మెట్రో... | Metro | Sakshi
Sakshi News home page

మెట్రో...

Published Sun, Aug 23 2015 12:32 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

మెట్రో... - Sakshi

మెట్రో...

 వెళ్లి తీసుకురండి అని నిలబడింది.
 దూరంగా ఉన్న టూ వీలర్ పార్కింగ్ వైపు ప్లాస్టిక్ ఆంజనేయస్వామి కీచైన్‌ను ఊగులాడించుకుంటూ వెళుతూ ఉంటే లైట్ల వెలుతురులో ఆ కుట్టించిన ప్యాంట్ కుట్టించిన చొక్కా టక్ మూడొందల యాభై రూపాయల చెప్పులు... విసుగ్గా అనిపించాయి.
 చేతిలో ఉన్న పాలిథిన్ కవర్‌ని ఒకసారి చూసుకొని ఎందుకనో దూరంగా జరిగి నిలుచుంది.
 
 చాలామంది లోపలి నుంచి ట్రాలీలతోనే కార్ల వరకూ వచ్చి డిక్కీలు తెరిచి కొనుక్కున్న సరుకులను ట్రాలీలలో నుంచి కార్లలో పడేసి దర్జాగా డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. మొగుడూ పెళ్లామూ... ఉంటే పిల్లలూ.

 మెట్రోకి కార్లు ఉన్నవాళ్లే ఎక్కువగా వస్తారు. కార్డ్ ఉన్న వాళ్లనే రానిస్తారు.
 నాలుగు నెలల క్రితం త్రీ నాట్ ఫోర్ వాళ్ల ఫ్లాట్‌కు వెళ్లినప్పుడు కొత్త డైనింగ్ టేబుల్ కనిపించింది. చిన్నగా ముచ్చటగా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు అని అడిగితే మెట్రోలో అని చెప్పారు. అప్పుడే మొదటిసారి మెట్రో గురించి వినడం. కుకట్‌పల్లిలో చాలా పెద్ద స్టోరట. ఎన్నో ఎకరాల్లో పెట్టారట. అక్కడ దొరకనిదేదీ ఉండదట. అసలు చూడ్డానికే కళ్లు చాలవట. ప్రతి వస్తువూ డిస్కౌంట్‌లో ఇస్తారట. ఫ్రీ గిఫ్ట్స్ ఉంటాయట.

 ఒకసారి తీసుకెళ్లండీ అంది ఆ రాత్రి.
 అందరినీ రానివ్వరు అన్నాడు.
 ఎలాగోలా తీసుకెళ్లండీ అంది మళ్లీ.
 ఏదో చెప్పబోయాడు. అటు తిరిగి పడుకుంది.
 జీతం ఆరు వేలు పెరుగుతుందంటే ఆఫీసు మారి ఈ వైపున కాస్త దూరంగా వచ్చాక ఈ ఫ్లాట్స్ చాలా నచ్చాయి. ఎనిమిది వేలు అద్దె. మెయింటెనెన్స్ ఇతర నెలవారీ ఖర్చులూ హాస్టల్లో పడేయగా పది చదువుతున్న పిల్లవాడి ఖర్చూ అన్నీ పోగా మొత్తం నలభై వేలలో ఒక పదీ పన్నెండు మిగులుతాయి.

 ఒకటి రెండు రీసేల్‌కు ఉన్నట్టున్నాయ్... లోనుకు ట్రై చేయండి అనంటే అతి కష్టం మీద పదిహేను పద్దెనిమిది ఇస్తారట. అంతకు మించి పైసా ఇవ్వరట. ఫ్లాట్... థౌజండ్ ఎస్‌ఎఫ్‌టిది కూడా పాతిక ఉంది.

 ఇలా ఎంతకాలం అని అనిపించింది కాని విసుగు కలగలేదు.
 పచారి కొట్లో పద్దు ఇచ్చి సామాన్లు తెచ్చుకోవడం, మల్టీప్లెక్స్ ముఖం చూడకుండా దగ్గర్లో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్‌లోనే సినిమా చూసి వచ్చేయడం, కుక్కర్లు హాట్ బాక్సుల్లాంటి వాటిక్కూడా సిటీలోకి వెళ్లకుండా దగ్గరలోనే సర్దుకోవడం... నయం ఆర్.ఎస్. బ్రదర్స్‌వాడు కొత్తగా షోరూం తెరిచాడు లేదంటే పండగలకూ పబ్బాలకూ కూడా ఇక్కడిక్కడే కానిచ్చేద్దాం అనంటే అప్పుడూ విసుగనిపించలేదు.

 కాని అమాసకీ పున్నానికైనా ఇలాంటి కొత్తవాటికి తీసుకెళ్లి చూపించడానికి ఏం నొప్పి అని?
 కార్డ్ సంపాదించడానికి కొన్నాళ్లు అవస్థ పడ్డాడు. అది రిటైలర్లకూ
 సొంత ఫర్మ్‌ఉన్నవాళ్లకీ పైహోదాలో ఉన్న ఉద్యోగులకూ ఇంకా ఎవరెవరికో ఇస్తారట. మామూలు వాళ్లకు ఇవ్వరట. ఏవో పడి సంపాదించాడు. దానిని తెచ్చి చూపించిన రోజు లాటరీ తగిలినట్టుగా సంబరపడింది.
 అంటే ఇది తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లొచ్చన్నమాట.
 అవును.
 ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చన్న మాట.
 అవును.
 ఆ అవును విలువ కనీసం వెయ్యి రూపాయలని తర్వాత తెలిసింది.
 మొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఏమీ అర్థం కాలేదు. పూర్తిగా బెంబేలు పడిపోయింది. ఇంత పెద్ద స్టోరా? టీవీలు... ఒక వంద ఉన్నాయి. వాషింగ్ మెషీన్‌లు... ఒక వంద ఉన్నాయి. మిక్సీలూ గ్రైండర్‌లు... లెక్కలేనన్ని పడి ఉన్నాయి. కూర కలిపే గరిటెలు ఒక వంద రకాలు ఉన్నాయి. ట్యూబులు బల్బ్‌లు ఫ్యాన్లు బట్టలు చెప్పులు పండ్లు కూరగాయలు ఆఖరకు సాంబ్రాణీ ప్యాకెట్లతో సహా ఏవైనా సరే ఒకటీ రెండూ లేవు. వంద రకాలే. జనం తోసుకుంటున్నారు. ట్రాలీలు నెట్టుకుంటూ కోరినది అందుకుని పడేసుకుంటున్నారు. బెల్లం ఎండు మిరపకాయలను కూడా పడీ పడీ తీసుకుంటున్నారు. డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు చేతుల్లో పట్టుకుని క్యూల్లో నిలుచుంటున్నారు.

 కంగారు పుట్టి ఇది అయ్యే పని కాదని నాలుగు రకాల పండ్లు తీసుకొని గబగబా బయట పడాలనుకుంది. కాని వాటి బిల్లు వెయ్యి దాటలేదట. వెయ్యి రూపాయలకు మించి సరుకులు కొంటేనే బిల్ చేస్తారట. ఒళ్లు మండి వాటిని అక్కడే పడేసి వచ్చేసింది.
 ఇది రెండోసారి రావడం.

 బైక్ తెచ్చాడు.
 మామూలుగా అయితే చేతిలో ఉన్న పాలిథిన్ కవర్‌ని ఒళ్లో పెట్టుకొని వెనుక కూచుంటుంది. కాని కూచోవాలనిపించలేదు.
 ముందు పెట్టుకోండి.
 అదేంటి?
 పెట్టుకోండంటున్నానా?
 మారు మాటాడకుండా కవర్ ముడి వేసి మూట లాగా చేసి కాళ్ల మధ్యలో పెట్టుకున్నాడు.
 వెనుక కూచుంది. బైక్ బయలు దేరింది. కళ్ల దగ్గరగా అతడి వెనుకజుట్టు కనిపిస్తూ ఉంది. పెళ్లిచూపుల్లో నిండుగా ఉన్న ఆ తల వెంట్రుకలను చూసే ఇష్టపడింది. ఇవాళ అవి దుమ్ముకూ ధూళికీ హెల్మట్ వొత్తిడికి అణిగీ అణిగీ జీవం కోల్పోయి... రోజూ చూసేవే... ఇవాళ అయిష్టంగా అనిపిస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లో అందరికీ కార్లున్నాయి. ఆల్టోకూ నానోకు కూడా నోచుకోలేమా?
 చేతిలో ఉన్న పర్స్ వైపు చూసుకుంది. అందులో తెచ్చిన డబ్బు అలాగే ఉంది. ఈసారి ఎలాగైనా సరే తీరిగ్గా తిరుగుతూ నాలుగైదు వేలకు కొనేయాలనుకుంది. ఆ డబ్బుకు ట్రాలీ నిండుగా సరుకు రాదనీ కనీసం ట్రాలీలో ఒక మూలకు కూడా రాదనీ అసలు పెద్ద వస్తువు ఏదీ రాదని తెలుసుకుని అవమానపడింది.

 టీవీలు చూస్తుంటే ఇంట్లో టీవీ గుర్తుకొచ్చింది. దాని వయసు పన్నెండేళ్లు. వాషింగ్ మెషీన్లు చూస్తుంటే ఇంట్లో ఉన్న వాషింగ్ మెషీన్ గుర్తుకొచ్చింది. వాషింగ్ మెషీనా అది? ప్లాస్టిక్ డబ్బా. మంచి మంచి పిల్లోలు కనిపించాయి. ఇంట్లోవి మార్చి రెండేళ్లు. ఇంత అందమైన డోర్‌మేట్లు ఉంటాయా? ఇంట్లో ఉన్నవాటిని కాలితో కూడా తాకలేమే! కాఫీ కప్పుల సౌందర్యం చూసి చాలాసేపు ఆగిపోయింది. ఇంత మంచివి కావాలంటే ఇంత రేటు పెట్టాల్సిందేనేమో. తాజా చందువాల దగ్గర మాత్రం మనసు చాలా లాగింది. కిలో ఆరు వందల యాభై అట. అమ్మో. ఇక షాంపూల వెరైటీ చూస్తే సిగ్గేసింది. తను ఇంట్లో వాడేది షాంపూనే కాదు.

 హెన్నా పెట్టి అది అంటీ అంటక... మామూలు చీర... మ్యాచింగ్ లేని చెప్పులు... జిప్పు సరిగ్గా పడని పర్సు....  అంత పెద్ద మాల్‌లో మేచింగ్ కాని మనిషిలా నిలుచుని ఉంది.
 మళ్లీ ఏమీ కొనాలనిపించలేదు. వేయి రూపాయలకు ఏమి వస్తాయో అవి నాలుగు పడేసుకుని బయటకు వచ్చేసింది.
 ఇల్లు చేరుకునేసరికి ఎనిమిదిన్నర.
 వంట చేయాలనిపించలేదు.
 లైట్లు కూడా వేయక నేరుగా వెళ్లి గదిలో పడుకుంది.
 చూసీ చూసీ వచ్చి అడిగాడు.
 వంట చేయవా?
 మీరే ఏదో తెచ్చుకుని తిని పడుకోండి.
 నాకు బయట తిండి పడదని తెలుసు కదా.
 చివాలున లేచింది.
 తెలిస్తే ఏం చేయమంటారు?
 బెదిరాడు.
 మనం బతుకుతున్నది అన్యాయమైన బతుకు కదా. తెలిసి మీరేం చేస్తున్నారు?
 ఆ గొంతుకు అదిరిపోయి చూస్తున్నాడు.
 అత్యాశ కాదండీ. మామూలు ఆశ కూడా కాదు. కనీస కోరిక. చిన్న ఇల్లు... అవసరమైన మంచి వస్తువులు... ఆ ఖర్మకు కూడా గతి లేకపోతే కనీసం కాలంతో పాటు కలిసి నడుస్తున్నామనే ఆనవాళ్లు... అవీ లేకపోతే ఏం బతుకండీ ఇదీ.... దరిద్రమైన బతుకు....
 నీకేదో దెయ్యం పట్టింది. ఇంతకు మించి నా వల్ల కాదు.

 మీ వల్ల కాకపోతే ఎందుకు చేసుకున్నారు? ఎందుకు కన్నారు? పెద్ద మగాడిలా బట్టలు కట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు. నా ముందు నిలబడి ఏం యోగ్యత ఉందని మాట్లాడుతున్నారు?....
 దెబ్బ తిన్నాడు. అక్కడ నిలబడలేక విసవిసా విసురుగా తలుపు తీసుకుని బయటకెళ్లిపోయాడు.
 మళ్లీ ఉలకక పలకక పడుకుంది.
 మెట్రో- తనేమిటో తనకు తెలియపర్చింది. ఈ ఒక్క పూటే.
 రేపటి నుంచి బహుశా ఈ దారుణమైన పేదరికాన్ని మధ్యతరగతి అనే లేబుల్ కింద వంచన చేసుకుంటూ బతికేయనుంది.
 - మహమ్మద్ ఖదీర్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement