సబ్‌వే... | Metro stories | Sakshi
Sakshi News home page

సబ్‌వే...

Published Sat, Sep 12 2015 11:25 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

సబ్‌వే... - Sakshi

సబ్‌వే...

మెట్రో  కథలు
 

పదండి సీనియర్‌గారూ అని నవ్వింది. అలాగే జూనియర్‌గారూ అని తోడు కలిపాడు.ఆరంజ్, ఎల్లో పాట్రన్‌లో అందంగా తయారైన టేబుల్స్‌లో మూడో వరుసలో ఉన్న మొదటిది వాళ్ల ఫేవరేట్. ఎప్పుడూ అక్కడే కూచుంటారు. పదిహేను నిమిషాలు... మహా అయితే అరగంట. ఆఫీసులో రొడ్డకొట్టుడు పనిలో అదే పెద్ద వెసులుబాటు.
 
కాని ఇవాళ రోజూ కలిసినట్టుగా కాదు. ఇవాళ ప్రత్యేకం. మెనూ అందుకుంది. బిల్ నేను పే చేస్తాను. అడ్డు చెప్పకూడదు. సరే.
 చట్‌పటా చనా, ఆలూ పాటీ చెప్పింది. టిన్ కోక్ ఒకటి చెప్తే ఆఖరులో చెరి సగం తాగుతారు. సో... అంది. సో... అన్నాడు. చూసుకున్నారు. మాటలు రాలేదు. మూడేళ్లుగా కూచుంటున్నారు. ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుందని తెలుసు. అందుకే ప్రిపేర్డ్‌గాఉన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సుద్దులు చెప్తున్నట్టుగా అంది- కొత్త ఆఫీసులో అయినా సరిగ్గా లంచ్ బాక్స్ తెచ్చుకో. డెస్క్‌లో కొన్ని డ్రైఫ్రూట్స్ పెట్టుకొని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తిను. టీలు తక్కువ తాగు. అలా గడ్డం పెంచకు. ఆరు నెల్లకు ఒకసారి కంప్లీట్ చెకప్ చేయించుకో. ఇవన్నీ పదే పదే చెప్పడానికి చేయించడానికి అక్కడ నేను ఉండను. గుర్తు పెట్టుకో.... ముఖంలోకి చూడలేక తలాడించాడు.
 అన్నింటి కంటే ముఖ్యం ఇంక మెయిల్సు, వాట్సప్‌లు, ఫేస్‌బుక్ పలకరింపులు బంద్ చెయ్. ఫర్మాలిటీగా కంటిన్యూ చేసి తర్వాత కట్ చేయడం కన్నా వెంటనే కట్ చేయడం మంచిది. మనమేం చిన్నపిల్లలం కాదు కదా. ఏమంటావ్?...

 మళ్లీ తలాడించాడు. ఏదీ నా వైపు చూడు...చూశాడు. ఓరి బాబో... ఏడవకురా తండ్రీ.... పెద్ద పెద్దగా నవ్వింది. కాసేపాగి కళ్లు తుడుచుకుంటూ నవ్వే ప్రయత్నం చేశాడు. ఆఫీసులో చేరిన కొత్తలో ఇలాగే ఏడ్చింది. పని చేతగాక ఏడుపు తన్నుకొచ్చేది. పెళ్లికి ముందు ఉద్యోగం చేసేదే. పెళ్లి తర్వాత ఏడేళ్లు ఉద్యోగం మాటే మర్చిపోయింది. ఆ తర్వాత మళ్లీ చేరితే ఎంత అనుభవం ఉన్నా తెలిసిన సాఫ్ట్‌వేర్ తతంగమే అయినా మారిపోవాల్సినవన్నీ మారిపోయే ఉంటాయి కదా. ఏమైనా కావాలంటే మీ సీనియర్‌ని అడగండి అన్నాడు టీమ్ లీడర్. సీనియర్ అంటే వాడెంత పెద్దాడో ఏ నలభై నలభై అయిదేళ్ల వాడో అనుకుంది. తన కంటే చిన్నవాడు. ముప్పై ఏళ్లు కూడా దాటని వాడు. కాని సీనియర్ సీనియరే కదా. డౌట్లు తీర్చే పద్ధతి విసుక్కోకుండా పని నేర్పే పద్ధతి ఎంత పనిలో ఉన్న పోజు కొట్టక అటెండ్ చేసే పద్ధతి నచ్చి సీనియర్‌గారూ అని పిలవడం మొదలుపెట్టింది. జూనియర్‌గారూ అని తిరిగి జవాబు ఇవ్వడం మొదలుపెట్టాడు. అదో చిన్న నవ్వు.

ఇద్దరూ సిటీలో ఈ మూల నుంచి ఒకరు ఆ మూల నుంచి ఒకరు తెల్లారి ఎనిమిదికి బయలు దేరుతారు. క్యాబ్‌లో గంటా గంటన్నర జర్నీ నరకం. వచ్చాక సీట్లకు అతుక్కుపోయి మళ్లీ క్యాబ్ ఎక్కి ఇల్లు చేరేంత వరకూ అదో నరకం. ఏసి అద్భుతంగా ఉంటుంది. కాని గాలే ఆడనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కూచుని కూచుని ఉబుసుపోక- మీ ఆవిడ ఏం వండిందండీ అని వచ్చి కూచునేది. ఏం వండలేదండీ. తను పొద్దున్నే లేచి చేయలేదు. బాబుతో కుదర్దు. పర్లేదు. నేను తెచ్చాను లెండి. తినండి.. మొహమాటస్తుడు. వినేవాడు కాదు. సరే. సబ్‌వేలో అయినా ఏదైనా ఎంగిలి పడదాం పదండి... బలవంతం చేసేది. ఆఫీసుకు ఫర్లాంగు దూరంగలో సబ్‌వే ఉంది. అందరూ వెళ్లి తింటుంటారు. వీళ్లకూ అలవాటైంది.అందరికీ చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉంటారు. మాట్లాడిందే మాట్లాడి కొత్తదేం మాట్లాడటానికి ఉండదు. పైగా మనం ఏ మానసిక స్థితిలో ఉన్నామో వాళ్లకు తెలీదు. కలీగ్స్ ఉంటారు. కాని అందరికీ అన్నీ చెప్పుకునే పరిస్థితులు ఉండవు. ఎవరో ఒకరుభద్రంగా క్షేమంగా అనిపించాలి. తలుపు తట్టాలి. మీ ఆయన మంచివాడే కదండీ.... చాలా. మీ ఆవిడ?దేవత కదండీ...కొన్నాళ్లకు ఈ సంభాషణ మారుతుంది. అబ్బో... మా ఆయనకు చాలా కోపమండీ.... అమ్మో... మా ఆవిడ చాలా సతాయిస్తుందండీ....
 నిజానికి పెళ్లయిన మొదటి మూడు రాత్రులలోనే సమస్య తెలిసింది. పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ. ఆ తర్వాత కూడా సమస్య పోలేదు. రాత్రి వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి పగలంతా పెత్తనం చేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తాడు. అదంతా చెప్పలేదు. ఏం అలా ఉన్నారు అనడితే-
 ఎవరి బాధలు వారివి లేండి అని ఊరుకుంటుంది.

తెలియకపోతే కదా. పెళ్లయి ఇన్నాళ్లయినా నిజంగా గౌరవిస్తుందా ప్రేమిస్తుందా పక్కన కూచుని మెత్తగా ఎందుకు మాట్లాడదు ప్రతిదీ సందేహమే. ఆ మాటా నిజమే లేండి అని ఊరుకుంటాడు. ఇంతకుమునుపు క్యాబ్ ప్రయాణం బోర్ కొట్టేది. ఇప్పుడు ఇద్దరూ చెరో క్యాబ్‌లో బయలు దేరాక ఫోనో, వాట్సప్పో నడిచిపోతూ ఉంటుంది. ఆఫీస్‌లో ఒకసారి కలిసి కాఫీ తాగుతారు. అతడి కోసం ఒక డబ్బా ఎక్కువ తెస్తుంది గనక కలిసి భోంచేస్తారు. సాయంత్రం సబ్‌వేలో స్నాక్ తినే మిష మీద ఏవో ఉబుసుపోని కబుర్లు చెప్పుకుంటారు. అతడికి జ్వరం వస్తే ఆమె టాబ్లెట్ తెస్తుంది. ఆమెకు పని పెరిగితే అతడు చేసి పెడతాడు. ఆఫీస్‌లో అందరూ గమనించారు. ఎవరూ గమనించనట్టే ఉన్నారు. ఆమె జోలికి ఇంకే మగవాళ్లు రావడం లేదు. అతణ్ణి వేరే ఆడవాళ్లెవ్వరూ కదలించడం లేదు. అంతకు మించి ఏమైనా జరిగిందా అని కుతూహలం ఉన్నవాళ్లు ఉన్నారు లేనివాళ్లూ ఉన్నారు. ఇంతకు మించి ఏమీ వద్దు కదా అడిగాడు ఒకరోజు. చూసింది. అడగడం నార్మల్. అడక్కపోతే అబ్‌నార్మల్... నసిగాడు. వద్దు.

ఆ తర్వాత ఆ చర్చ మళ్లీ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఇంకా పెద్ద సంస్థలో ఇంకా మంచి ఆఫర్ వచ్చింది. వెళ్లిపోతున్నాడు. బిల్లు కట్టేసింది. చీకటి పడిపోయింది. ఇద్దరూ కావాలనే  క్యాబ్‌ని మిస్ చేసేశారు. నిన్ను ఇంటి దాకా దింపనా? అడగలేక అడగలేక అడిగాడు. వద్దు. బస్‌లో వెళతాను. చూసుకున్నారు. సో... అన్నాడు. సో... అంది. చేయి ఊపింది. చేయి సాచాడు. చివరి కరచాలనం. రేపు మళ్లీ తెల్లారుతుంది. మళ్లీ ఆఫీసు ఉంటుంది. కాకపోతే వీళ్లు మళ్లీ ఇలా ఉండకపోవచ్చు. అందరూ ఇలా ఉండకపోవచ్చు. కాని ఇలా ఉండి ఆర్డర్ ప్లేస్ చేసేవారి కోసం మాత్రం సబ్‌వేలో పదార్థాలు తయారవుతూనే ఉంటాయి.
 - మహమ్మద్ ఖదీర్‌బాబు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement