నల్ల కాలర్... | Black collar | Sakshi
Sakshi News home page

నల్ల కాలర్...

Published Sat, Jul 4 2015 10:28 PM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

నల్ల కాలర్...

నల్ల కాలర్...

ఆటో తెలిసిపోతూ ఉంది. వెనుక కూర్చుంటే సీట్ మాటిమాటికీ కదిలిపోతూ ఉంది. మీటర్ లేదు. మోత ఒకటి. దానికి తోడు గాలికి వేళ్లాడుతూ నల్లగా మురికిగా అసహ్యంగా ఉన్న ఆ షర్ట్ కాలర్. ఆటో నడుపుతూ ఖాకీషర్ట్‌ను వీపు ఆన్చుకునే సపోర్టింగ్ రాడ్ మీద అటు ఇటుగా పడేసి దానికి ఒత్తుకుని కూచుని ఉన్నాడు. అటు సగం కనిపించడం లేదు. ఇటు సగం మాత్రం వెల్లికిలా వేలాడుతూ కుదుపులకు ఊగుతూ ఊగినప్పుడల్లా నలుపెక్కిన కాలర్‌ని బహిర్గతం చేస్తూ ఉంది. ఆ చొక్కా చాలాకాలంగా ఉతకడం మర్చిపోయినట్టుగా ఉంది. అంగుళం వదలకుండా ముడుతలతో నిండిపోయింది. మరీ ముఖ్యంగా ఆ కాలర్- చారలు పడి, కాటు తేలి, నూనె దిగినట్టుగా ఉబ్బిపోయి, తేమ స్థిరపడిపోయి... దానిని తొడుక్కుంటారా ఎవరైనా? కనీసం ఆ కాలర్‌ని చూస్తూ చూస్తూ ఒంటి మీదకు వేసుకుంటారా ఎవరైనా? ఆ దారిలో ఆటోలు దొరకవు. వెళ్లాల్సిన దారి చెప్తే అసలుకే దొరకవు. ఇది దొరికింది.

ఎంతిమ్మంటావ్?
ఎంతోకొంత చూసుకుని ఇవ్వండి సార్.
ఎటు నుంచి తీసుకెళ్తావ్?
ఎటువైపో చూసుకొని మీరే చెప్పండి సార్.

 రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకుని ఉన్నాడు. చెమట పట్టిన కళ్లతో చూస్తూ ఉన్నాడు. కుట్టించిన ప్యాంట్... ఎర్రగడ్డ బూట్లు... హ్యాండిల్ మీద ఒక వైఖరి లేనట్టుగా ఉన్న చేతి వేళ్లు... పొట్ట దాదాపుగా లేదు. అసలు ఉందో లేదో.
 రాత్రి బాగా వాన పడినట్టుంది కదా.
 ఏమో... పడినట్టే ఉంది సార్.
 స్టేట్ డివైడ్ అయ్యాక ట్రాఫిక్ తగ్గలేదనుకుంటా.
 ఏమో... తగ్గలేదనుకుంటా సార్.

 సడన్‌గా ఆటో స్లో చేసి పక్కకు తీసుకొని అసలు ఏమాత్రం పట్టింపు లేనట్టుగా చాలా అలవాటైన పనే అన్నట్టుగా దాని వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఖాకీ షర్ట్ తీసి తొడుక్కున్నాడు.  దాని మురికి అంటకుండా టీషర్ట్ అతణ్ణి కొంచెం కాపాడింది. కాని మెడ బోసిగా ఉండటం వల్ల కాలర్ వెళ్లి సరిగ్గా అక్కడే అంటుకు కూచుంది. ఒంటి మీద ముళ్లు వచ్చాయి. చేసేది లేదు. ఆటో మళ్లీ కదిలింది.
 పోలీసులు కనిపిస్తే ప్రాబ్లం సార్. యూనిఫామ్ లేదని ఫైన్ రాస్తారు. వచ్చిన ఆ కాస్తా దానికే పోతుంది.
 
ఎంత సంపాదిస్తావ్?

 ఎంత సార్. పెట్రోలూ కిరాయి పోను రోజుకు నాలుగొందలు మిగిలితే ఎక్కువ. తెల్లారి నాలుక్కు లేస్తా. పదకొండు దాకా తోల్తా. ఇద్దరు చిన్నపిల్లలు. నా భార్య పనికి పోతుంది. అదొచ్చే దాకా ఇంట్లోనే ఉండిపోతా.ఆటో నీలుగుతూ ఉంటే ఆ సంగతి పట్టించుకోకుండా టకాపకా గేరు మారుస్తూ మళ్లీ అన్నాడు. అది కూడా పెద్దగా ఏం తేదు సార్. గ్యారంటీ లేని పని. ఒకరోజు ఉంటుంది. ఒకరోజు ఉండదు. మేస్త్రిని బట్టి. రోజంతా చేస్తే సాయంత్రానికి కమీషన్ పట్టుకుని రెండొందలో రెండొందల యాబయ్యో ఇస్తారు. అవైనా నిలుస్తాయా? డాక్టర్ తింటాడు. బస్తీలో ఉంటాం గదా సార్. నీళ్లు తాగితే చాలు బిడ్డలకు జ్వరాలు వచ్చేస్తాయ్. అవేం నీళ్లో ఏమో. ఫోన్ మోగింది.చూసుకున్నాడు. ఎత్తలేదు. నా భార్యకు ఏదైనా పనుంటే చెప్పండి సార్. ఫ్యాక్టరీ పని. చురుగ్గా చేస్తుంది. మళ్లీ ఫోన్ మోగింది.చూసుకున్నాడు. ఎత్త లేదు. మళ్లీ మోగుతుంటే ఎత్తి-ఇదిగో తమ్ముడూ... తప్పూ... తెల్లారి ఒకసారి చేశావ్. చెప్పావ్. మళ్లీ మళ్లీ చేస్తున్నావ్. అలా చెయ్యొద్దు. పెట్టెయ్.

 ఫోన్‌ని పై జేబులో పడేసి హ్యాండిల్ మీద చేయి ఉంచాడు. ఆటో నత్తులు కొడుతూ పోతూ ఉంది. మెట్రో పని ఎక్కడికక్కడ దారి నిలువరిస్తూ ఉంది. మళ్లీ ఫోన్ మోగింది. ఎత్తాడు. ఏయ్ బాబూ... ఏంటి... ఏంటమ్మా... దాని సంగతి నీకెందుకు చెప్పూ... తోటి పనోనివైతే నీ పని నువు చేసుకో... పైసలు తీసుకుని ఇంటికి పో... అంతేగానీ... ఆ... ఏంటి... ఆ మేస్త్రిని ఏమనకు. మంచోడు. అన్న లెక్క. పనిలో ముందూ వెనుకా అయ్యి లేటైనా ఇంటి దాకా వచ్చి దించేసి పోతాడు. సొంత మనిషి. ఏంటి... ఆ... ఏయ్... ఇంక మాట్లాడకు. పెట్టేశాడు. యాక్సిలేటర్ పెంచాడు. గోలలో ఏదో గొణుక్కున్నాడు. మళ్లీ ఫోన్ మోగింది. ఆలోచించాడు. మళ్లీ మోగింది. విసురుగా తీశాడు....

 ఏంటబ్బాయ్.... ఏంటి... తెలుసుకోవాలా? ఏం తెలుసుకోవాలి. ఇంకొక్కసారి చేశావంటే చెప్పుతో కొడతా.... అసలెక్కడున్నావ్ నువ్వు... ఉండొస్తున్నా... నీ ... ఈసారి అటువైపు కట్టైపోయింది. కొంచెం గస పోశాడు.ఏమైంది? ఎవడో ఎదవ సార్. నా భార్య గురించి నోటికొచ్చింది వాగుతున్నాడు. ఆ మాట అని అంతకుమించి మాట్లాడకుండా చాలాసేపు ఆటో నడపడం మీదే ధ్యాస పెట్టాడు. మధ్య మధ్య ముఖం తుడుచుకుంటూ ఉన్నాడు. మెల్లగా గొణుక్కుంటూ ఉన్నాడు. ఆటో ఎత్తెత్తి వేస్తుంటే మెడ దగ్గర పట్టిన చెమట కాలర్‌లోకి ఇంకిపోతూ ఉంది.ఇంకొక్క ఫర్లాంగ్. దిగాల్సిన చోటు వచ్చేస్తుంది. మార్పు తెలుస్తూ ఉంది. ఎవరితో ఒకరితో చెప్పేసుకోవాలి. మెడ పక్కకు తిప్పుతూ ఆగలేనట్టుగా అనేశాడు. ఏదో తెలుసుకోవాలట సార్ నేను. వాడి దగ్గరకు వెళితే ఏదో తెలియచేస్తాడట. ఏం తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి. నాకు తెలిసింది చాలదా? ఈ లోకం చాలా కతర్నాక్‌ది. ఇక్కడ బతకడం చాలా కష్టం. రోజూ పని చేసి నాలుగు రూపాయలు సంపాదించింది పెళ్లాం బిడ్డల పొట్ట పోసి ప్రాణాలు కాపాడుకోవడం ఇంకా కష్టం. ఆ ఒక్క సంగతి నాకు బాగా తెలుసు సార్. అది తెలిస్తే చాలదా? వేరేవి కూడా తెలియాలా? తెలుసుకొని ఏ నెత్తిన పెట్టుకునేది నేను... అరె.... బతుకుదాం అంటే బతకనివ్వరేం సార్.. ఎలాగోలా బతుకుదాం అంటే బతకనీరేం?...

 గొంతు ఒణుకుతూ ఉండగా చేతులు కంపిస్తూ ఉండగా ఆటో ఆపి షర్టు విప్పి సపోర్టింగ్ రాడ్ మీద పడేసి దాని వైపు చూడనైనా చూడకుండా మాట్లాడుకున్న డబ్బు కోసం నిలుచున్నాడు. నల్లగా మురికిగా అసహ్యంగా ఉన్న ఆ కాలర్ యధావిధిగా వేలాడుతూ గాలికి అటూ ఇటూ ఊగుతూ ఉంది.
 - మహమ్మద్ ఖదీర్‌బాబు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement