి మాట్లాడకుండా చాలాసేపు ఆటో నడపడం మీదే ధ్యాస పెట్టాడు. మధ్య మధ్య ముఖం తుడుచుకుంటూ ఉన్నాడు. మెల్లగా గొణుక్కుంటూ ఉన్నాడు. ఆటో ఎత్తెత్తి వేస్తుంటే మెడ దగ్గర పట్టిన చెమట కాలర్లోకి ఇంకిపోతూ ఉంది.ఇంకొక్క ఫర్లాంగ్. దిగాల్సిన చోటు వచ్చేస్తుంది. మార్పు తెలుస్తూ ఉంది. ఎవరితో ఒకరితో చెప్పేసుకోవాలి. మెడ పక్కకు తిప్పుతూ ఆగలేనట్టుగా అనేశాడు. ఏదో తెలుసుకోవాలట సార్ నేను. వాడి దగ్గరకు వెళితే ఏదో తెలియచేస్తాడట. ఏం తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి. నాకు తెలిసింది చాలదా? ఈ లోకం చాలా కతర్నాక్ది. ఇక్కడ బతకడం చాలా కష్టం. రోజూ పని చేసి నాలుగు రూపాయలు సంపాదించింది పెళ్లాం బిడ్డల పొట్ట పోసి ప్రాణాలు కాపాడుకోవడం ఇంకా కష్టం. ఆ ఒక్క సంగతి నాకు బాగా తెలుసు సార్. అది తెలిస్తే చాలదా? వేరేవి కూడా తెలియాలా? తెలుసుకొని ఏ నెత్తిన పెట్టుకునేది నేను... అరె.... బతుకుదాం అంటే బతకనివ్వరేం సార్.. ఎలాగోలా బతుకుదాం అంటే బతకనీరేం?... గొంతు ఒణుకుతూ ఉండగా చేతులు కంపిస్తూ ఉండగా ఆటో ఆపి షర్టు విప్పి సపోర్టింగ్ రాడ్ మీద పడేసి దాని వైపు చూడనైనా చూడకుండా మాట్లాడుకున్న డబ్బు కోసం నిలుచున్నాడు. నల్లగా మురికిగా అసహ్యంగా ఉన్న ఆ కాలర్ యధావిధిగా వేలాడుతూ గాలికి అటూ ఇటూ ఊగుతూ ఉంది. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
డిస్టెన్స్
మెట్రో కథలు బాస్ పిలిస్తే లోపలికెళ్లి బయటకు వచ్చాక మళ్లీ ఒకసారి కాల్ చేసి చూశాడు. స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. సీట్లో కూచుని సెల్ వైపు చూసుకుంటూ తిరిగి కాల్ చేశాడు. స్విచ్డ్ ఆఫే. టైమ్ పదకొండు అవుతోంది. సాయంత్రం ఆరుకు ఆఫీస్ అయిపోతే ఏడుకు ఇల్లు చేరేదాకా ఈ నరకం తప్పదు. ఉదయం బయలుదేరే ముందు చిన్నగా మాటా మాటా పెరిగింది. సాయంత్రం వచ్చి తీసుకెళతారుగా అంది. చూద్దాం అన్నాడు. చూద్దాం ఏంటి? రెట్టించింది. చెప్తానన్నాగా. నువ్వు రెడీ అయి కూచుని నా ప్రాణం తీయకు. ఆ మాట చెప్పి టూ వీలర్ ఎక్కి ఆఫీసుకు వచ్చేశాడు. అయితే అలా టూ వీలర్ ఎక్కి ఆఫీసుకు వచ్చేయడం అంత సులభం కాదు. ఏ రోజూ సులభం అవగా చూళ్లేదు. ట్రాఫిక్ ఉంటుంది. సిగ్నల్స్ దగ్గర చాలాసేపు వెయిటింగ్ ఉంటుంది. మధ్యలో పోలీసులు ఎందుకాపేస్తారో తెలియదు, పదీ పదిహేను నిమిషాలు అందరినీ ఆపేసి ఎవరికో దారి వదులుతారు. బాగా నిండిన మురుగు కాలువ అతి మెల్లగా కదిలినట్టు ఒక్కోసారి ఎంత విశాలమైన రోడ్డైనా బండ్లతో నిండిపోయి నల్లటి పొగ వదులుతూ అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదులుతుంటుంది. ఓ కారు దాదాపు డ్యాష్ ఇస్తూ ముందుకుపోతుంది. యూ టర్న్ దగ్గర ఎవడిదో బైక్ మీదమీదకు వచ్చేస్తుంది. చాలా అదృష్టం కలిసి రావాలి. ఆఫీసుకు అప్పుడు చేరాలి. ఎవరో ఒకరు సెక్షన్లోనో క్యాంటీన్లోనో స్మోక్రూమ్లోనో మరొకరిని అడుగుతుంటారు- ఎక్కడ ఉంటున్నావ్? ఏదో ఒక ఏరియా చెప్తారు. అక్కడా? అంత దూరమా? అబ్బే... ఏం దూరం... అరౌండ్ ఫిఫ్టీన్. ఈ అరౌండ్ అనే మాటకు ఎవరి లెక్క వారికుంటుంది. అదనం రెండు కిలోమీటర్లు కావచ్చు. అదనం ఐదు కిలోమీటర్లు కావచ్చు. అదనం పది కిలోమీటర్లు కూడా కావచ్చు. పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్నా అరౌండ్ ఫిఫ్టీన్ అనే చెప్తారు. మరేం చేస్తారు? మంచి ఆఫీసే. చెప్పుకోదగ్గ జీతం అంటే పద్దెనిమిది నుంచి పాతికవేల వరకూ ఉంటుంది. ప్రతి నెలా పదో తేదీకల్లా ఇచ్చేస్తారు. ఒకవేళ పది ఆదివారం అయితే తొమ్మిదిన- శనివారమే పడిపోతాయి. మరి జీతం సరిగ్గా ఇస్తున్నప్పుడు పద్ధతులు సరిగ్గా ఆశించడంలో తప్పు లేదు. టైముకు రావాలి. నెలకు ఒక సెలవు వాడుకోవాలి. లేటొచ్చినా ఆబ్సెంట్ అయినా శాలరీ కట్కు అంగీకరించాలి. అందువల్ల అందరూ జాగ్రత్తగా పని చేస్తారు. బడ్జెట్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. పదీ పదిహేను కిలోమీటర్ల అవతలకు వెళ్లి- అన్నీ కలిపి ఐదున్నరా ఆరులో అయిపోయేలాగా ఒక పోర్షన్ తీసుకుని- జాగ్రత్తగా ఉండిపోతారు. అయితే ఇలాంటి సందర్భాల్లోనే వస్తుంది సమస్య. ముందు రోజు రాత్రే గుర్తు చేస్తూ అంది. శిల్పారామం సంప్రదాయవేదికలో రేపు సాయంత్రం మావాళ్ల పెళ్లి. కార్డు చూశారుగా. అంత ఇదిగా వచ్చి పిలిచి వెళ్లాక వెళ్లకుండా ఉంటే ఏం బావుంటుంది. ఏం జవాబు చెప్పలేదు. దిండు మడిచి తల కింద సర్దుకుంటూ నిద్రపోయాడు. రెండు వారాల క్రితమే ఊళ్లో ఏవో కొంపలంటు కున్నాయంటే పోయేసి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ లీవ్ పెట్టలేడు. ఒకవేళ పెడదామన్నా సాయంత్రం ఫంక్షన్ అయితే ఇప్పట్నించి ఇంట్లో ఉండి లీవ్ వేస్ట్ చేయడం ఎందుకు అంటుంది. గంట ముందు పర్మిషన్ అంటే అదో పెద్ద తతంగం. ఇక ఆరుకు బయట పడి, ట్రాఫిక్ అంతా దాటి, అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకుని, గొంతులో టీనీళ్లైనా పోసుకోకుండా భార్యనూ పిల్లలనూ తీసుకొని తిరిగి ముప్పై కిలోమీటర్లు ట్రాఫిక్‌లో పడి, శిల్పారామం చేరుకుని.... ఇదా బతుకు... బస్సుల్లో తిరగలేరు. ఆటోలను భరించలేరు. టూ వీలర్ నడపలేరు. చెప్తే అర్థం కాదా? హూ. మీరు ఏ రోజు సుఖపెట్టారు కనుక. నిజమే. ఆదివారం వస్తే నాలుగు వీధుల అవతల ఆమె చెల్లెలి ఇల్లు ఉంది అక్కడకు తీసుకెళ్లి పడేస్తాడు. దగ్గరలో పాత థియేటర్ ఉంది. సినిమా చూపించేస్తాడు. మూడు నెలలకు ఒకసారి పిల్లలరైలు తిరిగే ఎగ్జిబిషన్ పెడతారు. తీసుకెళ్లి తీసుకొచ్చేస్తాడు. కాని సిటీలోకి మాత్రం రాడు. అది ఆమెకు విసుగు. ఇవాళైనా అంత గట్టిగా పట్టు పట్టేది కాదు. ఆమె బంధువుల్లో వీళ్లే కాస్తంత కలిగిన వాళ్లు. చూడు... శిల్పారామంలో పెళ్లి చేసేంత స్తోమత మా వాళ్లకూ ఉంది చూడు అని చూపిద్దామని తాపత్రయం. అదీగాక ఈ మధ్యే రెండు వేలు పెట్టి ప్యారెట్గ్రీన్ పీకాక్బ్లూ కాంబినేషన్లో అనార్కలి డ్రస్ కొంది. లక్కీగా స్టిచింగ్ కూడా కుదిరింది. అది వేసుకు చూపించాలని కోరిక. పెళ్లంటే ఈ మధ్య కనీసం డెబ్బై రకాల వంటకాలైనా పెడుతున్నారు. మీల్మేకర్ రైస్... బేబీ కార్న్ దమ్ బిర్యానీ... తమ సంగతి ఏముందిగానీ పిల్లల నోటికి కాస్తంత అందివ్వచ్చు కదా. ఒక పూట వంట తప్పుతుంది. అన్నింటి కంటే ముఖ్యం- ఈ బందిఖానా నుంచి కాసేపైనా బయటపడొచ్చని ఆశ. కానీ... పిల్లల్ని కూచోబెట్టుకుని అంతంత దూరం పోకూడదు. ఇన్ని మాటలు ఎందుకు? ఇష్టం లేదని చెప్పెయ్యండి. సిటీలో టూ వీలర్ నడపడం ఎంత రిస్కో ఆడవాళ్లకు అర్థం కాదు. ముందు పెద్దాణ్ణి కూచోపెట్టుకుని వెనక పిల్లదాన్ని ఒళ్లో పెట్టుకుని... మొత్తం నాలుగు ప్రాణాలు... క్షణం కూడా గ్యారంటీ లేదు. అదీగాక వెళ్లేటప్పుడు పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. వచ్చేటప్పుడు నిద్రపోతారు. చాలాసార్లు అయ్యింది. పెద్దాడు అలా తూగుతూ ట్యాంక్ మీద వాలిపోయి నిద్రలో ఎక్కడ జారిపోతాడో అని దడ రేపి... కాని వినదు. మళ్లీ ట్రై చేశాడు. స్విచ్డాఫ్. ఇక ఫోన్ తీయదు. తీయకపోతే పోయింది ఆ కోపంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అల్లరి చేస్తుంటే నాలుగు పీకుతుంది. ఒకసారి ఇలాగే సోఫాలో నుంచి పెద్దాణ్ణి లాగి కిందకు పడేసింది. ఆ సంగతి తెలిసి రెండు రోజులు గుండె గుబగబలాడింది. ఆమె చెల్లెలికి ఫోన్ చేశాడు. ఇక్కడికి రాలేదు బావా. ఇందాక అటువైపు వెళుతూ చూశాను. ఇంట్లో కూడా లేదే. మెల్లగా కడుపులో మంట మొదలయ్యింది. ఈ మధ్య ఇంతే అవుతోంది. టెన్షన్ వస్తే ఎసిడిటీ పెరిగిపోతోంది. గడియారం వైపు చూశాడు. టైమ్ చాలా ఉంది. ఎప్పటికి సాయంత్రం కావాలి? ఎప్పటికి ట్రాఫిక్ దాటాలి? ఎప్పటికి ఇంటికి చేరాలి? చేరి ఇంట్లో ఏం చూడాలి? సెల్ పట్టుకుని వెనక్కి వాలాడు. మంట ఛాతీని గుంజుతూ ఉంది. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
రొటీన్...
మెట్రో కథలు నిన్నటి వరకూ ఆమె రొటీన్లో మార్పు లేదు. ఉదయాన్నే ఐదుంపావుకు సరిగ్గా ఎవరో తట్టి లేపినట్టుగా లేచి కూచుంటుంది. మరో నాలుగైదు నిమిషాల్లో టీ పెట్టుకుని బాల్కనీలో- అక్కడ కూచుంటే కింద నుంచి బాగా ఆకులేసిన బొప్పాయి చెట్టు కనిపిస్తుంది- దానిని చూస్తూ కూచుంటుంది. ఐదున్నర నుంచి ఆరువరకు ప్రాణాయామం. ఆరుకు పాపను లేపిందంటే, దానికి బ్రష్ చేయించి, బ్రేక్‌ఫాస్ట్ పెట్టి, మళ్లీ స్నాక్స్ కోసం కాసింత న్యూటెల్లా రాసిన బ్రెడ్ ముక్కలు డబ్బాలో కూరి, యూనిఫామ్ తొడిగి, ఏడున్నరకు బస్ ఎక్కించేదాకా తీరదు. ఆ తర్వాత ట్రాక్ ప్యాంట్ వేసుకొని పైన టీషర్ట్ లాక్కుని లిఫ్ట్‌లో కిందకు దిగి అలా హైటెక్ సిటీ వరకు సైక్లింగ్‌కు బయలు దేరిందంటే ఎనిమిదిన్నర వరకూ అది తన టైమ్. పదిన్నరకు ఆఫీస్. సాయంత్రం నాలుక్కు పాప వచ్చే సమయానికి ఇల్లు. కాస్త డబ్బు ఎక్కువే అయినా జె.ఎన్.టి.యులో ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కున్నప్పటి నుంచి ఆమెకు స్థిమితంగా ఉంది. కొత్త కన్స్ట్రక్షన్. మంచి అమినిటీస్. ఒక గడపకూ మరో గడపకూ సంబంధం లేనట్టుగా ప్రైవసీ. అందరికీ ఐ.డి. కార్డ్స్. అవి చూపితే తప్ప ఎంట్రీ ఇవ్వని సెక్యూరిటీ... చెప్పాలంటే ఇక్కడికొచ్చాక భర్తే కాపాడాలి అనే భయం దాదాపు పోయింది. త్రీ బెడ్రూమ్స్ ఉన్న ఆ ఫ్లాట్‌లో ఒక బెడ్రూమ్లో భర్త ఉంటున్నాడు. ఆరు నెల్ల క్రితం ఒకరోజు నేను ఆ రూమ్‌లో పడుకుంటాను అన్నాడు. పడుకో అంది. అంతే. వాదన పెట్టుకోలేదు. అతడి కోసం ఆమె చాలా మారింది. ఇది కూడా పెద్ద మార్పే. కొత్తల్లో పెద్ద పెద్దగా వాదనకు దిగేది. ఇప్పుడు ఏ విషయాన్నైనా చిన్న గొంతుతో అంతే తీవ్రంగా చెప్పడం నేర్చుకుంది. చిన్నప్పటి నుంచి రెండు వదలొద్దనుకుంది. ఒకటి సైక్లింగ్. రెండు ఉద్యోగం. రెంటినీ వాళ్లూ వీళ్లూ వద్దన్నా తండ్రి లెక్క చేయలేదు. భర్త లెక్క జేస్తాడని అనుకోలేదు. ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు అని ముందే చెప్పేయాల్సింది. కాని చెప్పలేదు. చేసుకున్నాడు. చక్కగా ఉద్యోగం చేస్తుంది. చక్కగా ఇల్లు చూసుకుంటుంది. చక్కగా పాపనూ. చక్కగా మొగుణ్ణీ. అయినా చాల్లేదు. ఇంట్లో ఫోన్లు తగ్గించు అన్నాడు ఒకరోజు. మగాళ్లతో మాటలు తగ్గించు అన్నాడు ఇంకోరోజు. క్యాంపులు తగ్గిస్తే మంచిది అని మరో రోజు. ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇళ్లకు చేరే ఆడవాళ్లంటే భయం ఉండదు చాలామందికి. కాని ఆఫీస్ పని మీద ఒక్కరోజైనా సరే ఊరెళ్లొచ్చే ఆడవాళ్లంటే మాత్రం భయం. ఏం... చేయాలంటే అక్కడే చేయలా? ఇక్కడ చేయకూడదా? సరే ఎందుకొచ్చిన గొడవ అని క్యాంపులు డ్రాప్ చేసింది. అతడు చూస్తుండగా ఫోన్లూ మానేసింది. నిజానికి తన టాలెంట్‌కు ఎక్కడో ఉండాలి. కుటుంబం కోసం కుదించుకుంది. తృప్తి లేదు. ఏం చేయాలి? చూడ్డానికి బావుంటుంది. నవ్వితే బాగుంటుంది. ఇదంతా నీ కోసమే. సత్యంగా నీ కోసమే. ఊహూ. నమ్మకం లేదు. పెళ్లయినప్పటి నుంచి గమనిస్తోంది. ఎప్పుడు పక్కన పడుకున్నా మధ్యలో వేరెవరో వచ్చి పడుకోవాలి అన్నట్టుగా ఎడం ఇచ్చి పడుకుంటాడు. అసలు ఎప్పుడైనా సంపూర్ణంగా హృదయంలోకి తీసుకున్నాడా అని. పెళ్లికి ముందు, తర్వాత ఎంతో హుషారుగా, దుముకుతున్నట్టుగా ఉండేది. తను స్తబ్దుగా అయ్యే కొద్దీ తానూ స్తబ్దుగా అయిపోతూ వచ్చింది. ఆ రూపూ.. ఆ ఆకారం.. మొన్నొకరోజు కలీగ్ బలవంతంగా కళ్లజోడు తీయించింది. చూడు. కళ్ల కింద ఎంతెంత పెద్ద చారలు ఉన్నాయో. నువ్వు సంతోషంగా లేవు కదూ. ఏం చెబుతుంది? ఇంకెవరో బంధువు అసలు గుర్తు పట్టనే లేదు. చాలా పొడవైన జుట్టు ఉండేది తనకు. పూర్తిగా బాయిష్ లుక్‌లో హెయిర్ కట్ చేయించుకుంది. చీరలు, చుడీదార్లు.... చాలా బాగుంటాయి. పూర్తిగా మానేసి ప్యాంట్ షర్ట్స్‌లో దిగిపోయింది. లిప్‌స్టిక్... కాటుక... వద్దనే వద్దు. నాకు పని చేయడం ముఖ్యం... బయటి ప్రపంచానికి నేను మగాడి కిందే లెక్క... వేరే ఏ బేరాల్లోనూ ఇంట్రెస్టు లేదు.... హ్యాపీగా ఉందా... ఊహూ. దిలాసా లేదు. ఇంకా ఏం చేస్తే మారుతాడా అని అలోచించి ఆలోచించి, తన ఎద ఎత్తుగా ఉంటుంది, సర్జరీ చేయించి అణిచేద్దామా అని డాక్టర్ దగ్గరకు వెళితే మీ మైండ్ ఖరాబ్ అయ్యింది వెళ్లండి అని పంపించేశాడు. డాక్టర్‌కు ఏం తెలుసు? ఈ ఖరాబును తాను భరించగలదు. కాని ఇతడి కోసం పని మానేసి ఇంట్లో కూచుంటే పూర్తిగా పిచ్చిదైపోతుంది. అయినా ఎందుకు మానేయాలి? ఆడవాళ్లు పనికే కదా పోతున్నారు. ఊళ్లోవాళ్లకి పైట జార్చడానికి పోతున్నారా? ఈ ఫ్లాట్ కొనకముందు ఏదో ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బు అడిగాడు. తాను అక్కర్లేనప్పుడు తన డబ్బు మాత్రం ఎందుకు? ఇవ్వను అంది. మనసులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ ఫ్లాట్ కొంటుంటే వాళ్లూ వీళ్లూ జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. వద్దని తన పేరు మీదే చేయించుకుంది. ఇప్పుడు తనకో ఇల్లుంది. కూతురుంది. ఉద్యోగం ఉంది. మొగుడు కూడా ఉంటే ఉంటాడు. నిన్న రాత్రి అదీ తేలిపోయింది. డైనింగ్ టేబుల్ మీద భోం చేస్తుంటే- ఇలాగైతే ఉండను. వెళ్లిపోతాను అన్నాడు. దూరంగా పాప పెద్ద సౌండ్‌తో టీవీ చూస్తోంది. వాలకం చూస్తే గొడవ జరిగేలా ఉంది. పెద్ద గొడవ జరిగినా చిన్న గొడవ జరిగినా ఫలితం మాత్రం తాను ముందే నిశ్చయించుకుని ఉంది. అందుకని గొంతు పెంచకుండా మెల్లగా తీవ్రంగానే అంది. ఇంకొక్క మాట మాట్లాడావంటే పళ్లు రాలిపోతాయి. మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడు. మళ్లీ వచ్చావంటే కాళ్లు విరగ్గొడతా. ఆ... అని ముందుకు ఉన్నవాడల్లా కుర్చీలో వెనక్కు వాలి నోరెళ్లబెట్టాడు. పాపను తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్లిపోయింది. మరో అరగంటకు ఏం ప్యాక్ చేసుకున్నాడో పాడో వెళ్లిపోయాడు. తెల్లారింది. మెలకువ వచ్చింది. బొప్పాయి చెట్టును చూస్తూ టీ తాగడం పూర్తయ్యింది. పాప స్కూలుకు కూడా వెళ్లిపోయింది. ఏం కొంప మునిగిపోలేదు. నిన్న గడిచినట్టే ఇవాళ కూడా గడుస్తుంది. టైమ్ చూసుకుంది. ట్రాక్ ప్యాంట్ వేసుకుంది. టీషర్ట్ లాక్కుని కిందకు దిగి సైకిల్‌తో రోడ్డు మీదకు వచ్చాక ఒక క్షణం అనిపించింది. రేపతను మళ్లీ రావచ్చు. కాళ్లబేరం చేసుకోవచ్చు. తాను దయతలిచి ఇంట్లోకి అడుగుపెట్టనివ్వొచ్చు. కాని ఈ రొటీన్లో మాత్రం తేడా ఉండకూడదు. అయితే ఒక్కటి మాత్రం తేడా పాటించాలనుకుంటోంది. ఇక మీదట జుట్టు పొడుగ్గా పెంచాలనుకుంటోంది. ఏం... ముచ్చటగా చీర కట్టుకుని ఆఫీసుకు వెళ్లకూడదా? - మహమ్మద్ ఖదీర్‌బాబు -
అమ్మమ్మ
మెట్రోకథలు సరిగ్గా పదడుగుల దూరంలో ఉన్న త్రీ బై సిక్స్ కాట్ మీద ఆమె కొంచెం కదిలింది. నిన్న రాత్రి నుంచి నీళ్లు లేవు. కూతురు తెలివైనది. కొంచెం ఊహించి ఒకటి రెండు బకెట్లు ముందే నింపి పెట్టుకుంది. తెల్లారి అవే అక్కరకొచ్చాయి. ఏదో ముక్కూ మూతీ కడుక్కున్నాం అనిపించి కూతురు, అల్లుడు, వారి కంటే ముందే అప్పర్ కేజీ చదువుతున్న మనవరాలు వెళ్లిపోయారు. కొంచెం ఎంగిలి పడి, అంటే ఏం లేదు, కాసింత రాగిజావ గొంతులో పోసుకొని ఇప్పుడే అలా మంచం మీద వాలింది. ఇంతలోనే ఈ అంతరాయం. చప్పుడు వింటూ ఉంది. అది రానురాను దగ్గరపడుతూ రొద మార్చుకుంటూ బకెట్ నిండబోతోందనే సంకేతాన్ని ఇస్తూ ఉంది. ఇప్పుడు లేవాలి. కాళ్లు కాళ్లుగా మిగిలి చాలా కాలం అయ్యింది. కీళ్లనొప్పులు. సుగర్ ఒకటి. ఈ మధ్య తల తిరిగిపోతుంటే స్పాండిలోసిస్ అన్నారు. భర్త బతికినంతకాలం మంగళసూత్రం ఉండింది. ఇప్పుడు మెడపట్టి. మెల్లగా లేచి కూచుంది. నిజానికి ఇది కొంచెం సులువైన పనే. అలా కొద్దిగా నడుచుకుంటూ వెళ్లి చేత్తో తిప్పేస్తే ట్యాప్ బంద్. కాని మధ్యాహ్నం అంత సులభం కాదు. మూడింటికల్లా మనవరాలు స్కూల్ నుంచి వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఆగకుండా ఉంటుంది. ఫస్ట్‌ఫ్లోర్‌కి పోతుంది. సెకండ్ ఫ్లోర్‌కి పోతుంది. లేదంటే థర్డ్ఫ్లోర్కు దిగేస్తుంది. వెనుక పరిగెత్తలేదు. పట్టుకోలేదు. కుదురుగా కూచోబెడితే వీపు తిప్పే లోపల టీవీ బల్ల ఎక్కేస్తుంది. అదిలిస్తున్నా వినకుండా నీళ్లు కింద పోసేస్తుంది. సోఫా మీద నుంచి మంచం మీద దుముకుతూ తల ఎక్కడ పగలగొట్టు కుంటుందో అని అదో భయం. ఆరుకో ఏడుకో కూతురు వచ్చేదాకా ఇదే కష్టం. కాని జీవితంలో ఈ మాత్రం కష్టమైనా ఉన్నందుకు ఆమెకు అప్పుడప్పుడు సంతోషంగా ఉంటుంది. పాపకు కష్టమవుతుందమ్మా అని కూతురు అనకపోతే- పాపను చూసుకుంటున్నానన్న తృప్తితో తానిక్కడ ఉండకపోతే- ఎక్కడికి పోయేటట్టు? కొడుకు అత్తాపూర్‌లో ఉంటాడు. అక్కడి నుంచి మణికొండ షిఫ్ట్ అవుతాడట. పిల్లలు పెద్దవాళ్లు. ఇంత పెద్ద నగరంలో వాళ్ల అవసరాల కోసమని కోడలు కూడా ఏదో ఒక పని చేయక తప్పదు. అందరూ వెళ్లాక ఇంట్లో మీరొక్కరే బోరైపోతారత్తయ్యా అంటుంది కోడలు. అదీ నిజమే. కాని ఈ మధ్య ఆమెకు చిన్న గిల్ట్ వచ్చింది. స్కూల్ ఉన్నన్ని రోజులు మనవరాలిని చూసుకుంటుంది. కనుక ఇక్కడ ఉండొచ్చు. ఈ ఇంటి తిండి తినొచ్చు. కాని రెండు నెలలు వేసవి సెలవులొచ్చాయి. అప్పుడు కూడా కదలక మెదలక తిని కూచుంటూ ఉంటే అల్లుడేమనుకుంటాడు? కొడుకును అడగాలా? ఎక్కడా... తీసుకెళ్లాలనే ఉంది... పిల్లలకు ఎగ్జాములు, కోచింగులు, ఎంట్రన్స్‌లు... మా ముఖాలను చూస్తేనే డిస్టర్బెన్స్ ఫీలవుతున్నారు... మిమ్మల్ని కూడా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకా అని... అంటుంది కోడలు. ఆ మాటా నిజమే. బెజవాడలో ఉండగా లంకంత సంసారాన్ని ఈదింది. వచ్చే కాలూ వెళ్లే కాలూ. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి పెట్టకపోయినా వారందరితో మనసు పెట్టి మాట్లాడేది. ఆ మాట కోసం వచ్చేవాళ్లు. మొన్న- ఎస్.ఎం.ఎస్ చూడటం నేర్చుకోమ్మా అన్నాడు కొడుకు. హడలిపోయింది. వాడు బాగా బిజీ. అయినప్పటికీ అతి కష్టం మీద వారం పది రోజులకు ఒకసారైనా గుర్తు పెట్టుకొని మాట్లాడతాడు. ఎస్.ఎం.ఎస్ చూడటం నేర్చుకుంటే బిజీలో ఉంటూ మెసేజ్‌లతోనే మాట్లాడేస్తాడా అని భయం. ఈ వయసులో ఎందుకులేరా అని తప్పించేసింది. బకెట్ నిండింది. లేచి ట్యాప్ కట్టేసి మెల్లగా వచ్చి కూచుంది. చుట్టూ చూసింది. టూ బెడ్రూమ్ ఫ్లాట్‌లో మంచం పట్టేంత స్థలం! అది మాత్రమే తనది. తక్కిన స్థలంలో ఒక గది బెడ్రూమ్కి, ఒక గది అల్లుడి కంప్యూటర్‌కి, కాగితాలకి, స్నేహితులెవరైనా వస్తే కాలక్షేపానికి. ఈ మధ్య తనకో గది ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంది. తన వస్తువులు, బ్యాగులు, బట్టలు, ఆల్బమ్‌లు... అల్లుడు ఫ్రిజ్ తెరిస్తే తన ఇన్సులిన్ బాటిళ్లు కనిపించడం ఆమెకు ఇబ్బందిగా ఉంది. స్టూల్ సాఫ్టెన్ కోసం ఈ మధ్య డాక్టరు క్రిమాఫిన్ రిఫర్ చేశాడు. ఆ బాటిల్ బయట కనిపించడమూ ఇబ్బందే. ఆ మాటకొస్తే కొడుకు దగ్గరకు వెళ్లినా తనకో గది దొరికే వీలు లేదు. అక్కడనే ఏముంది, గమనించింది కదా, చాలా ఫ్లాట్లలో పెద్దాళ్లకు ఒకటే స్థలం. హాలు. అక్కడే ఉండాలి. అక్కడే పడుకోవాలి. కామన్ టాయిలెట్ వాడుకోవాలి. సాయంత్రం ఐదూ ఆరు మధ్యన బయట కారిడార్‌లో నిలబడితే అన్ని ఫ్లోర్లలో తనలాంటి ఇద్దరు ముగ్గురు గాలి పీల్చుకోవడానికా అన్నట్టు బయట నిలుచుని కనిపిస్తారు. జుట్టు తెల్లబడి, చర్మం వదులయ్యి, వెన్ను తేలి.... ఎవరూ మాట్లాడుకోరు. ఏం మాట్లాడుకోవాలి గనక? మనవరాలు వచ్చింది. సంతోషం, కంగారు తెచ్చింది. ఆకలిగా ఉంది అనంటే దాని నోటికి ఏదైనా పెడుతున్న ఆ కాసిన్ని క్షణాలు అమృతంలా అనిపించాయి. ఆ తర్వాత కూతురు వచ్చేంత వరకూ దాని అల్లరిని ఎలా ఉగ్గబట్టి భరించిందో ఏమో. కూతురు వచ్చాక అమ్మయ్య కాసేపు కబుర్లు చెప్పొచ్చు అనుకుంది. కాని ఇవాళ దాని మూడ్ బాగలేదు. రావడం రావడం బ్యాగ్ పడేసి చర్రుపర్రు మంటోంది. ఈ టైమ్‌లో ఏం మాట్లాడితే ఏం గొడవో. గప్‌చిప్‌గా ఊరుకుంది. రాత్రయ్యింది. అదైతే ఆమెకు చాలా భయంగా అనిపిస్తుంది. కాళ్లు పీకుతాయి. కళ్లు గుంజుతాయి. నిద్ర పట్టదు. ఏవేవో జ్ఞాపకాలు వస్తాయి. నిద్ర మాత్రలు మంచివి కాదు. ఏ ఆలోచనా లేకుండా పడుకోవే అదే వస్తుంది అంటుంది కూతురు. ఏ ఆలోచనా లేకుండానా? తండ్రి గుర్తొచ్చాడు. అరవై ఏళ్లు వచ్చినా ఎనిమిది తర్వాత బజారులో ఉండేవాడు కాదు. అబ్బీ అని తల్లి పిలిచిందంటే వస్తున్నా అమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్లి మంచం దగ్గర నిలబడేవాడు. ఆయన తినడం కళ్లతో చూసుకున్నాకే ఆమె తినేది. ఆ తర్వాత హాయిగా నిద్ర పోయేది. రాత్రి టైమ్ ఎంతయ్యిందో తెలియడం లేదు. నిద్ర పట్టడం లేదు. ఈ ఫ్లాట్‌కు గాలి, వెలుతురు తక్కువ. పగలైనా రాత్రయినా హాలు చీకటిగా, ఉక్కగా ఉంటుంది. ఫ్యాను వేసినా అంతే. పూజలు, మంత్రాలు... వీటికి సమయమే లేనట్టుగా జీవితం గడిచిపోయింది. ఇప్పుడు కొత్తగా దేవుణ్ణి తలుచుకోవడం చేతకావడం లేదు. దూరంగా రోడ్డు మీద ట్రక్కులు తిరుగుతున్న చప్పుడు వింటూ కళ్లు మూసుకుని అటూ ఇటూ మసలుతూ ఉండిపోయింది. తెల్లవారింది. మొదట మనవరాలు వెళ్లిపోయింది. అల్లుడు టూవీలర్ ఎక్కి ఆఫీస్‌కు పరుగు తీశాడు. కూతురు మంచం దగ్గర నిలబడి గబగబా ఏవో జాగ్రత్తలు, వంటింటి పురమాయింపులు చేసి లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా మెట్లు దిగిపోయింది. తొమ్మిది దాటి పది అయ్యింది. బాత్రూమ్లో పెద్ద చప్పుడుతో ట్యాప్ మొదలయ్యింది. తన నిమిత్తం లేకుండా నీళ్లు నింపుకుంటున్న బకెట్ అంతకు పది అడుగుల దూరంలో ఉన్న మంచం మీద ఆమె కదలిక కోసం ఎదురు చూస్తూ ఉంది. - మహమ్మద్ ఖదీర్‌బాబు