థ్యాంక్యూ... | metro stories | Sakshi
Sakshi News home page

థ్యాంక్యూ...

Published Sun, Oct 25 2015 2:52 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

థ్యాంక్యూ... - Sakshi

థ్యాంక్యూ...

మెట్రో కథలు - 20
మెనూ కార్డ్ ముందుకు తోశాడు.  
ఫస్ట్‌టైమ్ అలా చేయడం.
ఏంటిది?...
ఆర్డర్ చెప్పు.
నేనా... నేనెప్పుడైనా చెప్పానా... నన్నెప్పుడైనా చెప్పనిచ్చావా?...
ఎందుకు మాటలనడం. ఇప్పుడు చెప్పొచ్చుగా.
తీసుకొని తిరగేసింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. పాపను అడిగింది.
 
ఏంవే... ఏం చెప్దాం...
 దానికేం తెలుసు? తల్లి వైపు చూసి ఫోర్కులతో ఆట కొనసాగించింది. మెనూ కార్డ్ తిరిగి ఇచ్చేస్తూ అంది.
 నువ్వే చెప్దూ...
 సాధారణంగా రెండు నాన్, ఒక వెజ్ కర్రీగానీ నాన్ వెజ్ కర్రీగానీ, ఒక బిరియానీ, కర్డ్ రైస్ చెప్తాడు. స్టాండర్డ్. ఎప్పుడు వచ్చినా అంతే. అలా అలవాటు చేశాడు. వెజ్ నూడుల్స్ ఇష్టం. ఎప్పుడూ అడగలేదు తింటావా అని. గోంగూర మటన్ ఇష్టం. అదీ అడగలేదు ఎప్పుడైనా కావాలా అని. పాపకు వెనిల్లా ఇష్టం. కాని ఎప్పుడూ     టూ బై త్రీ బటర్ స్కాచ్ చెప్తాడు.
 ఇవాళ ఛాయిస్ తనకు ఇస్తున్నాడు. పెళ్లికి తీసుకెళ్దామని మస్కా వేస్తున్నాడేమో. కల్లో కూడా జరగని పని. నవ్వుతూనే అంది-
 
పెళ్లికి ప్లాన్ చేస్తున్నావా... చచ్చినా రాను...
 అబ్బెబ్బే... అని ఊరుకున్నాడు.
 సొంత బాబాయి కొడుకు పెళ్లి. బాబాయి కొడుకే అయినా బాగా చనువు ఎక్కువ. సొంత తమ్ముడి కంటే ప్రేమగా ఉంటాడు. వెళ్లకపోతే ఎలా? ముందు రోజే చర్చ జరిగింది. రచ్చ అనాలేమో.
 నేను రానుగాక రాను. మా పిన్నికూతురి పెళ్లికి వెళ్దామంటే నువ్వొచ్చావా? ఆఫీస్‌లో వీలుగాదని ఎగ్గొట్టావ్. కనిపించిన ప్రతి మహాతల్లి మీ ఆయనెక్కడే మీ ఆయనెక్కడే అని అడుగుతుంటే తల ఎక్కడ పెట్టుకున్నానో తెలుసా? ఆ నొప్పి నీకు తెలియాలి. రాను.
 పెటేల్మని ఒక్కటి పీకాడు.
 కొట్టు. చంపు. రాను గాక రాను.
 
మళ్లీ ఒక్కటి.
 మీ వాళ్లంతా నీ పెళ్లాం ఎక్కడ్రా నీ పెళ్లాం ఎక్కడ్రా అని అడుగుతుంటే అప్పుడు చెప్పు సమాధానం. మీ అక్క నా మీద ఏదో ఎక్కిస్తే పెళ్లికి ఎగ్గొడ్తావేం...
 రాత్రి ఇద్దరూ సరిగ్గా నిద్ర పోలేదు. తెల్లారి బ్రేక్‌ఫాస్ట్ మీద అలిగి వచ్చేశాడు. తినూ తినూ తినేసి పో అని తనూ యాక్టింగ్ చేయలేదు. పనేదో చేస్తున్నాడు. సడన్‌గా తేడాగా అనిపించింది. ఒళ్లు తేలిగ్గా అవుతున్నట్టు... స్పృహ తప్పుతున్నట్టు.... తెలియని ఆందోళనగా... దడగా... గుటక పడుతూ... గుండెపోటుకు సూచనలా...

కలీగ్‌కి చెప్తే కంగారు పడిపోయి ఆఫీస్ వెహికల్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. డాక్టర్ ఎవరో మంచోడే. పల్స్ అదీ చెక్ చేసి- ఏం కాలేదు... సరదా ఉంటే చెప్పండి టెస్ట్‌లు రాస్తాను... రెండు మూడు వేలవుతాయి అన్నాడు. ఈసీజీ కూడా వద్దన్నాడు. ఒకటి రెండు గ్లాసులు మంచినీళ్లు తాగమని, తాగనిచ్చి అడిగాడు-
 దేనికైనా టెన్షన్ పడుతున్నారా?
 మొహమాటంగా చెప్పాడు.
 మామూలే. ఇంట్లో చిన్న చిన్న గొడవలు.
 అందుకే యాంగ్జయిటీ.
 
ప్రిస్కిప్షన్ మీద ఏదో టాబ్లెట్ రాశాడు. చింపుతూ అన్నాడు-
 దీని కంటే మీకో చిన్న సూఫీ కథ బాగా పని చేస్తుంది. ఒక సూఫీ తన శిష్యులతో రెండేళ్లుగా దేశాటన చేస్తున్నాడట. ఏ ఊరికెళ్లినా ఆదరించేవాళ్లకి కొదవే లేదట. పెట్టే కంచం కడిగే కంచం. ఒక ఊరికెళితే ఆ ఊరి వాళ్లు బాగా తిక్క మీద ఉన్నారట. అసలే వానల్లేక తిండి గింజలకు నానా అవస్థలు పడుతుంటే పడి మేయడానికి వచ్చారట్రా అని కర్రలు తీసుకుని వెంటపడ్డారట. సూఫీ తన శిష్యులతో పరిగెత్తుకుంటూ ఊరు దాటి ఒక్కసారిగా మోకాళ్ల మీద కూలబడి దేవుడికి పదే పదే కృతజ్ఞతలు మొదలుపెట్టాడట.

శిష్యులు ఆశ్చర్యపోయి వ్యంగ్యాలు పోతూ- ఎందుకు స్వామీ దేవునికి కృతజ్ఞతలు... ఈ ఊరి వాళ్లు అన్నం పెట్టనందుకా అని అడిగారట. కాదురా... ఇన్నాళ్లూ అన్ని ఊళ్ల వాళ్లు అన్నం పెట్టినందుకు... పెట్టినన్నాళ్లు దేవుని దయ తెలియలేదు... ఇప్పుడే కదా తెలిసింది అని మళ్లీ కృతజ్ఞతలకు మళ్లుకున్నాడట. అర్థ మైందా...
 చూస్తూ ఉన్నాడు.
 
ఇంత పెద్ద సిటీ. రోడ్లు బాగుండవు. ట్రాఫిక్కు. ఎక్కడ పడితే అక్కడ గుంటలు తవ్వేసి ఉంటారు. మేన్‌హోళ్లు. ఇక ఈ మెట్రో రైలు పనులతో అదో తలనొప్పి. చాలక చైన్ స్నాచర్లు. చీటర్లు. ఫ్రాడ్ మాస్టర్లు. నోట ఏది పెట్టినా కల్తీ ప్లస్ పొల్యూషన్. తోడు పనిచోట రాజకీయాలు ప్రాంతాలను బట్టి స్పర్థలు. ఇవి ఇచ్చే స్ట్రెస్ చాలదా... మళ్లీ ఇంట్లో కూడా స్ట్రెస్ జనరేట్ చేస్తున్నారా?
 గ్యాప్ ఇచ్చి అన్నాడు.
 
థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి. మీకో పెళ్లాం ఉన్నందుకు థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి. మీ పెళ్లానికి మీరున్నందుకు ఆమెను థ్యాంక్‌ఫుల్‌గా ఉండమనండి. మీ ఇద్దరూ ఇవాళ డిన్నర్‌కు వెళ్తే గనక అంతటి మహద్భాగ్యం కలిగించిన దేవునికి థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి. అసలు ప్రాణాలతో ఉన్నందుకు మొదట థ్యాంక్‌ఫుల్‌గా ఉండండి సార్...     ఈ గొడవలన్నీ దూదిపింజల్లా తేలిపోతాయి...
 సాయంత్రం కిక్కురుమనకుండా నేరుగా ఇంటికి చేరుకుని డిన్నర్ ప్లాన్ చేశాడు. కాని పెళ్లికి ఐస్ చేస్తున్నాడేమోనని అనుమానపడుతోంది. చెప్పేశాడు-
 పెళ్లికి వద్దులే. అదేం పెద్ద విషయం కాదు. తర్వాత చూద్దాం.
 ఆశ్చర్యంగా చూసింది.
 
అదేంటి?
 అవును. అలగడానికీ సాధించడానికీ బోలెడన్ని చాన్సులు వస్తాయి. కాని పెళ్లి మాటిమాటికీ చేసుకోరుగా. మీ పిన్నికూతురి పెళ్లికి నేను రావాల్సింది. తప్పు చేశాను. సారీ. దానికి ఇది విరుగుడు. ఇక ఇంతటితో వదిలేద్దాం.
 నవ్వింది.
 
ఇంటికి ఎటు నుంచి వచ్చావ్? ఏదైనా తొక్కి వచ్చావా ఏంటి?
 ఇక ఈ దెప్పిపొడుపు మాటలు వదిలేద్దాం. ప్లీజ్. విసుగ్గా ఉంది. బయట ఉన్న తలనొప్పులు దేశాన ఉన్న తలనొప్పులు చాలవా పడ్డానికి. నువ్వూ నేనూ కూడా ఎందుకు బాధించుకోవడం. హ్యాపీగా ఉందాం సరేనా. గోంగూర మటన్ చెప్పనా?
 సీరియస్‌గా చూసింది.
 నిజం చెప్తున్నావా?
 నిజం.
 
ఫోర్క్‌తో ఖాళీ ప్లేట్‌ను రెండు సార్లు మోగించింది.
 ఏం అక్కర్లేదు. వెళ్దాంలే.
 పర్లేదు.
 వెళ్దాం అంటున్నాగా.
 వెజ్ నూడుల్స్, వైట్ రైస్, గోంగూర మటన్ చెప్పాడు. చివర్లో వెనిల్లా తెమ్మని కూడా. మళ్లీ అన్నాడు.
 మీ అమ్మ మీ అన్నయ్య దగ్గర ఉండటానికి ఇబ్బంది పడుతున్నదని తెలుసు. కావాలంటే కొన్నాళ్లు మన దగ్గర పెట్టుకుందాం. డ్రామా కాదు. నిజంగానే చెప్తున్నా. ఇంకా నీకేదైనా మనసులో ఉంటే అది చెప్పకుండా సాధించే పనిలో మాత్రం దిగకు. వినడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే నాదో రిక్వెస్ట్. అమ్మను చూడ్డానికి ఊరికెళ్లి చాలా రోజులైంది. నువ్వు ప్లాన్ చేస్తే రెండ్రోజులు ఉండి వచ్చేద్దాం.
 
తల కిందకు వంచి ఫోర్క్‌ను టేబుల్ మీద గుచ్చుతూ అలాగే ఉండి తలెత్తి చూసింది.
 మొగుడూ పెళ్లాల కళ్లు. ఏం మాట్లాడుకుంటాయో ఎవరికి తెలుసు.
 మెల్లగా నవ్వి తేలిక పడింది.
 సరే. పాపకు నెక్ట్స్ వీక్ ఎగ్జామ్స్ ఉన్నాయ్. అవి అయ్యాక వెళ్దాం. ఈలోపు బీపీ మెషీన్ ఒకటి పంపు. ఎన్నాళ్ల నుంచో అడుగుతోందిగా. పాపం సంతోషపడుతుంది.
 థ్యాంక్యూ...

ఓయబ్బా... థ్యాంక్యూ...
టూ వీలర్ మీద మధ్యలో కూచోబెట్టుకుంటే పాప దారిలోనే నిద్రపోయింది. ఫ్లాట్‌కు వచ్చాక జాగ్రత్తగా ఎత్తుకొని నిద్రపుచ్చి చీర మార్చుకుని నైటీ తొడుక్కుంది. ఇందాక కావాలని పెట్టుకోలేదు. ఇప్పుడు ఫ్రిజ్ తెరిచి పాలిథిన్ కవర్‌లో దాచిన ఆ కాసిని విరజాజులని తలలో తురుముకుంది. హాల్లోకొచ్చి అంది-
 ఇంకా టీవీ ఎంత సేపు చూస్తావ్... రారాదూ?
 ఊ..ఊ.. అంటూ టీవీ ఆఫ్ చేసి లేచి వచ్చాడు.
 నడుం మీద చేయి వేసింది.
 పొట్ట పెరిగింది. తగ్గించరాదూ?
 
తగ్గిస్తా.
 కొంచెం ట్రై చేసి ఇలాగే హ్యాపీగా ఉందాం. సరేనా?
 సరే.
 థ్యాంక్యూ... ఈసారి కాలు వేసింది.
 మొగుడూ పెళ్లాల చేష్టలు.
 ఆ తర్వాతి చేష్ట ఏమిటో మనకు మాత్రం ఏం తెలుసు?
 - మహమ్మద్ ఖదీర్‌బాబు
 
గమనిక:
20 కథల ఈ మెట్రో సిరీస్ ఇంతటితో ముగిసింది. ఆదరించిన పాఠకులకు కృతజ్ఞతలు.
- రచయిత, 9701332807

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement