అమ్మమ్మ | Grandmother | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ

Published Sun, Jun 7 2015 1:33 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

అమ్మమ్మ - Sakshi

అమ్మమ్మ

మెట్రోకథలు
సరిగ్గా పదడుగుల దూరంలో ఉన్న త్రీ బై సిక్స్ కాట్ మీద ఆమె కొంచెం కదిలింది. నిన్న రాత్రి నుంచి నీళ్లు లేవు. కూతురు తెలివైనది. కొంచెం ఊహించి ఒకటి రెండు బకెట్లు ముందే నింపి పెట్టుకుంది. తెల్లారి అవే అక్కరకొచ్చాయి. ఏదో ముక్కూ మూతీ కడుక్కున్నాం అనిపించి కూతురు, అల్లుడు, వారి కంటే ముందే అప్పర్ కేజీ చదువుతున్న మనవరాలు వెళ్లిపోయారు. కొంచెం ఎంగిలి పడి, అంటే ఏం లేదు, కాసింత రాగిజావ గొంతులో పోసుకొని ఇప్పుడే అలా మంచం మీద వాలింది. ఇంతలోనే ఈ అంతరాయం.

చప్పుడు వింటూ ఉంది. అది రానురాను దగ్గరపడుతూ రొద మార్చుకుంటూ బకెట్ నిండబోతోందనే సంకేతాన్ని ఇస్తూ ఉంది. ఇప్పుడు లేవాలి. కాళ్లు కాళ్లుగా మిగిలి చాలా కాలం అయ్యింది. కీళ్లనొప్పులు. సుగర్ ఒకటి. ఈ మధ్య తల తిరిగిపోతుంటే స్పాండిలోసిస్ అన్నారు. భర్త బతికినంతకాలం మంగళసూత్రం ఉండింది. ఇప్పుడు మెడపట్టి.

మెల్లగా లేచి కూచుంది.
నిజానికి ఇది కొంచెం సులువైన పనే. అలా కొద్దిగా నడుచుకుంటూ వెళ్లి చేత్తో తిప్పేస్తే ట్యాప్ బంద్. కాని మధ్యాహ్నం అంత సులభం కాదు. మూడింటికల్లా మనవరాలు స్కూల్ నుంచి వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఆగకుండా ఉంటుంది. ఫస్ట్‌ఫ్లోర్‌కి పోతుంది. సెకండ్ ఫ్లోర్‌కి పోతుంది. లేదంటే థర్డ్‌ఫ్లోర్‌కు దిగేస్తుంది. వెనుక పరిగెత్తలేదు. పట్టుకోలేదు. కుదురుగా కూచోబెడితే వీపు తిప్పే లోపల టీవీ బల్ల ఎక్కేస్తుంది. అదిలిస్తున్నా
వినకుండా నీళ్లు కింద పోసేస్తుంది. సోఫా మీద నుంచి మంచం మీద దుముకుతూ తల ఎక్కడ పగలగొట్టు కుంటుందో అని అదో భయం. ఆరుకో ఏడుకో కూతురు వచ్చేదాకా ఇదే కష్టం.
కాని జీవితంలో ఈ మాత్రం కష్టమైనా ఉన్నందుకు ఆమెకు అప్పుడప్పుడు సంతోషంగా ఉంటుంది. పాపకు కష్టమవుతుందమ్మా అని కూతురు అనకపోతే- పాపను చూసుకుంటున్నానన్న తృప్తితో తానిక్కడ ఉండకపోతే- ఎక్కడికి పోయేటట్టు? కొడుకు అత్తాపూర్‌లో ఉంటాడు. అక్కడి నుంచి మణికొండ షిఫ్ట్ అవుతాడట. పిల్లలు పెద్దవాళ్లు. ఇంత పెద్ద నగరంలో వాళ్ల అవసరాల కోసమని కోడలు కూడా ఏదో ఒక పని చేయక తప్పదు. అందరూ వెళ్లాక ఇంట్లో మీరొక్కరే బోరైపోతారత్తయ్యా అంటుంది కోడలు.

అదీ నిజమే.
కాని ఈ మధ్య ఆమెకు చిన్న గిల్ట్ వచ్చింది. స్కూల్ ఉన్నన్ని రోజులు మనవరాలిని చూసుకుంటుంది. కనుక ఇక్కడ ఉండొచ్చు. ఈ ఇంటి తిండి తినొచ్చు. కాని రెండు నెలలు వేసవి సెలవులొచ్చాయి. అప్పుడు కూడా కదలక మెదలక తిని కూచుంటూ ఉంటే అల్లుడేమనుకుంటాడు?

కొడుకును అడగాలా?
ఎక్కడా... తీసుకెళ్లాలనే ఉంది... పిల్లలకు ఎగ్జాములు, కోచింగులు, ఎంట్రన్స్‌లు... మా ముఖాలను చూస్తేనే డిస్టర్బెన్స్ ఫీలవుతున్నారు... మిమ్మల్ని కూడా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకా అని... అంటుంది కోడలు. ఆ మాటా నిజమే.

బెజవాడలో ఉండగా లంకంత సంసారాన్ని ఈదింది. వచ్చే కాలూ వెళ్లే కాలూ. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి పెట్టకపోయినా వారందరితో మనసు పెట్టి మాట్లాడేది. ఆ మాట కోసం వచ్చేవాళ్లు. మొన్న- ఎస్.ఎం.ఎస్ చూడటం నేర్చుకోమ్మా అన్నాడు కొడుకు. హడలిపోయింది. వాడు బాగా బిజీ. అయినప్పటికీ అతి కష్టం మీద వారం పది రోజులకు ఒకసారైనా గుర్తు పెట్టుకొని మాట్లాడతాడు. ఎస్.ఎం.ఎస్ చూడటం నేర్చుకుంటే బిజీలో ఉంటూ మెసేజ్‌లతోనే మాట్లాడేస్తాడా అని భయం. ఈ వయసులో ఎందుకులేరా అని తప్పించేసింది.
బకెట్ నిండింది.
లేచి ట్యాప్ కట్టేసి మెల్లగా వచ్చి కూచుంది.
చుట్టూ చూసింది.

టూ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో మంచం పట్టేంత స్థలం! అది మాత్రమే తనది. తక్కిన స్థలంలో ఒక గది బెడ్‌రూమ్‌కి, ఒక గది అల్లుడి కంప్యూటర్‌కి, కాగితాలకి, స్నేహితులెవరైనా వస్తే కాలక్షేపానికి.

ఈ మధ్య తనకో గది ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంది. తన వస్తువులు, బ్యాగులు, బట్టలు, ఆల్బమ్‌లు... అల్లుడు ఫ్రిజ్ తెరిస్తే తన ఇన్సులిన్ బాటిళ్లు కనిపించడం ఆమెకు ఇబ్బందిగా ఉంది. స్టూల్ సాఫ్టెన్ కోసం ఈ మధ్య డాక్టరు క్రిమాఫిన్ రిఫర్ చేశాడు. ఆ బాటిల్ బయట కనిపించడమూ ఇబ్బందే. ఆ మాటకొస్తే కొడుకు దగ్గరకు వెళ్లినా తనకో గది దొరికే వీలు లేదు. అక్కడనే ఏముంది, గమనించింది కదా, చాలా ఫ్లాట్లలో పెద్దాళ్లకు ఒకటే స్థలం. హాలు. అక్కడే ఉండాలి. అక్కడే పడుకోవాలి. కామన్ టాయిలెట్ వాడుకోవాలి.

సాయంత్రం ఐదూ ఆరు మధ్యన బయట కారిడార్‌లో నిలబడితే అన్ని ఫ్లోర్లలో తనలాంటి ఇద్దరు ముగ్గురు గాలి పీల్చుకోవడానికా అన్నట్టు బయట నిలుచుని కనిపిస్తారు. జుట్టు తెల్లబడి, చర్మం వదులయ్యి, వెన్ను తేలి.... ఎవరూ మాట్లాడుకోరు. ఏం మాట్లాడుకోవాలి గనక?

మనవరాలు వచ్చింది. సంతోషం, కంగారు తెచ్చింది. ఆకలిగా ఉంది అనంటే దాని నోటికి ఏదైనా పెడుతున్న ఆ కాసిన్ని క్షణాలు అమృతంలా అనిపించాయి. ఆ తర్వాత కూతురు వచ్చేంత వరకూ దాని అల్లరిని ఎలా ఉగ్గబట్టి భరించిందో ఏమో. కూతురు వచ్చాక అమ్మయ్య కాసేపు కబుర్లు చెప్పొచ్చు అనుకుంది. కాని ఇవాళ దాని మూడ్ బాగలేదు. రావడం రావడం బ్యాగ్ పడేసి చర్రుపర్రు మంటోంది. ఈ టైమ్‌లో ఏం మాట్లాడితే ఏం గొడవో. గప్‌చిప్‌గా ఊరుకుంది.
రాత్రయ్యింది. అదైతే ఆమెకు చాలా భయంగా అనిపిస్తుంది. కాళ్లు పీకుతాయి. కళ్లు గుంజుతాయి. నిద్ర పట్టదు. ఏవేవో జ్ఞాపకాలు వస్తాయి. నిద్ర మాత్రలు మంచివి కాదు.

ఏ ఆలోచనా లేకుండా పడుకోవే అదే వస్తుంది అంటుంది కూతురు.
ఏ ఆలోచనా లేకుండానా?

తండ్రి గుర్తొచ్చాడు. అరవై ఏళ్లు వచ్చినా ఎనిమిది తర్వాత బజారులో ఉండేవాడు కాదు. అబ్బీ అని తల్లి పిలిచిందంటే వస్తున్నా అమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్లి మంచం దగ్గర నిలబడేవాడు. ఆయన తినడం కళ్లతో చూసుకున్నాకే ఆమె తినేది. ఆ తర్వాత హాయిగా నిద్ర పోయేది.

రాత్రి టైమ్ ఎంతయ్యిందో తెలియడం లేదు. నిద్ర పట్టడం లేదు. ఈ ఫ్లాట్‌కు గాలి, వెలుతురు తక్కువ. పగలైనా రాత్రయినా హాలు చీకటిగా, ఉక్కగా ఉంటుంది. ఫ్యాను వేసినా అంతే. పూజలు, మంత్రాలు... వీటికి సమయమే లేనట్టుగా జీవితం గడిచిపోయింది. ఇప్పుడు కొత్తగా దేవుణ్ణి తలుచుకోవడం చేతకావడం లేదు. దూరంగా రోడ్డు మీద ట్రక్కులు తిరుగుతున్న చప్పుడు వింటూ కళ్లు మూసుకుని అటూ ఇటూ మసలుతూ ఉండిపోయింది.

తెల్లవారింది.
మొదట మనవరాలు వెళ్లిపోయింది. అల్లుడు టూవీలర్ ఎక్కి ఆఫీస్‌కు పరుగు తీశాడు. కూతురు మంచం దగ్గర నిలబడి గబగబా ఏవో జాగ్రత్తలు, వంటింటి పురమాయింపులు చేసి లిఫ్ట్ కోసం కూడా ఆగకుండా మెట్లు దిగిపోయింది.

తొమ్మిది దాటి పది అయ్యింది.
బాత్‌రూమ్‌లో పెద్ద చప్పుడుతో ట్యాప్ మొదలయ్యింది.

తన నిమిత్తం లేకుండా నీళ్లు నింపుకుంటున్న బకెట్ అంతకు పది అడుగుల దూరంలో ఉన్న మంచం మీద ఆమె కదలిక కోసం ఎదురు చూస్తూ ఉంది.
 - మహమ్మద్ ఖదీర్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement